నా భూమి ఎవ్వడెత్తుకవాయే

పిలగాడు పట్నంల సాఫ్ట్ వేర్ జాబ్ జేస్తడు. నెలకు లక్ష రూపాల జీతం.. సరే సరే... ఊర్ల భూమి ఎంతుందో చెప్పు మొదాలు అయ్యో... భూమి జాగల్లేవ్వా? ఐతే మా బుజ్జికి ఉంకో సంబంధం సూస్కుంటం’, ‘కాక.. చెల్లె పెండ్లి జేస్తావే?.. ఆ.. జెయ్యాలే బిడ్డ. మొన్నో జాడవడ్డదిగని.. ఎకరమే ఉందట.. ఇయ్యమని చెప్పినం’, ‘మా అయ్య... చెప్తే ఇన్లే. ఇప్పుడు అమ్ముకుంటే కోట్లొచ్చు. అప్పట్ల అగ్వసగ్వకు అమ్మేస్తే... ఇయ్యాల మంది భూములు సూశే గతొచ్చే’, ‘ఏ... వానికేంద్రా మూడెక్రాలుంది. రాజా లెక్క బత్కుతడు’, ‘నీకాడ పైసలెడికి వోతయి బిడ్డా... ఊర్లకెల్లివోతున్నవా ఏంది... నీకు భూమి లేదా జాగ లేదా?’ ... ఇగో గిట్లుందిప్పుడు ఊర్లపొంట భూముల ముచ్చట. 

ఔ... మల్ల. సీఎం సారు చెప్పినట్టు కోట్లు పల్కుతాంది. అమ్ముకుంటే కోట్లే కొట్లు. మా ఏలువడి వల్లనే భూములకు ఇంత ధరొచ్చిందని గొప్పగ సాటింపేస్తుర్రు. వాజీవే. పట్నం సుట్టయితే పల్కరిచ్చే పర్శితిలేదు. ఎక్రం 40 కోట్లు.. 50 కోట్లు. జెరంత అసుంటవోతే 10 కోట్లు. ఓ 50 కిలోమీటర్లు దాటితే 2 కోట్లకు దొర్కితే మా భాగ్యం. భూముల ఇలువ ఇంతగనం పెరిగినందుకు సంబురమే. కని అంతంత రేట్లు పెట్టి ఆ భూములు కొంటుంది ఎవలు..? ఇయ్యాల ఏ రైతన్న ఎక్రం జాగ కొనే తాకత్ ఉందా ఈ రేట్లు జెయ్యవట్టికే. ఇన్నొద్దులు తమ్ముడు భూమి అమ్మితే అన్ననే కొను. నేనుండంగ బైటొళ్లు ఎట్లొస్తరని అడ్డంబడు. ఆళ్లు కొనలేకుంటే... పాలొళ్లు ఉర్కొద్దరు మాకే హక్కుంటదని. 

నలుగురు ఏ రేట్ చెప్తే గారేటుకు భూమి బ్యారం అయ్యేది. మరిప్పుడు..? గెట్టుపొంటి భూమి అమ్ముతుంటే.. పానం గుంజుతది. కని కొందామంటే తాకత్ సాలది. ఐదు లక్షలో, పది లక్షలో ఐతే ఆడీడ అప్పు గుంజుకొద్దురు... లేకుంటే ఇంటామె బంగారం కుద్వ పెట్టి కొందురు. కోట్లు, లక్షలు అంటే ఏ చెట్టుకు దుల్పుకొస్తరు... ఏ కొండకు తొవ్వుకొస్తరు. సక్కదనాల భూమి పోవట్టే అని ఓ మెరమెర. నేనే తీస్కుంటా అని మందలిచ్చే పర్శితి లేకపాయే. మరి ఈ భూములు ఎవల చేతికి పోతున్నట్టు? 

భూములతోని పగలు పెరగబట్టే..

