నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేశారు

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. నువ్వా- నేనా అన్నట్లు పోటీ పడుతున్న అభ్యర్థులు.. ఒకరిని మించి మరొకరు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి తోడుగా ఆయన సతీమణి లక్ష్మీ కూడా రంగంలోకి దిగారు. గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను, విమర్శలను తిప్పికొడుతున్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, కాంట్రాక్టుల కోసం మాత్రం కాదని స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ అధిష్టానం నుంచి ఆఫర్ వచ్చినా ఎన్నికల్లో పోటీ చేయనని V6, వెలుగు పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారామె.

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో నియోజకవర్గం ప్రజల నుంచి బీజేపీకి విశేష స్పందన వస్తోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ రాజగోపాల్ అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నిర్ణయం సరైందని చాలామంది తమకు చెబుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవడం ప్రజలే స్వయంగా తమకు చెబుతుంటే.. రాష్ట్రంలో మార్పు తప్పనిసరి అనిపిస్తోందన్నారు. రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేయడం అవివేకం అని కొట్టిపారేశారు. లేని పోని ఆరోపణలు, విమర్శలు చేయడం వల్లే టీఆర్ఎస్ కే నష్టం జరుగుతుంది తప్ప.. రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతి ఇంటి సమస్యను ఆయన సమస్యలా భావిస్తారని, ప్రజలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి గురించి తెలిసినవాళ్లకు ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసన్నారు. 

బీజేపీతోనే రాష్ట్రాభివృద్ది

చాలామందికి సొంత ఇండ్లు లేవని, డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా తమ దృష్టికి వచ్చాయని లక్ష్మీ రాజగోపాల్ అన్నారు. ఇప్పటికీ చాలామందికి పెన్షన్లు అందడం లేదన్నారామె. ప్రచారం కోసం గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజా సమస్యలు చూస్తుంటే ఈ ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని అనిపిస్తోందన్నారు. గెలిచిన తర్వాత కూడా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాజగోపాల్ రెడ్డితో ఇప్పటికే చర్చించానని చెప్పారు. జనరల్ ఎలక్షన్స్ వరకూ సాగదీయకుండా ఇచ్చిన హామీలను వెంటనే  నెరవేర్చాలని చెప్పానన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలను పరిష్కరం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

టీఆర్ఎస్ పక్షపాత ధోరణి

రాజీనామా చేయకముందు చాలా సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రుల అపాయింట్ మెంట్ కోసం రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు ప్రయత్నించినా లభించలేదని లక్ష్మీ రాజగోపాల్ చెప్పారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం చాలా తాపత్రయం పడ్డారని, అయినా మంత్రులు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చూపించిన పక్షపాత ధోరణి వల్లే ఇవాళ మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిందన్నారు. 

అందరి సలహాలతోనే రాజీనామా

కాంగ్రెస్ పార్టీ అంటే తమకు ఎంతో అనుబంధం ఉందని లక్ష్మీ రాజగోపాల్ చెప్పారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలోనూ కాంగ్రెస్ బలహీనంగా ఉందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి ఏమీ చేయించుకోలేకపోతున్నామనే ఆవేదన రాజగోపాల్ రెడ్డిలో ఉండేదన్నారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకునే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి ఒక అనేది పునాదిలాంటిదని, రాబోయే ఎలక్షన్స్ లో తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నారు.

ప్రతిపక్షాల ప్రచారం అబద్దం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులోనే ఉండరనే ప్రచారం అబద్దమని లక్ష్మీ రాజగోపాల్ కొట్టిపారేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ, సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న కాంట్రాక్టు ఆరోపణలు తప్పని అన్నారు. తమ కంపెనీ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామని, లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ కంపెనీకి గ్లోబల్ టెండరింగ్ ద్వారానే కాంట్రాక్టు వచ్చిన విషయం అందరికీ తెలుసన్నారు. 

అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎప్పటికీ చెరగనిది

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎప్పటికీ ఉంటుందని లక్ష్మీ రాజగోపాల్ చెప్పారు. ఇద్దరి పార్టీలు వేరైనా వారి మధ్య ప్రేమ, అప్యాయతలు మాత్రం ఎప్పటికీ తగ్గవన్నారు. వారికి ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ ఉంటుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి, బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో తమకు ఏ పార్టీ కూడా పోటీ కాదని చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు రాజగోపాల్ రెడ్డికి సరితూగరని అన్నారు. 

మహిళలను భయపెడుతున్నారు

ప్రచారం కోసం ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో తాము అనేక ప్రజా సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. వాస్తవానికి మహిళలు కొంత గందరగోళంలో ఉన్నారని, వారిని టీఆర్ఎస్ కు చెందిన వాళ్లు భయపెడుతున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు నిలిపివేస్తారనే ప్రచారం చేయడం వల్ల చాలామంది మహిళలు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారని తెలిపారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి.. బీజేపీపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తోందన్నారు. 

రాజకీయాల్లోకి రాను

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తల్లి ‘సుశీలమ్మ ఫౌండేషన్’ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని లక్ష్మీ రాజగోపాల్ చెప్పారు. కోవిడ్ సమయంలో 40 వేల కుటుంబాలకు కరోనా కిడ్స్ తో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని, ఆ అభిమానం తాము గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా కన్పిస్తోందన్నారు. భవిష్యత్తులోనూ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదన్నారు. ఒకవేళ బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చినా పోటీ చేయనని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల సూచనతో ఎమ్మెల్సీగా పోటీ చేశానని చెప్పారు. తప్పనిసరిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని మునుగోడు ఓటర్లకు లక్ష్మీ రాజగోపాల్ పిలుపునిచ్చారు.