
పారిస్ : ఇండియా నుంచి భారీ అంచనాలతో ఏడుగురు షట్లర్లు బరిలో నిలవగా.. వారిలో లక్ష్యసేన్ ఒక్కడే పతక రేసులో మిగిలాడు. హ్యాట్రిక్ ఒలింపిక్ మెడల్‌పై గురి పెట్టిన పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరగ్గా... గోల్డ్ తెస్తారని అనుకున్న డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు. కానీ, అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే సంచలన ఆట తీరుతో ముందుకెళ్తున్న యంగ్‌స్టర్ లక్ష్యసేన్ సెమీఫైనల్ చేరి పతక ఆశలు సజీవంగా నిలిపాడు. ఆదివారం జరిగే సెమీస్‌లో టోక్యో ఒలింపిక్ చాంప్ విక్టర్ అక్సెల్సెన్‌తో సవాల్‌కు సిద్ధమయ్యాడు.
గ్రూప్ చివరి మ్యాచ్‌లో వరల్డ్ నం.4 జొనాథన్ క్రిస్టీ, ప్రిక్వార్టర్స్‌లో తోటి షట్లర్ ప్రణయ్, గత పోరులో 11వ ర్యాంకర్ చో టైన్ చెన్ (చైనీస్ తైపీ) సవాల్‌ను ఛేదించి జోరు మీదున్నాడు. అదే ఊపులో వరల్డ్ నం. 2 విక్టర్‌ను కూడా ఓడించి ఫైనల్ చేరితే కనీసం రజతం ఖాయం అవుతుంది. కానీ, అది అంత ఈజీ కాబోదు. 30 ఏండ్ల డెన్మార్క్ స్టార్ విక్టర్ ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి షట్లర్లలో ముందున్నాడు. అద్భుత ఆట, అనుభవం అతని సొంతం. టోక్యోలో గోల్డ్, రియో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ గెలిచిన విక్టర్ ఖాతాలో రెండు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిళ్లు కూడా ఉన్నాయి.
పైగా, అతనితో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో సేన్ ఏడుసార్లు ఓడిపోయాడు. 2022లో ఒకేసారి గెలిచాడు. ప్రిక్వార్టర్స్‌లో బై లభించడంతో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు వచ్చిన విక్టర్ మాజీ వరల్డ్ వరల్డ్ చాంపియన్ లో కీన్ యివ్‌ను సునాయాసంగా ఓడించి సెమీస్‌లో అడుగు పెట్టాడు. అయితే, ఈ సీజన్‌లో విక్టర్ గొప్ప ఫామ్‌లో లేకపోవడం సేన్‌కు కలిసొచ్చే అంశం.