22 ప్యాకేజీ ముందుకు సాగేనా?

22 ప్యాకేజీ ముందుకు సాగేనా?
  •     భూసేకరణ, ఫండ్స్​ రిలీజే​ ప్రధాన సమస్య
  •     పురోగతిపై ఉన్నతాధికారులకు నివేదిక
  •     పనుల స్థితిగతులపై త్వరలో రివ్యూ 

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరందించే కాళేశ్వరం 22 ప్యాకేజీ (ప్రాణహిత– చేవేళ్ల) పనులకు భూ సేకరణతో పాటు, ఫండ్స్​రిలీజ్ చేయాల్సిన అవసరముంది. 22 ప్యాకేజీ పనుల పురోగతిపై ఇటీవల జిల్లా ఇరిగేషన్​ఆఫీసర్లు ఉన్నతాధికారులకు నివేదించారు. త్వరలోనే రివ్యూ మీటింగ్​జరగనుంది. 2004లో అప్పటి కాంగ్రెస్ ​ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్​లో భాగంగా 22 ప్యాకేజీ పనులను ప్రతిపాదించింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు మెదక్​జిల్లాలోని రామాయంపేట మండలాన్ని కలుపుకొని లక్షా 90 వేల ఎకరాలకు సాగునీళ్లు అందించేందుకు రూ.1,446 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు.

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు సంబంధించిన ప్యాకేజీ 20,21,22లకు అప్పటి సీఎం వైఎస్ఆర్​2008లో కామారెడ్డిలోశంకుస్థాపన చేశారు. 2004–09 మధ్య మంత్రిగా ఉన్న షబ్బీర్​అలీ కామారెడ్డి జిల్లాకు సాగునీళ్లు తీసుకొచ్చే లక్ష్యంతో ఈ పనులకు ప్రయార్టీ ఇవ్వడంతో అప్పట్లోనే పనులు షురూ అయ్యాయి. 2014లో స్టేట్​విడిపోవడం, బీఆర్ఎస్​ అధికారంలోకి రావడంతో 22 ప్యాకేజీ పనుల డిజైన్​ మార్పుపై కొన్నాళ్లు తర్జనభర్జనలు జరిగాయి. తర్వాత యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. 21 ప్యాకేజీ ద్వారా నిజామాబాద్​జిల్లా మంచిప్ప నుంచి ఇక్కడికి నీళ్లు వస్తాయి.

భూసేకణకు ఫండ్స్​రిలీజ్​ చేస్తేనే ఫలితం

22 ప్యాకేజీ పనులకు సంబంధించి మెయిన్​ కెనాల్స్, సబ్​కెనాల్స్, డిస్ట్రిబ్యూటర్స్​తో పాటు రిజర్వాయర్​నిర్మాణం కోసం 4,450 ఎకరాల భూమి అవసరం. ఇప్పటివరకు 1,255 ఎకరాలు సేకరించారు. ఇంకా 3,195 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. సర్వే కూడా జరిగింది. ఫండ్స్​లేక సేకరణ కంప్లీట్ ​కావట్లేదు. సేకరించిన భూమి తాలూకు ఇంకా రూ.20 కోట్ల బకాయిలు ఉన్నాయి.

రూ.1,446 కోట్ల ఫండ్స్​కు గాను ఇప్పటి వరకు రూ.400 కోట్ల పనులు జరిగాయి. గత ప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రయార్టీలో తీసుకోలేదు. ఫండ్స్​ రిలీజ్​ చేయకపోవడంతో భూసేకరణ పూర్తికాక పనులు స్లోగా జరిగాయి. సదాశివ్​నగర్​మండలం భూంపల్లి వద్ద రిజర్వాయర్​తో పాటు, మెయిన్ ​కెనాల్స్​తవ్వకాలు కొంత వరకు పూర్తయ్యాయి.

సర్కార్​కు రిపోర్ట్​

తాజాగా కాంగ్రెస్​ ప్రభుత్వం ఇరిగేషన్​పనులకు సంబంధించి వివరాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా 22 ప్యాకేజీ పనులకు సంబంధించి జిల్లా ఇరిగేషన్​ ఆఫీసర్లు ప్రభుత్వానికి రిపోర్ట్​ ఇచ్చారు. ఈ ప్యాకేజీని ప్రతిపాదించడంలో అప్పట్లో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి షబ్బీర్​అలీ ఇరిగేషన్​ఆఫీసర్లతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. సీఎంతో పాటు, ఇరిగేషన్ ​మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. పనులకు సంబంధించి వారం, పది రోజుల్లో ఇరిగేషన్​ ఉన్నతాధికారులు రివ్యూ మీటింగ్ 
​నిర్వహించనున్నారు. 

ఉన్నతాధికారులకు వివరాలిచ్చాం

22 ప్యాకేజీ పనుల స్థితిగతులపై ఇటీవల ఉన్నతాధికారులకు వివరాలు ఇచ్చాం. ఫండ్స్​ రిలీజ్ ​అయితే భూసేకరణ జరుగుతుంది. పనులు ముందుకు సాగుతాయి.   

– శ్రీనివాస్, ఇరిగేషన్​ సీఈ, కామారెడ్డి