కరీంనగర్, వెలుగు: గ్రామాల్లో భూతగాదాలు ప్రాణా ల మీదికి తెస్తున్నాయి. భూమి కోసం కొందరు ఎదుటి వారి ప్రాణం తీయడమో లేదంటే ఏండ్ల తరబడి తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆత్మహత్యాయత్నమో చేస్తున్నారు. వీటిలో మెజార్టీ సమస్యలు భూరికార్డుల ప్రక్షాళన ద్వారా రూపొందించిన ధరణి పోర్టల్‌తో తలెత్తినవే ఉంటున్నాయి. గత సర్కార్ భూరికార్డుల ప్రక్షాళన సమయంలో సమగ్ర భూసర్వే చేయకపోవడం, కేవలం రికార్డు టు రికార్డు మాత్రమే మార్చడంతో గెట్టు తగాదాలతోపాటు ఓనర్ షిప్ విషయంలో కొత్త వివాదాలు తెరపైకి వచ్చాయి. అవే చిక్కుముళ్లుగా మారి ఇప్పుడు రైతులను వెంటాడుతున్నాయి. వాటిని పరిష్కరించడం కూడా ఇప్పుడు రెవెన్యూ ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. దీంతో రైతులు తమ సమస్య పరిష్కారం కావడం లేదని తరుచూ తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్లలో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతుండగా.. గెట్టు తగదాలు, ఓనర్ షిప్ విషయంలో ఉన్న గొడవల కారణంగా హత్యలకు పాల్పడడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికైనా భూసమస్యల పరిష్కారంలో స్పీడ్ పెంచాలని భూబాధితులు కోరుతున్నారు.
ధరణితో తలెత్తిన సమస్యలే ఎక్కువ..
అన్ని భూవివాదాలకు పరిష్కారమని గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టలే అనేక కొత్త వివాదాలకు కారణమైంది. ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుంచే అందులో తమ పేరు రాలేదని, భూమి ఎక్కలేదన్న ఆవేదనతో కలెక్టరేట్లు, తహసీల్దార్ ఆఫీసుల ముందు పదుల సంఖ్యలో బాధిత రైతులు కిరోసిన్, పెట్రోల్ బాటిళ్లు, పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్యాయత్నాలు చేశారు. ధరణి కారణంగా ఇప్పటివరకు 10 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకోగా.. అనేక హత్యలు కూడా జరిగాయి. కొందరు రైతులు గుండెపోటుతో చనిపోయారు. వెలుగులోకి రాని మరణాలు, సెటిల్మెంట్లు అనేకం ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని మ్యుటేషన్ చేసుకోకపోతే అలాంటి భూములకు పట్టాదారులుగా ధరణిలో పాత ఓనర్ల పేర్లే వచ్చాయి. ఇదే అదనుగా పాత ఓనర్లు గుట్టుచప్పుడు కాకుండా మరొకరికి భూములు
అమ్మేయడం, లేదంటే తమ బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయడం లాంటి ఘటనలు ఘర్షణలకు దారి
తీస్తున్నాయి. అలాగే సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన సుమారు 20 లక్షల ఎకరాల భూములకు కొత్త ఆర్వోఆర్ చట్టం కారణంగా పాస్ బుక్స్ ఇవ్వలేదు. దీంతో పాత పట్టాదారులు వేరొకరికి రిజిస్ట్రేషన్లు చేయడం కూడా కొత్త భూవివాదాలను సృష్టిస్తోంది.
తహసీల్దార్ల దగ్గరే ఎక్కువ పెండింగ్
ప్రభుత్వం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో సుమారు రెండున్నర లక్షల దరఖాస్తులు రాగా..అవన్నీ కలెక్టర్ల లాగిన్లోకి వెళ్లాయి. దీంతో అడుగు ముందుకు పడలేదు.ఈ నేపథ్యంలోనే ధరణి సమస్యల వేదిక సభ్యుడు, హైకోర్టు అడ్వకేట్ గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి గతంలో కోదండరెడ్డికి చేసిన సూచనల మేరకు తహసీల్దార్ల లాగిన్లోకి అన్ని అప్లికేషన్లు వెళ్లేలా మార్పులు చేశారు. ధరణిలో 2.43 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉంటే, వీటిలో జూన్ 29 వరకు కేవలం 24,778 మాత్రమే క్లియర్ అయ్యాయి. ఇందులోనూ చాలా అప్లికేషన్లు అకారణంగా రిజెక్ట్ చేశారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం తహసీల్దార్ల లాగిన్లలో1.48 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండగా..ఆర్డీవోల వద్ద 53,478, అడిషనల్ కలెక్టర్ల వద్ద 20,451, కలెక్టర్ల వద్ద 12,405 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కసారిగా అప్లికేషన్లు కుప్పలుగా వచ్చి పడడంతో తహసీల్దార్లకు కూడా తలనొప్పిగా మారింది. ఒక్కో తహసీల్దార్ లాగిన్‌లో 300 నుంచి 500 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో లెక్క చేతి కింద వీఆర్వోలు, వీఆర్ఏలు లేకపోవడం, ఒకరిద్దరు ఆర్ఐలు మాత్రమే ఉండడంతో రికార్డులు వెరిఫై చేయడం, రిపోర్టులు సిద్ధం చేయడం వారికి సమస్యగా మారింది. రోజుకు 10 నుంచి 20కి మించి దరఖాస్తులను పరిశీలించలేకపోతున్నారు.
