ట్రిపులార్ సర్వేకు ఆటంకాలు

ట్రిపులార్ సర్వేకు ఆటంకాలు
  • అధికారులను అడ్డుకుంటున్న  భూ నిర్వాసితులు
  • పరిహారంపై స్పష్టతనివ్వాలని డిమాండ్
  • సిద్దిపేట జిల్లాలో పోలీసుల పహారాలో సర్వేకు అధికారులు

సిద్దిపేట, వెలుగు: ట్రిపులార్ ఉత్తర భాగంలో భూ సేకరణకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. టెండర్ల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించగా ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాల్లో ట్రిపులార్ భూ సేకరణకు వచ్చే అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. పరిహారంపై స్పష్టత ఇవ్వకుండా విలువైన భూములను ఎలా ఇస్తామని నిలదీస్తున్నారు. 

సర్వే కోసం పోలీసు పహారాతో వచ్చినా పరిహారంపై స్పష్టత నిచ్చిన తర్వాతనే సర్వే జరపాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మర్కుక్ మండల పరిధిలో ట్రిపులార్ అలైన్​మెంట్​ను మార్చాలనే డిమాండ్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైతం రైతులు కలిసి విన్నవించుకున్నారు.

పరిహారంపైనే పేచీ

ఉత్తర భాగంలోని నాలుగు జిల్లాల్లో అధికారులు భూ సేకరణకు కసరత్తు ప్రారంభించినా పలు చోట్ల అడ్డగింతలే ఎదురవుతున్నాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి వద్ద ఇంటర్ ఛేంజ్ నిర్మాణం కోసం అదనంగా 40 ఎకరాలు సేకరించే పరిస్థితి ఏర్పడడంతో భూ బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గ్రామానికి చెందిన 300 ఎకరాలు ట్రిపులార్ కోసం సేకరిస్తుండగా అదనంగా మరో 40 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తుండడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

Also Read :- కపుల్స్ ఓయో హోటల్స్‌‌‌‌లో రూమ్ తీసుకోవాలంటే

ఇటీవల జగదేవ్ పూర్పీర్లపల్లిలో సర్వేకు వెళ్లిన అధికారులను అడ్డుకుని గ్రామ సభను నిర్వహించి పరిహారంపై స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే గ్రామంలోకి రావాలని అల్టిమేటమ్ ఇవ్వగా, మర్కుక్ మండలం నరసన్నపేటలో  చెట్లు, బోరు బావులను గుర్తించేందుకు వచ్చిన అధికారులను సైతం తిప్పి పంపారు. సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాలో భూమికి భూమే ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకువస్తున్నారు. 

భూసేకరణకు కసరత్తు

ట్రిపుల్ ఆర్ కోసం మెదక్ జిల్లాలో 5 మండలాల్లోని 25 గ్రామాల పరిధిలో 2,080 మంది రైతుల నుంచి 1,176 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు పలు మార్లు సర్వే జరిపి,  భూముల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు.  సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, ఆందోల్-జోగిపేట డివిజనల్ పరిధిలో మొత్తం 20 గ్రామాల పరిధిలో 199 మంది రైతుల నుంచి 659.30 ఎకరాల భూములు సేకరించాలని నిర్ణయించినా ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ట్రిపులార్ కోసం సేకరించిన భూమికి భూమే ఇవ్వాలని, లేదంటే మార్కెట్ వ్యాల్యూ ప్రకారం పరిహాం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో  980 ఎకరాలను 972  మంది రైతుల నుంచి, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1800 ఎకరాలు సేకరించాల్సి  ఉండగా ఇప్పటి వరకూ ఎలాంటి సేకరణ జరగక పోగా పలు  జిల్లాలో రైతులు భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు.

పరిహారంపై స్పష్టత ఇవ్వరా..? 

ట్రిపులార్ కోసం సేకరిస్తున్న భూమికి పరిహారం ఎంత ఇస్తారనేది చెప్పకుండా అధికారులు సర్వేకు వస్తున్నారు. నరసన్నపేటలో సేకరించే భూమిలోని చెట్లు, బోర్ల సర్వే కోసం వస్తే పరిహారం గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. కోట్ల రూపాయల విలువైన భూములను కోల్పోతున్న రైతులకు న్యాయం చేసిన తర్వాతనే భూ సేకరణ జరపాలి. అధికారులు పోలీసులను వెంట తీసుకుని సర్వే కోసం రావడం ఇప్పుడు ఎంతో ఆందోళన కలిగిస్తోంది.ఏంబరి వెంకటేశ్, భూ బాధితుడు, నరసన్నపేట, మర్కుక్ మండలం


ఈ ఫొటోలో ఉన్న రైతు మైసగోని కార్తీక్ గౌడ్. వర్గల్ మండలం సామలపల్లిలో తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ట్రిపులార్ నిర్మాణంతో ఎకరం భూమిని కోల్పోతున్నాడు. తన జీవనాధారం పోతుందని ఆందోళన చెందుతుండగా సామలపల్లి వద్ద  ఇంటర్ ఛేంజ్ కోసం మరి కొంత భూమిని సేకరిస్తుండడంతో ఇప్పుడు మిగిలిన భూమిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 

మరోవైపు కోల్పోతున్న భూమికి పరిహారం ఎం త ఇస్తారనే విషయాన్ని చెప్పకుండానే ఇంటర్ ఛేంజ్ భూసేకరణ కోసం అధికారులు సర్వేకు రావడంతో భూ నిర్వాసితులతో కలిసి అడ్డుకున్నాడు. ఇలాంటి పరిస్థితి ఒక్క కార్తీక్ గౌడ్ దే కాదు ట్రిపులార్ కోసం భూమి కోల్పోతున్న చాలామంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.  మైసగోని కార్తీక్ గౌడ్, సామలపల్లి, వర్గల్ మండలం