- జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులకు దక్కిన లక్ష్య, ఎన్ క్వాస్, ముస్కాన్ రివార్డులు
- ఏడాది గడిచినా నయా పైసా అందలేదు
- నిరాశలో వైద్య సిబ్బంది
సంగారెడ్డి, వెలుగు: జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు నాణ్యతా ప్రమాణాలు పాటించి ఉత్తమ వైద్య సేవలు అందించినందుకు ఏడాది కింద కేంద్ర బృందం లక్ష్య, ఎన్ క్వాస్, ముస్కాన్ అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డులకు అనుగుణంగా కేంద్రం నగదు ప్రోత్సాహకాన్ని అందించాల్సి ఉంది. అవార్డులతో గుర్తింపు వచ్చింది కానీ ప్రోత్సాహకంగా ప్రకటించిన ఫండ్స్ మాత్రం అందలేదని వైద్య సిబ్బంది తీవ్ర నిరాశలో ఉన్నారు. సంగారెడ్డి మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) లక్ష్య, ముస్కాన్ అవార్డుకు ఎంపికైంది.
310 స్కోర్ తో ముస్కాన్ కు ఎంపిక కాగా ఏడాదికి రూ.12 లక్షల చొప్పున మూడేళ్లకు రూ.36 లక్షలు మంజూరు చేయాల్సి ఉంది. ఇదే ఎంసీహెచ్ లక్ష్య అవార్డుకు కూడా ఎంపిక కాగా దీని కింద ఏడాదికి రూ.12 లక్షల చొప్పున మూడేళ్లకు రూ.36 లక్షలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఏడాది గడిచినా ఈ రెండు అవార్డుల కింద ఇప్పటివరకు పైసా ఇయ్యలేదు.
అలాగే జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి, సంగారెడ్డిలోని మార్క్స్ నగర్, ఇందిరానగర్ యూపీహెచ్ సీ తోపాటు మునిపల్లి, బొల్లారం, న్యాల్కల్, ఆత్మకూర్, కొండాపూర్, జరాసంఘం, కంగ్టి, రాయికోడ్, మొగుడంపల్లి, రామచంద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్ క్వాస్ అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ అవార్డు కింద ఆయా ఆరోగ్య కేంద్రాలకు రూ.3 లక్షల చొప్పున మూడేళ్లకు రూ.9 లక్షలు ఇవ్వాల్సి ఉంది. వీటికి కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. దీంతో వైద్య సిబ్బందిలో అసంతృప్తి నెలకొంది.
25 శాతం సిబ్బందికి..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రోత్సాహక బహుమతిలో ఆస్పత్రి అభివృద్ధికి 75 శాతం, మిగతా 25 శాతం సిబ్బందికి అందజేస్తారు. లక్ష్య, ఎన్ క్వాస్, ముస్కాన్ అవార్డుల ఎంపికకు ముందు రెండు, మూడు నెలలపాటు సిబ్బంది శ్రమించారు. క్షేత్రస్థాయిలో నాణ్యత ప్రమాణాల మెరుగు, రికార్డుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తారు.
దీనికి అనుగుణంగా వివిధ ఆస్పత్రుల అధికారులు, వైద్య సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి గుర్తింపు తీసుకురావాల్సి ఉంటుంది. కానీ కష్టానికి తగిన ఫలితం దక్కకపోవడంతో పలు ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆస్పత్రులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు రిలీజ్ చేయాలని కోరుతున్నారు.