ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో లాలూ ఫ్యామిలీకి బెయిల్

ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం  కేసులో లాలూ ఫ్యామిలీకి బెయిల్

ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం  కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వికి బెయిల్ మంజూరైంది. రూ.50 వేల  వ్యక్తిగత పూచీకత్తుపై రోస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టులో విచారణ సందర్భంగా యాదవ్ కుటుంబంతో సహా మొత్తం 17 మంది నిందితులు హాజరయ్యారు.  అంతకుముందు, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ రోస్ అవెన్యూ కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది.2023 అక్టోబర్ 4న హాజరుకావాలని కోర్టు వారిని ఆదేశించింది.  ఈ క్రమంలో వారు కోర్టు ముందు హాజరయ్యారు.  

కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల‌కు మేలు చేసేందుకు 2004-2009 వరకు రైల్వేశాఖ మంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాద‌వ్ త‌న ప‌ద‌విని దుర్వినియోగం చేసిన‌ట్లు సీబీఐ త‌న ద‌ర్యాప్తులో పేర్కొంది. ఎటువంటి నియామ‌క ప్రక్రియ చేప‌ట్టకుండా.. బీహార్‌కు చెందిన యువ‌త‌కు గ్రూపు డీ పోస్టుల్ని కేటాయించిన‌ట్లు లాలూపై సీబీఐ రిపోర్టు ఇచ్చింది. 

ముంబై, జ‌బ‌ల్‌పుర్‌, కోల్‌క‌తా, జైపూర్‌, హాజీపూర్ జోన్ల‌లో బీహారీల‌కు ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ల‌క్ష చ‌ద‌ర‌పు గ‌జాల స్థలాన్ని కేవ‌లం 26 ల‌క్షల‌కే లాలూ ఫ్యామిలీ సొంతం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో 2022లో లాలూపై ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది. లాలూతో పాటు ఆయ‌న భార్య‌, కూతుళ్లు మీసా భార‌తి, హేమా యాద‌వ్‌ల‌పై ఈ కేసు బుక్కైంది.