లక్ష్ చదలవాడ (Lakshy) హీరోగా విక్రాంత్ శ్రీనివాస్ (Vikranth Srinivas) దర్శకత్వంలో ఇవాళ( ఫిబ్రవరి 2న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ధీర(Dheera). చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి నిర్మించారు.యూనిక్ పాయింట్‌తో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
విశాఖపట్నంకు చెందిన రణ్‌ధీర్(లక్ష్ చదలవాడ)కు డబ్బు అంటే వీపరీతమైన పిచ్చి. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఎవ్వరి కోసం ఏ పని ఫ్రీగా చేయడు. మనీ కోసం ఎంతటి సాహసం చేయడానికైనా వెనుకాడడు. అలాంటి ధీర్ కు ఒక పని చేస్తే..పాతిక లక్షల రూపాయలు వస్తాయని ప్రముఖ ఆస్పత్రి ఇచ్చిన ఆఫర్ తో కోమాలో ఉన్న పేషెంట్ ని హైదరాబాద్ తీసుకువెళ్లేందుకు రెడీ అవుతాడు. రాజ్‌గురు అనే పేషెంట్‌ని అంబులెన్స్ డ్రైవర్గా హైదరాబాద్‌కి తీసుకెళ్తే..పాతిక లక్షలు ఇస్తామనే ఆఫర్ తెగ నచ్చేస్తుంది.
అలా రణ్‌ధీర్‌ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశతో రణ్‌ధీర్ వెంటనే పనిచేయడానికి సిద్దపడుతాడు. అప్పుడు ఆ అంబులెన్స్లో పేషెంట్‌ని చూసుకోవడానికి వచ్చే డాక్టర్ తన మాజీ ప్రేయసి అమృత(నేహా పఠాన్) అని తెలుస్తోంది.వీరికి తోడుగా మరో డాక్టర్ (మిర్చి కిరణ్) కూడా వెళ్తాడు. ఈ ముగ్గురితో కలిసి అంబులెన్స్‌లో హైదరబాద్‌కి బయలుదేరిన పేషెంట్ ని చంపడానికి కొన్ని గ్యాంగులు ప్రయత్నిస్తూ ఉంటాయి.రణ్ ధీర్ చాకచక్యంగా ఆ పేషెంట్ ని హైదరాబాద్ హాస్పిటల్ కి తరలిస్తాడు. అలాంటి క్రమంలోనే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద పదవిలో ఉన్న హంసలేఖ దేవి (హిమజ)..ఓ పోలీస్ ఆఫీసర్కి(భరణి శంకర్)..ఓ పాపను ప్రాణాలతో తీసుకురావాలంటూ పంపిస్తుంది.
ధీర్ అంబులెన్స్లో ఉన్నపేషేంట్ని హాస్పిటల్లో చేర్చి రిటర్న్ వచ్చే సమయంలో అతనికి తెలియకుండానే ఒక తల్లి బిడ్డ తన వాహనంలో ఉందనే విషయం తెలుసుకుంటాడు. అలాంటి క్రమంలో తనకు ఎదురైనా అంశాలేంటీ? అసలు రాజ్ గురు ఎవరు? ఓ గ్యాంగ్ స్టార్ ముఠా ఎందుకు అతనిపై దాడికి ప్రయత్నిస్తుంది? అసలు రాజ్‌గురును హైదరాబాద్ ఎందుకు తరలించాల్సి వచ్చింది? లేదా? కీలక పదవిలో ఉన్నహంసలేఖ ఎవరు? ఆ పాపకు రాజ్‌గురుకు ఉన్న సంబంధం ఏంటి? రాజ్‌గురుకు ముఖ్యమంత్రి(సుమన్)తో ఉన్న సంబంధం ఏంటి? ఇలా విభిన్నమైన ప్రశ్నలతో కొనసాగిన ధీర్ ప్రయాణం ఎంత వరకు వచ్చింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ధీర’ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
ఆద్యంతం రాజకీయ నేపథ్యంతో సాగే ఈ స్టోరీలో ప్రేక్షకులకు ఊహించని ట్విస్టులు..రెండు డిఫరెంట్ లవ్‌స్టోరీలు, అందులో వెంటాడే భారీ యాక్షన్ సీన్స్ ఇలా అన్ని వర్గాల వారికి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. అయితే డైరెక్టర్ విక్రాంత్ శ్రీనివాస్ పేపర్‌పై బలంగా రాసుకున్న స్టోరీని అంతే బలంగా స్క్రీన్ పై ప్రసెంట్ చేయడంలో కాస్తా తడబడ్డాడు. హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే చాలా సీన్స్ ఏదో ఒక సినిమాల్లో చూసినట్టు గుర్తుకు తెస్తాయి. రాజ్‌గురు వెనుక ఉన్న స్టోరీ ఏంటనేది మాత్రం క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడు పసిగట్టకుండా చేయడంలో డైరెక్టర్ విజయవంతం అయ్యాడు.
హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రాజ్‌గురుని అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించేందుకు డాక్టర్లు ప్రయత్నించడం.. మరోవైపు కీలకపదవిలో ఉన్న హంసలేఖ ఫోన్ ద్వారా వైద్యులకు సూచనలు ఇవ్వడం..ఇలా చాలా ఆసక్తికరంగా స్టోరీ మొదలవుతుంది. లక్ష్ ఎంట్రీ స్టార్ హీరో రేంజ్‌లో చూపించిన తీరు బాగుంది. కారు రేసింగ్ సీన్‌తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో మొదట్లోనే రివీల్ చేశాడు. మీనాక్షితో రణ్‌ధీర్ సాగించిన లవ్‌స్టోరీ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. హీరో లవ్‌స్టోరీలో వచ్చే ట్విస్ట్ రివీల్ అయ్యాక మరింత ఇంట్రెస్టింగ్ హైప్ పెరుగుతోంది.
భారీ యాక్షన్..రొమాంటిక్ సీన్స్..ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌లో వచ్చే సీన్ సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్లో ఒక్కో ట్విస్టు రివీల్ చేస్తూనడిపించిన స్టోరీని చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. తన అంబులెన్స్లో ఉన్న పాప ఎవరు? ఆమె కోసం వెతుకుతున్న మనుషులెవరు? అనేది తెలుసుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నం మాత్రం సాగదీతగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే..
డబ్బు కోసం ఏమైనా చేసే యువకుడి పాత్రలో లక్ష్ చదలవాడ తనదైన స్టైల్ లో నటించాడు. విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో లక్ష్య్. ఈ సినిమాలో రణ్‌ధీర్ అనే డిఫరెంట్ పాత్రను పోషించి ఆద్యంతం మెప్పించాడు. యాక్షన్ సీన్స్ అయితే అదరగొట్టేశాడు. హీరో ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.అలాగే రొమాంటిక్ సీన్స్ లో చక్కగా నటించాడు.
డాక్టర్ అమృతగా నేహా పఠాన్, మనీషాగా సోనియా బన్సాల్ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సోనియా బన్సాల్ కి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ..ఉన్నంతలో తన మార్క్ చాటుకునే ప్రయత్నం చేసింది. మిర్చి కిరణ్ కామెడీ సినిమాకు ప్లస్ అయింది. సీఎం క్యారెక్టర్ లో సుమన్, ఆయన పీఏ పాత్రలో హిమజ ఆకట్టుకున్నారు. భరణి శంకర్, సామ్రాట్, వైవా రాఘవ్, భూషణ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు.
టెక్నీషియన్స్:
టెక్నీకల్గా ఈ సినిమా పర్వాలేదు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కన్నా పీసీ సినిమాటోగ్రఫీ బాగుంది. వినయ్ రామస్వామి ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. తన కత్తెరకు ఇంకాస్త పని చెప్సాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.