ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్థలంపై వివాదం

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్థలంపై వివాదం
  • ఆ జాగా తమదేనంటూ తాళ్లు కట్టి, బ్యానర్స్‌ పెట్టిన ఓ కుటుంబం 

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి  ఆవరణలోని కొంత భాగాన్ని ఒక కుటుంబం ఆక్రమించుకోవడం వివాదాస్పదంగా మారింది. దాదాపు 60 ఏళ్లుగా అక్కడ ప్రభుత్వ ఆస్పత్రి కొనసాగుతుండగా, ప్రహరీ లోపల ఉన్న 1,200 గజాలు స్థలం తమదేనని ఒక కుటుంబం వాదిస్తోంది. సర్వే నంబర్ 263 లో తమ పూర్వీకుల నుంచి గిఫ్ట్ డీడ్ గా వచ్చిన భూమిని తమకు అప్పగించాలంటూ ఈనెల 18న హైకోర్టును  ఆశ్రయించింది.

అయితే హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెబుతూ ఖమ్మం నగరంలోని రమణ గుట్టకు చెందిన హబీబున్నీసా బేగం కుటుంబ సభ్యులు ఆదివారం ఆ స్థలానికి హద్దులు పెట్టారు. 

జరిగింది ఇదీ...

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కోసం దాదాపు 60 ఏళ్ల కింద 24 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఆస్పత్రి కొనసాగుతుండగా, జిల్లాకు 2022లో మెడికల్ కాలేజీ మంజూరైన తర్వాత ఈ ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రి  పరిధిలో 21.31 ఎకరాలు, పాత కలెక్టరేట్‌లోని 5.23 ఎకరాలు, ఆర్‌అండ్‌బీ కార్యాలయానికి చెందిన 3.09 ఎకరాల స్థలం మొత్తం కలిపి 30.23 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు కేటాయించారు.

ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన పాత ధర్నాచౌక్‌ స్థలం, ఆస్పత్రిలోని పార్కింగ్‌ స్థలం కలుపుకొని 1,212 గజాలు ఉంటుంది. తమ పూర్వీకులకు చెందిన ఈ స్థలం తమకు చెందుతుందని రమణగుట్టలోని వికలాంగుల కాలనీకి చెందిన హబీబున్నీసా బేగం కుటుంబం వారం రోజుల కింద హైకోర్టులో రిట్‌ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో వారు ఆదివారం ఆస్పత్రికి వచ్చి స్థలం చుట్టూ తాళ్లు కట్టి, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

దీనిపై ఆస్పత్రి వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఆర్డీవో కోర్టులో ఈ స్థలం గురించి వివాదం చేసేందుకు ప్రయత్నించగా పిటిషన్ ను కొట్టేశారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కూడా కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు తప్పించి వాళ్లకు అనుకూలంగా ఎలాంటి తీర్పు రాలేదని స్పష్టం చేస్తున్నారు. 

కేవలం వాళ్లు వేసిన పిటిషన్ మీద స్పందించాలని, కౌంటర్ దాఖలు చేయాలని నోటీస్ వచ్చిందని చెబుతున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గడువుల్లోగానే తాము కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్‌ను వివరణ కోరగా విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. హైకోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉందని, అయితే పూర్తిస్థాయిలో స్పష్టత రాకముందే వారు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలనుకోవడం చట్ట ప్రకారం నేరమన్నారు.