
- రెండువర్గాలుగా చీలిపోయిన న్యాయవాదులు
గద్వాల, వెలుగు: గద్వాల కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నిర్మాణాన్ని ఎక్కడ చేపట్టాలన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. ఒక్క గద్వాల కోర్టు కాంప్లెక్స్ విషయంలో స్థల వివాదం తలెత్తింది. కోర్టు కాంప్లెక్స్ ఎక్కడ నిర్మించాలన్న విషయంలో గద్వాల న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు కలెక్టరేట్ వద్ద కట్టాలని.. మరికొందరు అనంతపురం గుట్టల్లో కట్టాలని వాదిస్తున్నారు.
ఎవరికివారే పట్టుదలతో ఉండడంతో స్థల సేకరణ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ వివాదం బార్ అసోసియేషన్ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపింది. ప్రస్తుత బార్అసోసియేషన్ అధ్యక్షుడు రఘురాంరెడ్డి, కార్యదర్శి షఫీ ఉల్లా వేర్వేరుగా ఎలక్షన్ ఆఫీసర్లను నియమించడం, ఎవరికి వారే ఎన్నికల ప్రక్రియ చేపట్టడం చర్చనీయాంశమైంది. ఒక వర్గం ఏకగ్రీవంగా బార్ అసోసియేషన్ ఎన్నిక జరిగినట్టు ప్రకటించడం, మరో వర్గం ఎన్నికల సన్నాహాలు చేయడంతో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జోక్యం చేసుకుంది. ఇక్కడ ఎన్నికలను నిలిపివేసి ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
గుట్టల్లో స్థలం కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వం గద్వాల కోర్టు కాంప్లెక్స్ మంజూరు చేయగా రెవెన్యూ ఆఫీసర్లు పూడూరు శివారులోని అనంతపురం గుట్టల్లోని సర్వేనెంబర్ 368లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అక్కడ కోర్టు కాంప్లెక్స్ నిర్మించవద్దంటూ కొందరు లాయర్లు అభ్యంతరం చెప్పారు. ప్రస్తుతమున్న కోర్టు కాంప్లెక్స్‌వద్ద గానీ, పీజేపీ క్యాంపు లోగానీ నిర్మించాలని అంటున్న వర్గం తమ డిమాండ్ సాధించుకునేందుకు నిరసన దీక్షలు చేపట్టింది. ఈ వర్గాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు అనంతపురం గుట్టల్లోనే కోర్టు కాంప్లెక్స్ కట్టాలని పట్టుబడుతున్నారు. దీంతో స్థల సేకరణ ఆగిపోయింది.
రెండు వర్గాల లాయర్లు పట్టువదలకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. రెండు వర్గాలను కాదనకుండా మధ్యేమార్గంగా ఇండస్ట్రియల్ జోన్ ప్రాంతంలో కోర్ట్ కాంప్లెక్స్ నిర్మించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. రెండువర్గాల లాయర్లకు తెరవెనుక రాజకీయ నాయకులు మద్దతునిస్తున్నారు. తమకు అనుకూలమైన చోట కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం జరిగేలా వీరు పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. లాయర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చి స్థలసేకరణ పూర్తి చేయాలని గద్వాల కోర్టు పోర్ట్‌పోలియో జడ్జి నర్సింగరావు చేసిన ప్రత్నం కూడా ఫలించలేదు.
ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
కోర్టు కాంప్లెక్స్ నిర్మాణంపై కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం, కలెక్టర్ ఎక్కడ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంటే అక్కడ స్థల సేకరణ పూర్తి చేస్తాం.
లక్ష్మీనారాయణ అడిషనల్ కలెక్టర్, గద్వాల