- త్వరలో కేంద్రానికి రిపోర్ట్
- రెడీ చేస్తున్న ఆర్ అండ్ బీ అధికారులు
హైదరాబాద్, వెలుగు: వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో ఎయిర్ పోర్టులు నిర్మించే అంశంలో సమస్యలు, భూసేకరణ, అనుమతులు వంటి అంశాలపై ఆర్ అండ్ బీ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఎయిర్ పోర్టుల నిర్మాణంపై త్వరలో కేంద్ర ఏవియేషన్ శాఖకు సమగ్ర నివేదిక అందచేయనున్నట్లు తెలుస్తోంది. గురువారం సెక్రటేరియెట్లో ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సెక్రటరీ దాసరి హరిచందన, ప్రభుత్వ అడ్వైజర్ శ్రీనివాస రాజు, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఈ అంశంపై చర్చించారు.
ముఖ్యంగా వరంగల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అదనపు భూమి రెడీగా ఉందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టులో వెల్లడించనుంది. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద దేశంలోనే మొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (సీఏఆర్వో) నిర్వహణపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది.
దీని ద్వారా దేశంలో సివిల్ ఏవియేషన్ రంగంలో పలు క్లిష్టమైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వెనువెంటనే పరిష్కారాలను కనుగొనడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించనుంది. ఎయిర్ ట్రాఫిక్ సజావుగా సాగడం, ప్రయాణికుల భద్రత, కొత్త ఎయిర్ ట్రాఫిక్ మార్గాల రాకపోకలపై అధ్యయనం చేయడం వంటి కీలక పరిశోధనలు ఇక్కడ జరగబోతుండటం వంటి అంశాలపై చర్చ చేసినట్టు సమాచారం.
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సాంక్షన్ చేయండి: మంత్రి కోమటిరెడ్డి లేఖ
రాష్ట్రానికి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు మంజూరు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో ఒకటే ఎయిర్ పోర్టు ఉందని, కొత్త గూడెం జిల్లా పాల్వంచలో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కొత్తగూడెం జిల్లాలో సింగరేణి, కేటీపీఎస్, ఐటీసీ, హెవీ వాటర్ ప్లాంట్, ఎన్ఎండీసీ వంటి ఎన్నో కంపెనీలు ఉన్నాయని, భద్రాచలం టెంపుల్ దేశంలోనే ఎంతో ఫేమస్ అని మంత్రి గుర్తు చేశారు.