జకర్తా : ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 21–9, 21–14తో టకుమా ఒబయాషి (జపాన్)పై నెగ్గాడు. బలమైన స్మాష్‌లు, క్రాస్ కోర్టు ర్యాలీలతో చెలరేగిన లక్ష్య 39 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. ఇక విమెన్స్ సింగిల్స్‌లో పీవీ సింధు 20–22, 12–21తో తుయ్ లిన్హ్ ఎంగుయెన్ (వియత్నాం) చేతిలో ఓడింది.
ఇతర మ్యాచ్‌ల్లో తన్యా హేమంత్ 14–21, 11–21తో రచ్చనోక్ ఇంతనోన్ (థాయ్‌లాండ్) చేతిలో, అనుపమ ఉపాధ్యాయ 12–21, 5–21తో మరిస్కా తున్‌జుంగ్ (ఇండోనేసియా) చేతిలో, సంతోష్ రామరాజ్ 17–21, 19–21తో మియాజాకీ (జపాన్) చేతిలో, ఆకర్షి కశ్యప్ 10–21, 13–21తో ఒకుహర (జపాన్) చేతిలో కంగుతిన్నారు. మెన్స్ సింగిల్స్‌లో ఆయుష్ షెట్టి 19–21, 19–21తో షి యు కీ (చైనా) చేతిలో, కిరణ్ జార్జ్ 12–21, 10–21తో జియోన్ జిన్ (కొరియా) చేతిలో, ప్రియాన్షు రజావత్ 14–21, 21–13, 18–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో 21–18, 21–14తో అద్నాన్ మౌలానా–కాహ సారి జెమిల్ (ఇండోనేసియా)పై నెగ్గగా, రోహన్ కపూర్–రుత్వికా శివాని 9–21, 13–21తో గ్రెగరీ మైర్స్–జెన్సీ మైర్స్ (ఇంగ్లండ్) చేతిలో ఓడారు.