పట్నంకెల్లి కార్లు ఏస్కోనొచ్చి పల్లెల మీదవడి వందల ఎకరాలు కొంటున్నది పెద్దపెద్దోళ్లు, లీడర్లు, యాక్టర్లు, సెలబ్రిటీలు, యాపారులు, బిల్డర్లు. ఆళ్లకు ఈ రేట్ పెద్ద లెక్కనా. బిడ్డ పెండ్లికో, ఇల్లు కట్టుకుంటానికో అమ్ముదాం అన్కునేటోళ్లు ఉంటరు. ఎకరానికి 50 లక్షలు ఇస్తం అనంగనే ముర్సుకుంట రిజిస్ట్రేషన్ జేస్తరు మనోళ్లు. కడీలు నాటి ఫెన్సింగ్ గుంజి.. ప్లాట్లు జేస్తే కోట్లే కోట్లు. పంటపొలాలు పోయినయ్. ఫాంహౌజ్​లు వచ్చినయ్. ఇప్పుడు ఎకరాలకు ఎకరాలు అమ్మినోళ్లు... రేపు గుంటలు కొనలేరు. పైసలుంటయా? పలారమోలే ఖర్సాయే. అంటే భూములన్ని మోతెవర్ల చేతిలకు పోతున్నయన్నట్టు. 

రేపురేపు ఊర్ల ఉండే రైతుల కాడ భూమి ఉండదు.. పట్నంలుండే పైల్వాన్ల కాడ ఎకరాలకు ఎకరాలు జమవుడు పక్కా. ఐనా ఎవలి భూమి ఆళ్లు అమ్ముకుంటే అండ్ల సర్కార్ గొప్పతనమేంది? ఎంత అక్కెరవడ్డా భూమి అమ్ముకునే పర్శితి రానప్పుడే గద అస్సలు అభివృద్ధి. భూమి ఇలువ పెరుగుడంటే.. అమ్ముకుంటే పైసలొచ్చుడు గాదు. పదేండ్ల కింద ఎక్రంల ఎంత పండేది.. ఇయ్యాలెంత పండుతుంది? దాన్మిద అప్పుడెంత మిగిలేది... ఇప్పుడెంత మిగుల్తుంది అనేది లెక్క. మన్సులు పెరుగుతుండ్రు, రేట్ పెరుగుతుంది గని భూమి పెరుగుతదా. ఈ రేట్లు జెయ్యవట్టికే... మన్సుల నడ్మ పాయిరం తగ్గి పగలు పెరిగినయి. గెట్టుకాడ పంచాదే, పుట్టకాడ పంచాదే. అన్నదమ్ముళ్ల కొట్లాటలేగాదు... ఆడివిల్లలు గూడ పొత్తుకు రావట్టిరి. నాయ్న సంపాదించిన ఆస్తిల పాలియ్యకుంటే... కోర్టు దాకా గూడ పోతుర్రు. అప్పటి ప్రేమల్లేవ్.. అప్పటి మన్సులు గారు.

గరీబోడు గజం కొనలేడు

ఇయ్యాల హైద్రాబాద్ సుట్టూరు మొగుల్ను తాకే బంగ్లాలు... అద్దాల మ్యాడలు... అందాల విల్లాలు. ఏడ సూశినా కోట్లు.. కోట్లు. ఐనా గూడ శితం కొంటుర్రు.. బొచ్చెడు కడ్తుర్రు. కని గరీబోడు నూరు గజాల జాగ కొనలేడు. గజం 50..60 వెయ్యిలకు తక్వలేదు మరి. నూరు గజాలు కొనాలంటే 50..60 లక్షలు. ఏండ్లకెండ్లు ఎంత చెమ్ట తీశినా అంత పైకం కూడది. లోనో బోనో పెట్టి కొని... ఇల్లు కట్టాలంటే మల్లంత పైకం కావాలే. ఇన్ని బాధలు పడలేక సప్పుడుగాకుంట కిరాయి ఇండ్ల కాలం ఎల్లదీస్తుర్రు. మరి పెరిగిన రేట్లతోటి ఫాయిదా ఎవలకు ఐతున్నట్టు..? సర్కార్ కట్టిస్తాన్న డబుల్ బెడ్రూం ఇండ్ల కోసానికి ఎదిరి సూశి సూశి కండ్లు కాయలు కాయవట్టే. యాట గోశి, కల్లువోశి దావత్ ఇస్తాని జనమంత తయారున్నా... కొత్తింట్ల పాలు పొంగిచ్చే భాగ్యం రాకపాయే. పోని ఇంత గుడిశన్న ఏస్కుందామని.. బతుకమ్మ చీరలు పరిస్తే.. 

సర్కార్ జాగను కబ్జా వెడ్తరా..? అని కేసులు. అదే హైద్రాబాద్ శివారు మొత్తం పెద్దపెద్దోల్లకు రాశిస్తుండ్రు. పలాన జాగ కావాలే.. దవ్కాన కడ్తా అని ఓ బీఆర్ఎస్ ఎంపీ అడుగుడే ఆల్శం..10 ఎక్రాలు సాలని ఆఫీసర్లు రిపోర్టిస్తే... సాలదని15 ఎక్రాలు ఇచ్చిపడేశిండ్రు. అది గూడెట్ల 30 ఏండ్ల కిందట రేట్ పకారం 60 ఏండ్ల లీజు. మార్కెట్ రేట్ పకారం 5 వెయ్యిల 346 కోట్లు రావాల్సుంటే వచ్చేది కోటి 40 లక్షలే. పలారం లెక్క భూములు గిట్ల పంచి పెడ్తుండ్రేందని హైకోర్టే గరమైందంటే కథెట్లుందో సూడుర్రి. ఎవలెవలకు ఎన్నెక్రాలు వోతుందో ఎవ్వలకు తెల్వది. గట్లనే ఎవలదన్న  బైటికొస్తే తప్ప. ఇగ కారోళ్ల పార్టీ ఆఫీసులకు ఇచ్చుకుంటున్న భూములకైతే లెక్కేలేదు. మొన్ననే కోకాపేటల11 ఎక్రాలు తీస్కుండ్రు 15 అంత్రాలల్ల భారత్ బంగ్లా కట్కుంటమని. ఆడ తక్వల తక్వ ఎక్రం 50 కోట్లు. అంటే 550 కోట్ల భూమికి.. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేది ఉత్త 37 కోట్లు. ఇగ జిల్లాల్ల ఆఫీస్ కట్టాలని మంచి ఏరియాల 33 జిల్లాల్ల 33 ఎక్రాలు తీస్కుండ్రు గజం నూర్రుపాల్లెక్క. ఆ భూముల ఇల్వ 470 కోట్లుంటే పార్టీ కట్టింది రొండున్నర కోట్లే.

రాగీర్ రైతులకు సంకెళ్లు 

నాకు 4 నుంచి10 దాకా సదువు చెప్పి.. దోస్తులతో గల్లీగల్లీ తిప్పి.. జ్ఞానం నేర్పిన ఊరు రాగీర్. సుట్టు ఏడెన్మిది ఊర్లకు సదువులకు, సరుకులకు పెద్దన్న. రోడ్ మీదికొస్తే చాయ్ డబ్బాలు, కిరాణం దుక్నాలు. వరంగల్ హైవే, యాదగిరిగుట్ట తొవ్వకు ఉంటది గావట్టి ఫుల్ రష్. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ల నిలబడ్డ బుద్దుడి ఇగ్రం ఈ ఊరి గుట్ట మీద చెక్కిందే. మా సర్కార్ ఇస్కూలు రోడ్ మీదనే. పేద్ద గ్రౌండ్. రాగీర్ల సదువైపోయింది.. కాలేజీకి భువనగిరికి వచ్చిన. కొన్నేండ్లకు రాగీర్కువోతే మా బడి మైదానాన్ని ఫ్లైఓవర్ మింగేశింది. రోడ్ మీది దుక్నాలు చిల్లం కల్లమైనయి. రాగీర్ కళ తప్పి బోడబోడ అగుపడ్డది. ఈ కొసకెల్లి ఆ కొస దాకా బొచ్చెడు మంది రైతుల భూములు గుంజుకుంది పెద్ద రాస్తా. భువనగిరి బైపాస్​కు కొంత వోతే.. 

బస్వాపూర్ ప్రాజెక్టు కాల్వకు కొంతవోయింది. పక్కూర్లకు ఎలుగులు పంచాలని పెద్ద కరెంట్ తీగల లైన్ తంబాలూ రాగీర్ జాగల్లనే పాతిండ్రు. యాదగిరిగుట్టను యాదాద్రి జేస్తానికి రాగీర్ భూములే అక్కరొచ్చినయి. రాగీర్ శివార్లనే కట్టిన కలెక్టరేట్ కు కూడా కొంత భూమి పొయ్యే ఉంటది. తాపతాపకు భూములు తీస్కునేవోరకు.. పెద్ద ఆసాములే చిన్నగైనరంటే.. ఇగ చిన్నోళ్లకు భూములే లేకుంటైనయి. అభివృద్ధి కోసం ఇంత త్యాగం చేసిన మా రాగీర్ మీద నిరుడు RRR కన్నువడ్డది. 

