
బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇండియా స్టార్ షట్లర్ లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. వరల్డ్ రెండో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీకి షాకిస్తూ క్వార్టర్స్ ఫైనల్ చేరుకున్నాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–-13, 21–-10తో వరుస గేమ్స్‌లో ఇండోనేసియా స్టార్ క్రిస్టీని ఓడించాడు. ఆరంభం నుంచే అదరగొట్టిన సేన్ కేవలం 36 నిమిషాల్లోనే అతని పని పట్టాడు.
విమెన్స్ సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో మాళవిక బన్సొద్ 16–21, 13–21తో రెండుసార్లు వరల్డ్ చాంపియన్ అకానె యమగూచి (జపాన్) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. దాంతో విమెన్స్ సింగిల్స్‌లో ఇండియా పోరాటం ముగిసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో రుత్విక శివాని– -రోహన్ కపూర్ జంట 10–-21, 12–-21తో ఫెంగ్ యాన్ జి– - వీ యాక్సిన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. బుధవారం రాత్రి జరిగిన మెన్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 21–17, 21–15తో డెన్మార్క్‌కు చెందిన డానియెల్–వెస్టెర్గార్డ్పై నెగ్గి రెండో రౌండ్ చేరారు.