రామగుండం – మణుగూరు ​రైల్వే లైన్​ భూ సేకరణ స్పీడప్

రామగుండం – మణుగూరు ​రైల్వే లైన్​ భూ సేకరణ స్పీడప్
  • ఆఫీసర్లను నియమిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ

గోదావరిఖని, వెలుగు :  రామగుండం – మణుగూరు రైల్వే లైన్​భూ సేకరణ పనులు స్పీడప్ చేసేందుకు  కేంద్ర రైల్వే శాఖ పలువురు ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, కమాన్​పూర్​, మంథని, ముత్తారం (మంథని), భూపాలపల్లి జిల్లాలోని మల్హర్​రావు (తాడిచర్ల), కాపురం, ఘన్​పూర్​, భూపాలపల్లి మండలాల మీదుగా మేడారం నుంచి మణుగూరు వరకు 207.80 కిలోమీటర్ల మేర బ్రాడ్​గేజ్​ రైల్వే లైన్​పనులు చేపట్టేలా రైల్వే శాఖ నివేదిక తయారు చేసింది. 

అయితే రైల్వే లైన్​నిర్మాణానికి భూసేకరణ చేసి  రైతులకు ఎంత నష్టపరిహారం ఇవ్వాలనే వివరాలను తెలిపేందుకు రామగుండం, కమాన్​పూర్, రామగిరి, మంథని, ముత్తారం మండలాలకు పెద్దపల్లి జిల్లా అడిషనల్​ కలెక్టర్​(రెవెన్యూ)కు, మల్హర్​రావు, కాపురం మండలాలకు కాటారం సబ్​కలెక్టర్​కు, ఘన్​పూర్, భూపాలపల్లి మండలాలకు భూపాలపల్లి ఆర్డీవోకు బాధ్యతలు అప్పగించింది.  2012లో  రైల్వే లైన్ కు ప్రతిపాదనలు తయారు చేయగా, ఇందుకు సంబంధించిన భూసేకరణ పనులు నత్తనడకన నడుస్తున్న  విషయం తెలిసిందే.