ముంబై: ఇండియాలో వినాయక చవితి ఎంత పెద్ద పండుగో తెలిసిందే. ఈ పండగ టైమ్‌లో గల్లీ గల్లీల్లోనూ గణేశ్ విగ్రహాలతో 11 రోజులు ఉండే కోలాహలం అంతా ఇంతా కాదు. అయితే ఈ ఏడాది మాత్రం ఆ సంబురాలు జరగడం అనుమానంగా మారింది. కరోనా రక్కసి వ్యాప్తి రోజురోజుకీ ఎక్కువవుతోంది. వ్యాక్సిన్ రావడానికి కూడా టైమ్ పడుతుందన్న వార్తల నేపథ్యంలో గణేశ్ ఫెస్టివల్ జరగడం డౌటే. వినాయక ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ముంబైలో జరిగే లాల్‌బగ్చా రాజా గణేశ్ ఈవెంట్ స్పెషల్. అయితే కరోనా భయం కారణంగా ఈ సంవత్సరం లాల్‌బాగ్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. 87 ఏళ్ల లాల్‌బాగ్చా హిస్టరీలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కానుంది.
‘ఈ ఏడాది గణేశ్ ఫెస్టివల్‌ను జరుపుకోవద్దని మేం నిర్ణయించుకున్నాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ ఫెస్టివల్‌ను మామూలుగా సెలబ్రేట్ చేసుకుంటాం. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ డెసిజన్ తీసుకున్నాం. పండుగ జరిగే ఆ పది రోజుల్లో మేం బ్లడ్ డొనేషన్ క్యాంపు, ప్లాస్మా డొనేషన్ కోసం అవేర్‌నెస్ క్యాంపు పెడతాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులు, పోలీసుల ఫ్యామిలీస్‌ను సత్కరించనున్నాం. అలాగే కరోనాపై పోరాటం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు డొనేట్ చేయనున్నాం’ అని లాల్‌బాగ్ మండల్ సెక్రటరీ సుధీర్ సాల్వీ తెలిపారు.