- దున్నే వాడిదే భూమి కమ్యూనిస్టు పార్టీ నినాదం
- ఈ పోరాట స్ఫూర్తితోనే కేరళ, పశ్చిమ బెంగాల్ లో ఉద్యమాలు
- పాలకుర్తిలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
పాలకుర్తి, వెలుగు : ప్రపంచ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి ఎల్. నారాయణ పేర్కొన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తిలో సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తికి జరిగిన సాయుధ పోరులో 4 వేల మంది రైతులు, ప్రజలు అమరులయ్యారని, ఆ పోరాటం నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే కేరళ, పశ్చిమ బెంగాల్ లోని ప్రజలు భూస్వాములపై తిరుగుబాటు చేశారని గుర్తుచేశారు. దున్నేవాడిదే భూమి కమ్యూనిస్టు పార్టీ నినాదమన్నారు. దేశంలో జమిలి ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోందని, దానికి వ్యతిరేకంగా ఇండియా కూటమితో కలిసి అన్ని వామపక్ష పార్టీలు ఉద్యమిస్తాయన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, నల్లా నర్సింహులు కూతురు అరుణ, మాజీ ఎమ్మెల్యేలు రాజారెడ్డి, వన్నాల శ్రీరాములు, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షుడు మాచర్ల సారయ్య, రాపర్తి మంజుల, పోగు శ్రీనివాస్, మాచర్ల పుల్లయ్య తదితరులు
పాల్గొన్నారు.
మూసీ ప్రక్షాళన జరగాల్సిందే..
హైదరాబాద్ డెవలప్ కావాలంటే కచ్చితంగా మూసీ ప్రక్షాళన జరగాల్సిందే అని నారాయణ స్పష్టం చేశారు. పాలకుర్తిలో మీడియాతో మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనకు తమ పార్టీ 30 ఏండ్లుగా పోరాడుతుందని గుర్తుచేశారు. తెలిసో తెలియకో చాలామంది పేదలు నది వెంట గుడిసెలు వేసుకున్నారని, ప్రతి కుటుంబానికి అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాతనే మూసీ ప్రక్షాళన చేయాలన్నారు. అలా కాకుండా కూల్చివేతలు చేస్తామంటే ఒప్పుకోమన్నారు. కొందరని రాజకీయంగా వాడుకునేందుకు అపోజిషన్ పార్టీ రెచ్చగొడుతుందని విమర్శించారు. కొందరు హైడ్రాపై విష ప్రచారం చేస్తున్నారని, వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు.