త్వరలోనే ‘ఎలివేటెడ్​ కారిడార్’కు భూసేకరణ.. ఇప్పటికే డిఫెన్స్, కంటోన్మెంట్ భూముల లైన్ క్లియర్​

త్వరలోనే ‘ఎలివేటెడ్​ కారిడార్’కు భూసేకరణ.. ఇప్పటికే డిఫెన్స్, కంటోన్మెంట్ భూముల లైన్ క్లియర్​
  • 271 ఎకరాలు.. 300 నిర్మాణాలు
  • త్వరలోనే ‘ఎలివేటెడ్​ కారిడార్’కు భూసేకరణ
  • ఇప్పటికే డిఫెన్స్​, కంటోన్మెంట్ భూముల లైన్ క్లియర్​
  • భూములు, ఇండ్లు కోల్పోయే వారికి రూ.130 కోట్ల పరిహారం  
  • రోడ్డుకు ఇరువైపులా  200 మీటర్లు కూల్చివేతలకు రంగం సిద్ధం!

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎలివేటెడ్​కారిడార్​ప్రాజెక్టు భూసేకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్యారడైజ్​నుంచి బోయిన్​పల్లి, జేబీఎస్​నుంచి శామీర్​పేట వరకు నిర్మించనున్న ఈ రెండు ప్రాజెక్టుల కోసం మొత్తం 271 ఎకరాలు సేకరించాలని హెచ్ఎండీఏ లక్ష్యంగా పెట్టుకున్నది. రెండు రూట్లలో రోడ్డుకు రెండువైపులా 200 మీటర్ల మేరకు ఉన్న 300 ప్రైవేట్​నిర్మాణాలను గుర్తించింది. వీటి యజమానులకు నోటీసులు కూడా ఇచ్చింది. త్వరలోనే ఓనర్లకు పరిహారం అందజేసి కూల్చివేతలు కూడా చేపట్టబోతున్నది. వీటి కోసం రూ.130 కోట్ల పరిహారం అవసరముంటుందని అంచనా వేసింది.  

కంటోన్మెంట్‎లో లైన్​ క్లియర్​

ఎలివేటెడ్​కారిడార్​ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కంటోన్మెంట్‎లో భూముల సేకరణకు లైన్​క్లియర్​అయ్యింది. రక్షణశాఖకు సంబంధించిన భూములుండడంతో వాటికి ప్రత్యామ్నాయంగా మరోచోట ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రైవేట్​బిల్డింగులు, భూములు కోల్పోయే వారికి ముందు ట్రాన్స్​ఫర్​ఆఫ్ డెవలప్​మెంట్​రైట్స్(టీడీఆర్) వర్తింపచేయాలని హెచ్ఎండీఏ అనుకుంది. 

అయితే, మెజారిటీ నిర్వాసితులు పరిహారాన్నే కోరుకుంటుండడంతో వారనుకున్నట్టు డబ్బులే ఇచ్చేందుకు హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే  ప్రాజెక్టుల నిర్మాణానికి మిలిటరీ ఎస్టేట్​ భూములు, సికింద్రాబాద్​కంటోన్మెంట్​బోర్డు భూములు ఇవ్వడానికి కేంద్రం గ్రీన్​సిగ్నల్​ఇచ్చిన సంగతి తెలిసిందే.  

ప్రాజెక్టు స్వరూపం ఇలా..

సికింద్రాబాద్​ప్యారడైజ్​నుంచి బోయిన్​పల్లి డెయిరీ ఫామ్ రోడ్​వరకూ 5.32 కి.మీ. మేరకు డబుల్​డెక్కర్​ఎలివేటెడ్​కారిడార్​నిర్మించనున్నారు. దీని ఖర్చు రూ.1580 కోట్లు కాగా, 74 ఎకరాలను సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో డిఫెన్స్​భూములు 65 ఎకరాలు, ప్రైవేట్​ భూములు 9 ఎకరాలున్నాయి. జేబీఎస్​నుంచి హకీంపేట మీదుగా శామీర్​పేట ఓఆర్​ఆర్​ను కలిపే ఎలివేటెడ్ ​కారిడార్​ను రూ.2232 కోట్లతో నిర్మిస్తున్నారు. 

18.12 కి.మీ. మేర నిర్మించే ఈ ప్రాజెక్టుకు 197 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 113 ఎకరాలు డిఫెన్స్​భూములు కాగా, మరో 84 ఎకరాలు ప్రైవేట్​భూములున్నాయి. ఇందులో డిఫెన్స్​, కంటోన్మెంట్​భూముల సమస్య పరిష్కారమైంది. దీంతో ప్రైవేట్​భూముల్లో ఉన్న 300 ప్రైవేట్​నిర్మాణాలను గుర్తించగా, డబుల్​డెక్కర్​ కారిడార్‎లోనే 200 పైగా నిర్మాణాలున్నాయి.  

ట్రాఫిక్‎కు చెక్​

ఎలివేటెడ్​కారిడార్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్​ సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎన్​హెచ్​–44 రోడ్‎లో మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్​రూట్లలో వెళ్లే వాహనాలకు ట్రాఫిక్​ ఇబ్బందులు తప్పుతాయంటున్నారు. అలాగే జేబీఎస్​నుంచి శామీర్​పేట వరకూ నిర్మించే కారిడార్ వల్ల జేబీఎస్​నుంచి నేరుగా శామీర్​పేట్‎కు ఎలాంటి ట్రాఫిక్​సిగ్నల్స్​లేకుండా వెళ్లవచ్చంటున్నారు.

దీనివల్ల గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల వెళ్లేవారికి సమయభావం తగ్గుతుందంటున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తిరుమలగిరి, ఆల్వాల్​జంక్షన్‎ల వద్ద ర్యాంపులు నిర్మిస్తుండడంతో అక్కడి నుంచి కూడా నేరుగా ఫ్లైఓవర్​ఎక్కి వెళ్లే ఛాన్స్​ఉంటుంది. దీనివల్ల ఆ ప్రాంతంలోని ప్రజలకు కూడా ట్రాఫిక్ ​ఇబ్బందులు తప్పుతాయి.