మెట్ పల్లిలో రెండు ఆలయ కమిటీల మధ్య స్థల వివాదం

మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి పట్టణంలో రెండు ఆలయ కమిటీల మధ్య స్థలం వివాదం నెలకొంది. పట్టణంలోని మున్సిపల్​ఆఫీస్​సమీపంలోని శ్రీ చెన్నకేశవ ఆలయం, త్రిశక్తి ఆలయం పక్కపక్కనే ఉన్నాయి. రెండు ఆలయ కమిటీల మధ్య కొన్నేండ్లుగా  వివాదం నడుస్తోంది. తాజాగా త్రిశక్తి ఆలయం ద్వారం... శ్రీ చెన్నకేశవ ఆలయ స్థలంలో ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు త్రిశక్తి ఆలయం ముందు గోడ నిర్మించారు. 

ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు గోడ నిర్మాణం చూసి ఆలయ కమిటీకి సమాచారం అందించారు. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో సీఐ లక్ష్మీనారాయణ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడి సముదాయించారు. అనంతరం పోలీసుల ఆదేశాలతో గోడను తొలగించారు.