మూడు రింగులు తిప్పుతానికి 266 ఎకరాలు పోతుంది. ఈడ ఎక్రం తక్వల తక్వ 3 కోట్లపైనే. సర్కారిచ్చే ఎక్రం పైసలతోటి నూరు గజాల జాగ కూడా రాదు. ఇంకెన్నిమాట్ల మా ఊరి భూములు గుంజుకుంటరని ఏడాది సంది రైతులు మర్లవడ్తుర్రు. మొన్న మంత్రి జగదీశ్ రెడ్డి గారు కలెక్టర్ ఆఫీసుకొచ్చి.. అపాయింట్మెంట్ ఇవ్వనందుకు కారుకు అడ్డంబడ్డరు. గంతే.. బెయిల్ రాని కేసులు.. నల్గొండ జైలుకు పంపుడు. భువనగిరి కోర్టుకు తీసుకొస్తానికి నలుగురు రైతులకు సంకెళ్లు ఏశిండ్రు. ఆ బొమ్మలు సూడంగనే నా పానం కలుక్కుమన్నది.

పంట భూమిలేని ఊరు కావాల్నా? 

ఈ ఒక్కూరే ఎన్నిమాట్ల భూములియ్యాలే..? పంట భూమిలేని ఊరు కావాల్నా? నిజమే, ఉంకో ఊరికెల్లి తీస్తే అక్కడొళ్లకు కూడా నష్టమే. అందుకే ఆ భూమి ఇలువ ఎంతుం దో.. అంత రేట్ కట్టిస్తే జెరంత నిమ్మల వడ్తరు. ఆ పైసలతో ఉంకోకాడ ఇంత జాగ కొన్కుం టరు. మాట్లాడి ఒప్పించడానికి ఎన్నో మార్గాలున్నా అధికారం ఉంది కదా అని రైతులకు సంకెళ్లు ఏస్తరా? మర్డర్లు చేసిం డ్రా? రేప్ లు చేసిండ్రా? బ్యాంకులను ముం చిండ్రా? దేశాన్ని దోస్క తిన్నరా? ముచ్చట రచ్చైనంక.. 

అసలు ఆళ్లు రైతులే కాదని కొత్త రాగం ఎత్తుకుండ్రు. ఔ, నిజమే. భూములన్నీ గుంజుకున్నక రైతులెట్ల యితరు? కనీసం మనుషులు కూడా కారా? మరీ ఇంత దుర్మార్గమా? అదేందోగని.. మున్సిపాల్టీలకు మాస్టర్ ప్లాన్లు గీశినా, ఫార్మాసిటీలు కడుతున్నా, ప్రాజెక్టుల కోసమైనా పేదల భూములే వోతయి. నా భూమివోయిందని, ఫాంహౌస్ పోయిందని ఏ మంత్రి, ఏ లీడర్, ఏ యాక్టర్, ఏ సెలబ్రిటీ అనంగైతే ఇనలే. ఇప్పుడు మన హైదరాబాద్​కు వచ్చిన బుద్ధుడు చాలా ప్రశాంతంగా ఉన్నడు. ఆ బుద్ధుడికి రాయిచ్చిన రాగీరే దుఖల ఉన్నది. యాదగిరిగుట్ట నర్సన్న మారాజైండు కొత్త గుడి కట్టుకొని. కని మా రాగీరోళ్లే బికారిలైతుండ్రు భూములు వొయ్యి. వరంగల్​కు ఉర్కెటోళ్లకు ఏక్ నెం బర్ రాస్తా అయింది. కని మా రాగీరే రంధి లున్న బతుకుదెరువు పోతుందని. ఆర్ఆర్ఆర్ వస్తుంది భూములకు ఇలువ పెరుగుతదని సుట్టున్నోళ్లం మురుస్తున్నం. కాని మా రాగీరే కొందరి రాజకీయానికి బలైతుంది.

రఘు భువనగిరి