
- పెట్టుబడిదారులు ముందుకు రాక ఆందోళనలో వ్యాపారులు
- ఎల్ఆర్ఎస్ అందుబాటులోకి రావడంతో చిగురిస్తున్న ఆశలు
మహబూబ్‌నగర్, వెలుగు: రియల్ ఎస్టేట్ రంగంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. 2004 నుంచి 2020 వరకు జోరుగా సాగిన ఈ వ్యాపారం.. ఇప్పుడు స్తబ్దుగా మారింది. అమ్మడానికి భూములు, ప్లాట్లు రెడీగా ఉన్నా.. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రధానంగా పదేండ్ల గరిష్ట స్థాయికి రేట్లు పెరగడమే కారణమని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం)ను అందుబాటులోకి తీసుకురావడంతో వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కోట్లకు చేరిన భూముల ధరలు
నేషనల్ హైవే-44ను ఆనుకొని ఉండడం, హైదరాబాద్‌కు దగ్గర్లో ఉండడంతో కొత్తూరు, షాద్‌నగర్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, పాలమూరు, భూత్పూర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా నడిచింది. నారాయణపేట జిల్లా కావడంతో మరికల్, మక్తల్, నారాయణపేట ఏరియాల్లో కూడా ఈ వ్యాపారం సాగింది. ఈ ఏరియాల్లో నేషనల్ హైవేల పొంటి ఎకరం భూమి రూ.3. కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు, గజం భూమి విలువ రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు, రూరల్ ఏరియాల్లో ఎకరం భూమి రూ.30 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు, గజం విలువ రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉన్నాయి. అయితే ఈ రేట్లు పదేండ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం సమస్యగా మారింది.
2014 నుంచి ఈ వ్యాపారంలోకి దిగిన వారు ఇష్టారితీన రేట్లు పెంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు ఉన్న ఎకరం భూమిని ఏకంగా రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచి.. హైదరాబాద్‌కు చెందిన పెట్టుబడిదారులతో ఈ భూములను కొనుగోలు చేయించారు. అలాగే వివాహాలు, ఇతర అవసరాల కోసం మధ్య తరగతి కుటుంబాలు ప్లాట్లను కొనుగోలు చేసి పెట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వారు తిరిగి ఈ భూములు, ప్లాట్లు అమ్ముకునేందుకు తిప్పలు పడుతున్నారు.
రేట్లు ఓ స్థాయికి చేరిపోయాయి. నాలుగేండ్లు కావస్తున్నా.. రేట్లు తగ్గడం లేదు. ఎవరికైనా అత్యవసరం ఉండి భూములు, ప్లాట్లు అమ్ముదామన్నా ప్రస్తుతం ఉన్న రేట్లకు ఎవరూ కొనడం లేదు. రేట్లు కొంచెం తక్కువ చేసి అమ్ముదామన్నా.. వీటి మీద పెట్టిన పెట్టుబడులకు మిత్తీ కూడా రాకపోవడంతో సైలెంట్‌గా ఉంటున్నారు. కొందరు వ్యాపారులు పెట్టిన పెట్టుబడికన్నా ఎక్కువగా వడ్డీ మీద పడుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తక్కువ ధరకే ప్లాట్లు, భూములు అమ్మేస్తున్నారు.
దిగొస్తున్న ధరలు..
కొద్ది రోజులుగా భూములు, ప్లాట్ల ధరలు దిగొస్తున్నాయి. ఎక్కడికక్కడ వ్యాపారం నిలిచిపోవడంతో ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల వ్యాపారులు గజం విలువ రేట్లను తగ్గించారు. ఉదాహరణకు హైవేకు ఆనుకొని ఉన్న అడ్డాకుల మండల కేంద్రంలో గజం భూమి విలువ రూ.8,500 నుంచి రూ.10 వేల వరకు ఉండేది. అయితే ఇటీవల ఏర్పాటు చేసిన
ఓ వెంచర్లో ప్లాట్లను గజాల చొప్పున కాకుండా.. గంప గుత్తగా విక్రయిస్తున్నారు.
రూ.10 లక్షలకు 240 గజాల ప్లాటును అగ్రిమెంట్ చేయిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం గజం విలువ రూ.5 వేల నుంచి రూ.5,500కు పడిపోయినట్లు స్పష్టమవుతోంది. అలాగే ఈ ప్రాంతంలో హైవే నుంచి లోపలికి నాలుగు కిలోమీటర్లు ఎక్కడికి వెళ్లినా.. ఎకరం భూమి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పలికింది. రోడ్డు బిట్ అయితే రూ.35 లక్షల వరకు కూడా అమ్ముడుపోయాయి. ఇప్పుడు రూ.15 లక్షలకు అమ్ముడవుతున్నాయి. రోడ్డు బిట్ భూముల రేట్లు రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షలకు పడిపోయాయి.
ఎల్ఆర్ఎస్తో వ్యాపారుల్లో ఆశలు..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎల్ఆర్ఎస్ను అందుబాటులోకి తెచ్చింది. 25 శాతం రాయితీ ప్రకటించడంతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే రానున్న రెండు వారాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగే చాన్స్ ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. సొంత జాగా ఉన్న వారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరులో మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో.. ఎల్ఆర్ఎస్ పూర్తయితే పెద్ద మొత్తంలో ప్లాట్లు అమ్ముడుపోతాయని చెబుతున్నారు. ప్రస్తుతం అర్బన్, రూరల్ ఏరియాల్లో ఖాళీ జాగాలు లేవని.. సమీపంలో ఉన్న వెంచర్లలో ప్లాట్లు కొని సొంతింటి కల సాకారం చేసుకునేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నట్లు రియల్టర్లు చెబుతున్నారు.