All England 2025: ముగిసిన లక్ష్య సేన్ పోరాటం.. క్వార్టర్ ఫైనల్లో లీ షిఫెంగ్ చేతిలో ఓటమి

All England 2025: ముగిసిన లక్ష్య సేన్ పోరాటం.. క్వార్టర్ ఫైనల్లో లీ షిఫెంగ్ చేతిలో ఓటమి

ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ లో స్టార్ ఇండియన్ షట్లర్ లక్ష్య సేన్ కథ ముగిసింది. అతను క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంటిదారి పట్టాడు.   శుక్రవారం (మార్చి 14) జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన లి షిఫెంగ్ చేతిలో వరుస గేమ్ లలో పరాజయం పాలయ్యాడు. 45 నిమిషాల పాటు ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో మాజీ ఛాంపియన్ షిఫెంగ్ చేతిలో 21-10, 21-16 తేడాతో ఓడిపోయాడు.

ఈ మ్యాచ్‌కు ముందు సేన్.. షిఫెంగ్‌పై అద్భుత రికార్డ్ కలిగి ఉన్నాడు. థామస్ కప్‌లో జరిగిన మ్యాచ్‌తో సహా గత ఓవరాల్ గా రెండు మ్యాచ్‌లలో లక్ష్య సేన్ ఈ చైనా ప్లేయర్ ను ఓడించాడు. అయితే కీలకమైన క్వార్టర్ ఫైనల్స్‌లో చేతులెత్తేశాడు. మొదటి గేమ్‌లో సేన్ 10-21 తేడాతో ఘోరంగా ఓడాడు.  రెండవ గేమ్‌లో కాస్త ప్రతిఘటించినా ఒత్తిడిలో పాయింట్లను కోల్పోయాడు. 11-8 తో రెండో గేమ్ లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. 16-21 తేడాతో రెండో గేమ్ చేజార్చుకుని మ్యాచ్ ఓడిపోయాడు.

ALSO READ | IPL 2025: అనుభవాన్ని ఏదీ ఓడించలేదు.. దిగ్గజ క్రికెటర్‌పై కోల్‌కతా కెప్టెన్ ప్రశంసలు

 ప్రీ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్‌పై అద్భుతమైన విజయం సాధించిన సేన్.. క్వార్టర్ ఫైనల్లో ఆ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. లక్ష్య సేన్ టైటిల్ ఫేవరేట్ క్రిస్టీని ప్రీ క్వార్టర్ ఫైనల్లో 21-13, 21-10 స్కోరుతో ఓడించిన తర్వాత మరో సంచలనం కోసం ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. 

ప్రతిష్టాత్మక ఆల్‌‌ ఇంగ్లండ్‌‌ బ్యాడ్మింటన్ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు గురువారం (మార్చి 13) తొలి రౌండ్‌‌లోనే ఓడి ఇంటిదారి పట్టింది. గాయం నుంచి కోలుకొని వచ్చిన సింధు బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్‌‌ తొలి పోరులో 21–19, 13–21, 13–21తో కొరియాకు చెందిన 21వ ర్యాంకర్  షట్లర్ కిమ్‌‌ గ యున్‌‌ చేతిలో మూడు గేమ్స్ పాటు పోరాడి ఓడింది.