ధరణితో ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ రెవెన్యూ పరిధిలోని ఐలోనిపల్లికి చెందిన ఏనుగుల మల్లేశం(55) తన పట్టా భూమి ఇనాం భూమిగా ధరణిలో నమోదైందని, 20 గుంటల వ్యవసాయ భూమి హౌస్ సైట్స్‌గా నమోదైందని నిరుడు ఆగస్టులో కొత్తపల్లి తహసీల్దార్ ఆఫీసు ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఐదు రోజులకే సమస్య పరిష్కారమైంది.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు సమీపంలోని నల్ల వెంక్కయపల్లికి చెందిన కలాలి శ్రీనివాసరెడ్డి(36)కు తన అత్తమామల ద్వారా వచ్చిన భూమి ఉంది. ఈ భూమి ధరణి పోర్టల్‌లో నమోదు కాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లికి చెందిన చింతల స్వామి(45) తండ్రి నర్సయ్య పేరిట ఉండాల్సిన 14.5 ఎకరాల భూమి వేరే వ్యక్తుల పేరు మీదికి మారింది. ఆ భూమిని తమ పేరిట మార్చాలని కోరగా.. ఆ భూమిని కుదువ పెట్టి బ్యాంకుల్లో అప్పు తీసుకున్నారని, మార్టిగేజ్ లో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని ఆఫీసర్లు చెప్పడంతో స్వామి 2021 డిసెంబర్ 13న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన గోపు రోజమ్మ(65)కు ఉన్న రెండు ఎకరాల భూమి వేరే ఇద్దరు వ్యక్తుల పేరిట నమోదు కావడం, ఆఫీసర్లు మార్చకపోవడంతో 2020 నవంబర్ 14న ఆత్మహత్యకు పాల్పడింది.
జనగామ జిల్లా జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగారావు తన భూసమస్య పరిష్కారం కోసం జనగామ కలెక్టరేట్ లో ఇప్పటి వరకు మూడు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు.
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె సవారన్నకు చెందిన ఐదెకరాల భూమి ధరణిలో వేరే వ్యక్తుల పేర్లపైకి వచ్చింది. పలుమార్లు తహసీల్దార్ కు విన్నవించిన సవారన్న ఈ నెల 1న కొడుకులతో కలిసి ప్రజావాణికి రాగా.. ఆయన కొడుకు పరశురాం అడిషనల్ కలెక్టర్ ముందే పురుగులమందు తాగేందుకు ప్రయత్నించాడు.
జనగామ జిల్లా నర్మెటకు చెందిన దేవులపల్లి జ్యోతి తనకు వారసత్వంగా వచ్చిన 1.04 ఎకరాల భూమిని రాజకీయ నాయకుడు కబ్జా చేశాడని పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సోమవారం తన ఇద్దరు పిల్లలను తీసుకుని జనగామ కలెక్టరేట్ కు వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది.
శంషాబాద్ గ్రామానికి చెందిన చిన్న కేశకమలమ్మ, లక్ష్మయ్య దంపతుల పేరిట గాన్సీమియాగూడ రెవెన్యూ పరిధిలో 8 ఎకరాల భూమి ఉంది. తమ భూమిని ధరణి నుంచి తొలగించారని ఏడాదిగా చెప్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ నెల 1న తహసీల్దార్ ఆఫీసులో కమలమ్మ కొడుకు సూరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు.
ప్రభుత్వం మారాకే ధరణి సమస్యలపై ఫోకస్
గత బీఆర్ఎస్ సర్కార్ రైతులు ఎదుర్కొంటున్న వివిధ భూసమస్యలపై అప్లికేషన్లు పెట్టుకునేందుకు ధరణి పోర్టల్ లో కొత్త మాడ్యుల్స్, ఆప్షన్లు తీసుకురావడమే తప్పా సమస్యలకు పరిష్కారం చూపలేదు. అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని కేవలం కలెక్టర్, సీసీఎల్ఏ చేతుల్లోనే పెట్టింది. సమస్యలపై లక్షల్లో అప్లికేషన్లు రావడంతో వాటిని పరిశీలించడం, పరిష్కరించడం కలెక్టర్లు, సీసీఎల్ఏకు ఇబ్బందిగా మారింది. దీంతో లక్షల్లో దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి సమస్యలపై అధ్యయనానికి కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ముందుగా రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.