భూవివాదంలో వ్యక్తి హత్య

భూవివాదంలో వ్యక్తి హత్య
  •   భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో దారుణం

కాటారం, వెలుగు : భూతగాదాతో పాటు, తన తల్లిపై దాడి చేయడంతో ఆవేశానికి గురైన ఓ యువకుడు మరో వ్యక్తిని హత్య చేశాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఇప్పలగూడెంలో శుక్రవారం జరిగింది. కాటారం సీఐ నాగార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన డోంగిరి బుచ్చయ్య (55) ఫ్యామిలీకి, అదే గ్రామానికి చెందిన సోదారి లింగయ్య కుటుంబానికి మధ్య కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. రెండు కుటుంబాలు గతంలోనే గొడవ పడగా, కేసులు కూడా నమోదు అయ్యాయి. 

బుచ్చయ్య శుక్రవారం వివాదంలో ఉన్న భూమి వద్దకు వెళ్లగా, అప్పటికే లింగయ్య తన భార్య పద్మతో కలిసి ఆ భూమిలో పనిచేస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలుకావడంతో ఆగ్రహానికి గురైన బుచ్చయ్య పారతో లింగయ్య భార్య పద్మను కొట్టగా ఆమె తీవ్రంగా గాయపడింది. విషయాన్ని లింగయ్య తన కుమారుడు పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెప్పాడు. తల్లి గాయపడిన విషయాన్ని తెలుసుకున్న పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో కాటారం ప్రభుత్వ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ సమీపంలో బుచ్చయ్య కనిపించాడు. ఆవేశానికి గురైన పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్కడే ఉన్న ఓ కర్ర తీసుకుని బుచ్చయ్య తలపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బుచ్చయ్య అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.