కుటుంబ సభ్యులతో భూ తగాదాలు..ఎంపీవో దారుణ హత్య

వనపర్తి, వెలుగు: భూ తగాదాల కారణంగా సొంత అన్నదమ్ముల చేతిలో వీపనగండ్ల ఎంపీవో (మండల పంచాయతీ అధికారి) మూడవత్ బద్రీనాథ్ (48) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగింది. బైక్​పై వెళ్తున్న బద్రీనాథ్​ను ముగ్గురు అన్నదమ్ములు అడ్డగించి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్​కెళ్లి లొంగిపోయారు. వనపర్తి మండలం రాజంపేట గ్రామానికి చెందిన మూడవత్ బద్రీనాథ్, మూడవత్ టోక్యో, మూడవత్ సర్దార్, మూడవత్ పరమేశ్ అన్నదమ్ములు. వీళ్లకు 25 ఎకరాల భూమి ఉంది. ఒక్కో ఎకరం కనీసం రూ.2 కోట్లపైనే పలుకుతుంది. పంపకాల విషయంలో కొన్నేండ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బద్రీనాథ్ తమను బెదిరిస్తున్నాడంటూ ముగ్గురు అన్నదమ్ములు గ్రామంలో పంచాయితీ పెట్టారు.

అయినా, వీరి మధ్య సయోధ్య కుదరలేదు. రోజురోజుకూ బెదిరింపులు ఎక్కువ కావడంతో బద్రీనాథ్​ను చంపేయాలని ముగ్గురు నిర్ణయించుకున్నారు. బుధవారం వీపనగండ్ల మండలంలో విధులు ముగించుకుని తన ఫ్రెండ్​తో బైక్​పై బద్రీనాథ్ వనపర్తికి బయలుదేరాడు. వనపర్తి రూరల్ పోలీస్​స్టేషన్​కు దగ్గర్లో బద్రీనాథ్​ను అన్నదమ్ములు అడ్డుకున్నారు. భూమి విషయమై నిలదీశారు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. అప్పటికే తమవెంట తెచ్చుకున్న కత్తులతో బద్రీనాథ్​పై టోక్యో, సర్దార్, పరమేశ్ దాడి చేశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బద్రీనాథ్ ఫ్రెండ్ కత్తిపోటుకు గురవడంతో అతన్ని స్థానికులు దగ్గర్లోని హాస్పిటల్​కు తరలించారు. బద్రీనాథ్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ముగ్గురు బైక్​పై పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయారు. తామే బద్రీనాథ్​ను చంపినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి
తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.