తండ్రి అలా.. కొడుకు ఇలా.. బీహార్ పాలిటిక్స్‎లో అసలేం జరుగుతోంది..?

తండ్రి అలా.. కొడుకు ఇలా.. బీహార్ పాలిటిక్స్‎లో అసలేం జరుగుతోంది..?

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన కామెంట్స్ ఆ రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించాయి. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన లాలు ప్రసాద్ యాదవ్.. బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్‎పై చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‎లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నితీష్ కుమార్ మళ్లీ మాతో కలవచ్చని.. అతడి కోసం ఆర్జేడీ తలుపులు తెరిచే ఉంటాయని ఓపెన్ ఆఫర్  ఇచ్చారు లాలు ప్రసాద్. గతంలో మమల్ని మోసం చేసి వెళ్లిపోయిన నితీష్ కుమార్‎ను ఆర్జీడీ క్షమించిందని.. అతడిని క్షమించడం నా కర్తవ్యం అంటూ హాట్ కామెంట్స్ చేశారు బీహార్ మాజీ సీఎం. 

నితీష్ విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్ వైఖరి ఇలా ఉంటే.. ఆయన కుమారుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వాదన మాత్రం మరోలా ఉంది. ఆర్జేడీతో సంబంధాలు తెంచుకుని వెళ్లిన నితీష్ కుమార్‎కు మా పార్టీ తలుపులు మూసుకుపోయాయని.. మరోసారి అతడితో కలిసి పని చేసేదే లేదని తేజస్వీ గతంలోనే తేల్చి చెప్పారు. 2025 నితీష్ కుమార్‌కు వీడ్కోలు పలుకుతామని.. కొత్త సంవత్సరంలో బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని తేజస్వి ధీమా వ్యక్తం చేశారు. 

ALSO READ | 14 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉండి ఏం లాభం.. ఉద్యోగం దొరకలే.. ఆటో డ్రైవర్‌‌గా మారిన గ్రాఫిక్ డిజైనర్

సీఎం నితీష్ కుమార్ ఒక అలసిపోయిన నాయకుడని తేజస్వీ ఎద్దేవా చేశారు. నితీష్ విషయంలో తేజస్వీ వైఖరి ఇలా ఉంటే.. ఆయన తండ్రి లాలూ విధానం మరోలా ఉంది. నితీష్‎తో ఫ్రెండ్ షిప్‎పై తండ్రి కొడుకుల స్టాండ్ పూర్తి విరుద్ధంగా ఉండటంతో ఆర్జేడీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. మోసం చేసిన వెళ్లిన నితీష్‎తో మళ్లీ కలవడం ఏంటని లాలూ ప్రసాద్ యాదవ్ కామెంట్స్‎పై  ఆర్జేడీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ఏదేమైనా న్యూ ఇయర్ వేళ లాలూ చేసిన వ్యాఖ్యలు బీహార్ పాలిటిక్స్‎ను షేక్ చేస్తున్నాయి. 

పోయిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ ప్రసాద్ ఆధ్యర్యంలోని జేడీయూ కలిసి బీహార్‎లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీష్ కుమార్ సీఎం కాగా.. తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కొన్నాళ్ల తర్వాత విభేదాలు రావడంతో నితీష్ కుమార్ ఆర్జేడీకి గుడ్ బాయ్ చెప్పి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో చేతులు కలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని బీహార్‎లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు నితీష్ మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ఈ ఏడాది బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ తాజా కామెంట్స్ బీహార్ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చకు దారి తీశాయి.