కుంభమేళాపై లాలూ విషం: ప్రధాని మోదీ

కుంభమేళాపై లాలూ విషం: ప్రధాని మోదీ
  • ఆటవిక రాజ్యాన్ని కోరేవాళ్లకు మన వారసత్వం విలువేం తెలుసు?: మోదీ
  • బిహార్​ పర్యటనలో ప్రధాని ఫైర్​
  • కుంభమేళాకు అర్థంపర్థం లేదన్న లాలూ కామెంట్లకు కౌంటర్​

భాగల్​పూర్​: యావత్ దేశం గర్వించే స్థాయిలో జరుగుతున్న ప్రయాగ్​రాజ్​ కుంభమేళాపై కొందరు విషం చిమ్ముతున్నారని పరోక్షంగా ఆర్జేడీ చీఫ్, బిహార్​ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్​పై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ‘‘వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆటవిక రాజ్యాన్ని నడిపారు. అలాంటి వాళ్లకు మన సంస్కృతి సంప్రదాయాలన్నా.. మన వారసత్వ సంపదన్నా, నమ్మకాలన్నా చిన్నచూపు. అందుకే నోటికి ఏది వస్తే అది వాగేస్తుంటారు. 

విషం చిమ్మడమే వాళ్ల పని” అని దుయ్యబట్టారు. సోమవారం బిహార్​లోని భాగల్​పూర్​జిల్లాలో జరిగిన సభలో మోదీ మాట్లాడారు. ‘‘మన భారతదేశ ఐక్యతను మహా కుంభమేళా చాటిచెప్తున్నది. యూరప్​ జనాభా కన్నా ఎక్కువ మంది ఇప్పటికే అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. బిహార్​ నుంచి కూడా చాలామంది కుంభమేళాకు హాజరయ్యారు. కానీ, ఇక్కడి జంగల్​రాజ్​ వాలాలకు కుంభమేళా అంటే భయంపట్టుకుంది. 

అందుకే ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నరు. ఆటవిక రాజ్యాన్ని కాంక్షించేవాళ్లకు మన వారసత్వం విలువేం తెలుసు? అయోధ్యలో రామ మందిరాన్ని కూడా వాళ్లు వ్యతిరేకించారు. అలాంటి వాళ్లను బిహార్​ ఎప్పటికీ క్షమించదు” అని హెచ్చరించారు. పేరు ప్రస్తావించకుండానే లాలూ ప్రసాద్​ను ఉద్దేశించి ఆయన అన్నారు. ఇటీవల కుంభమేళాకు వెళ్తూ ఢిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్​ యాదవ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘అసలు కుంభమేళాకు అర్థం పర్థం ఉందా? ఎందుకు చేస్తున్నరు” అని కామెంట్లు చేశారు. వీటిని ప్రస్తావిస్తూ మోదీ పైవిధంగా స్పందించారు.

పీఎం కిసాన్​ నిధులు విడుదల

‘మఖానా’ అంటే తనకు ఇష్టమని, ఏడాదిలో 300 రోజులు తన ఆహారపదార్థాల్లో మఖానా ఉండేలా చూసుకుంటానని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బిహార్​ రైతుల కోసం మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్​లో ప్రకటించిందని, దీని ద్వారా ఇక్కడి మఖానా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. 

కాగా, దేశవ్యాప్తంగా ‘పీఎం కిసాన్​’ 19వ ఇన్​స్టాల్​మెంట్​ నిధులను ప్రధాని మోదీ ఇదే వేదిక నుంచి విడుదల చేశారు. 9.8 కోట్ల మంది రైతులకు రూ. 2,000 చొప్పున వారి ఖాతాల్లో జమచేశారు. ఇందులో 2.41 కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉన్నారని మోదీ చెప్పారు. 19వ విడత కోసం రూ.22వేల కోట్లు రిలీజ్​ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు పీఎం కిసాన్​ కింద కేంద్ర ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్లు రైతులకు అందజేసిందని ఆయన వివరించారు.

 ‘‘పశువుల దాణాను కూడా మెక్కినవాళ్లకు రైతుల సంక్షేమం గురించి ఏం తెలుసు? రైతుల గురించి వాళ్లెందుకు ఆలోచిస్తరు” అని లాలూ దాణా కేసును ప్రస్తావిస్తూ విమర్శించారు. ప్రధాని మోదీని బిహార్​ రైతులు ‘మఖానా’ దండతో సత్కరించారు. మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 

ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్​లో ప్రధాని మోదీ ఈ సభ ఏర్పాటు చేయడం ద్వారా ముందస్తుగానే ఎన్నికల ప్రచారంలోకి దిగినట్లయింది. వేదికపై ఆయన వెంట ఎన్డీయే భాగస్వామ్య పార్టీ జేడీయూ చీఫ్​, బిహార్​ సీఎం నితీశ్​కుమార్​కూడా ఉన్నారు.