స్పీడ్ గా.. ఓల్డ్ సిటీ మెట్రో భూ సర్వే

హైదరాబాద్, వెలుగు : ఓల్డ్​ సిటీలో  మెట్రో రైల్ భూసేకరణ స్పీడ్ గా కొనసాగుతుందని హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఎంఏఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్– చాంద్రాయణగుట్ట మధ్య 7.5 కి.మీ రోడ్డు విస్తరణ, స్టేషన్ల నిర్మాణా నికి దాదాపు 1, 200 ఆస్తులపై ఎఫెక్ట్ పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే భూసేకరణ చట్టం – 2013 కింద 400 ఆస్తులకు సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ మేరకు రోడ్డు విస్తరణ 100 అడుగులు, మెట్రో స్టేషన్ల వద్ద 120 అడుగుల వెడల్పుతో విస్తారణ చేస్తామని తెలిపారు. 

దారుషిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు 50 – 60 అడుగులు, శాలిబండ జంక్షన్ – చాంద్రాయణ గుట్ట జంక్షన్ వరకు 80 అడుగులు ఉంటుందని వివరించారు. సంప్రదాయ సర్వే పద్ధతులతో పాటు త్రీడీలో  వీక్షించే విధంగా లైడార్ డ్రోన్ సర్వే కూడా చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభావిత నిర్మాణాల విలువ అంచనాకు క్షేత్రస్థాయిలో హెచ్ఏఎంఎల్ ఇంజినీర్లు, సిబ్బంది సర్వే చేస్తున్నారని, భూసేకరణ 8 నెలల్లో పూర్తి కావచ్చని పేర్కొన్నారు.