ఖాళీ జాగా ఉంటే పాగావేసుడే

 ఖాళీ జాగా ఉంటే పాగావేసుడే
  • డబుల్​ డాక్యుమెంట్లు..సెటిల్​మెంట్లు
  • జిల్లాలో విస్తరిస్తున్న దందా 
  • నాయకులు, రౌడీలు, పహిల్వాన్​ల కీరోల్​​ 
  • ఠాణాల చుట్టూ తిరుగుతున్న బాధితులు 

నిజామాబాద్​, వెలుగు : జిల్లాలో ల్యాండ్​ వివాదాలు ఏరోజుకారోజు పెరుగుతున్నాయి. ఈజీ మనీ ఆశిస్తున్న లీడర్లు తమ పలుకుబడిని ఉపయోగించి సెటిల్​మెంట్ల దందా సాగిస్తున్నారు. ఇందుకోసం గ్యాంగులను మెయింటెన్​ చేస్తున్నారు. గవర్నమెంట్​, ప్రైవేట్​ ఖాళీ జాగా కనపడితే చాలు అక్కడ వాలిపోతున్నారు. బోగస్​ పత్రాలు సృష్టించి బ్లాక్​ మెయిల్​ చేయడం.. అన్నీ అనుకూలిస్తే అమాయకులకు వాటిని అమ్మేసి రూ.లక్షలు జేబులో వేసుకుంటున్నారు. చట్టం లొసుగులను ఆసరా చేసుకొని నడుస్తున్న వ్యవహారాన్ని అరికట్టేందుకు అధికారులు ధైర్యం చేయడంలేదు. 

న్యాయం కోసం బాధితులు ఠాణాలకు వచ్చినప్పుడు కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారే తప్ప బాధితులకు సరైన న్యాయం జరగడంలేదు. భూవివాదాలవల్ల నగర మేయర్​ నీతూకిరణ్​ భర్త దండు శేఖర్​పై బౌన్సర్ హత్యాయత్నం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న భూదందాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. నిజామాబాద్ సిటీ శివారులోని నాగారం ఏరియాలో సుమారు 4 వేల ఎకరాల సర్కారు ల్యాండ్​ ఉంది. ఇక్కడ 20 ఏండ్ల కింద 80 క్వార్టర్లు నిర్మించి పేద కుటుంబాలకు పంపిణీ చేశారు. 

బీపీఎల్​ ఫ్యామిలీస్​కు ఇంటి జాగాలకు సంబంధించి ఎప్పుడు డిమాండ్​ వచ్చినా అధికారులు ఈ ప్రాంతానికే వస్తారు. ఇక్కడ విడతల వారీగా వేలాది మంది పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇక్కడ అనేక కాలనీలు వెలిశాయి. నిజామాబాద్ మున్సిపల్​ కార్పొరేషన్ పరిధిలోని 10, 11 డివిజన్లు ఈ కాలనీలతోనే ఏర్పడ్డాయి. 

లీడర్లే కబ్జాదారులు 

ఈ కాలనీల్లో ఇండ్లు కట్టుకోకుండా ఖాళీగా ఉన్న ప్లాట్లను కబ్జా చేసేందుకు లోకల్​ లీడర్ల గ్యాంగులు ప్రయత్నిస్తునాయి. ఒకే జాగాకు రెండు మూడు బోగస్​ పట్టాలు సృష్టించి అసలు ఓనర్లను బెదిరిస్తున్నారు. కొత్త నంబర్లతో బొందెం చెరువు శిఖం భూమిని ఇంటి జాగాలుగా మార్చి అమ్మేయగా అక్కడ నిర్మించుకున్న 36 ఇండ్లను ఆగస్టులో రెవెన్యూ ఆఫీసర్లు కూల్చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు 5వ టౌన్​లో ఒక మహిళా కార్పొరేటర్​ భర్తతో పాటు ఆరుగురిపై కేసు నమోదైంది. అయినా వారికి న్యాయం జరగకపోవడంతో బాధితులు ఇప్పటికీ కలెక్టర్​ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. 

నకిలీ పట్టాలతో చాలా ప్లాట్లు కబ్జా అయ్యాయి. నాగారంలో నాలుగు గ్యాంగ్​లు ఖాళీ జాగాలు కొట్టేయడానికి పోటీపడుతున్నాయి. మేయర్​ నీతూకిరణ్​ భర్త దండు శేఖర్​, బౌన్సర్​ రసూల్​ మధ్య వివాదానికి ప్లాట్ల వివాదమే కారణమైంది. గతంలో కూడా శేఖర్​కు, రూరల్​ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ అల్లుడికి కూడా బూముల విషయంలో గొడవ జరిగింది. నగర శివారులోని పాంగ్రా, ముబారక్​నగర్​లలో కూడా ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలకు సంబంధించి కూడా ఒక గ్యాంగ్​ దొంగ పత్రాలు తయారు చేసి బ్లాక్​మెయిల్​చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. 

బోగస్​ పత్రాలతో బెదిరింపులు 

పట్టణంలోని ఆటోనగర్​లో 20 ఏండ్ల కింద సుమారు 1,660 ఇంటి స్థలాలను డిమార్కింగ్​ చేసి ఇందిరమ్మ స్కీం కింద అప్పటి గవర్నమెంట్​ పంపిణీ చేసింది. అయితే ఎవరికీ కేటాయించకుండా ఖాళీగా వదిలేసిన ప్లాట్స్​ను బోగస్​ పత్రాలతో ఎంటరైన రెండు గ్యాంగ్​లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒక పహిల్వాన్​తో పాటు మాజీ సర్పంచ్​ కొడుకు, మరో ఇద్దరు కలిసి డుప్లికేట్​ పట్టాలతో అసలు ఓనర్లను బెదిరిస్తున్నారు. ఓ మాజీ కౌన్సిలర్ అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకోగా గవర్నమెంట్​ ఏర్పాటు చేసిన కాలనీలో ఏకంగా రియల్​ ఎస్టేట్​ ఆఫీస్​లే వెలిశాయి. 

ఇంటి నంబర్లు సృష్టించి.. 

ఆర్మూర్​ మున్సిపాలిటీ పరిధిలో 144 ఖాళీ జాగాలకు ఇంటి నంబర్లు కేటాయించుకొని వాటిని అమ్మడానికి ఓ పొలిటికల్​ లీడర్లు తెగబడ్డారు. ఇంటి నంబర్లు పొందిన వ్యక్తులకు నోటీస్​లు జారీ చేయమని కలెక్టర్​ రాజీవ్​గాంధీ ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. పెర్కిట్​, కోట ఆర్మూర్​, తాజ్​ గార్డెన్​ వద్ద సర్కారు స్థలాల డబుల్​ రిజిస్ట్రేషన్​లు వివాదంగా మారాయి. బాల్కొండలో ఖిల్లా ల్యాండ్​ ఆక్రమించుకొని ఒక లీడర్ ​వెంచర్​ డెవలప్​ చేశారు. ఫత్తేపూర్, భీంగల్, నవీపేట, మాధవ్​నగర్​లలో కూడా లాండ్​ దందాలు సాగుతున్నాయి.