రైతులు కౌలు కట్టకుండా కట్టడి చేస్తున్న లీడర్లు

  • ఆఫీసర్ల ఆదేశాలు బేఖాతర్​ చేస్తున్న ఆక్రమణదారులు

భద్రాచలం, వెలుగు: ఏపీలో ఉన్న భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం భూములకు ఎసరు పెడుతున్నారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్​ ఆదేశాలను సైతం కబ్జాదారులు ఖాతరు చేయడం లేదు. ఆక్రమించిన స్థలాల్లో భవనాలు కట్టొద్దంటూ సూచించినా వారు తగ్గడం లేదు. దేవుని భూముల్లో బహుళ అంతస్థుల భవనాలు కట్టేస్తున్నారు. అడ్డుకుంటే దేవస్థానం స్టాఫ్​పై దాడులకు తెగబడుతున్నారు. దేవుడి భూమిలో దేవస్థానం కడుతున్న గోశాలను సైతం కబ్జాదారులు అడ్డుకునేంతగా రాజకీయ జోక్యం ఉంది. దాడి చేశారని గాయాలతో వెళ్లి ఫిర్యాదు చేసినా కేసులు పెట్టడం లేదు. దేవుడి భూములు కబ్జా చేస్తున్నారని రెవెన్యూ శాఖకు విన్నవించినా ఎంక్వైరీ చేయకపోవడం, కేసులు పెట్టకపోవడంతో ఏపీలోని రాములోరి భూములకు సెక్యూరిటీ లేకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

దేవస్థానం ఆఫీసర్లపై తిరగబడుతున్రు..

ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు పురుషోత్తమపట్నం భూములకు సాగుదారులు కౌలు కింద ఏటా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి డబ్బులు కట్టేవారు. కానీ పోలవరం ఆర్డినెన్స్ ద్వారా భద్రాచలం పట్టణ​శివారులో ఉన్న ప్రాంతం అంతా ఏపీలో విలీనం అయింది. పురుషోత్తమపట్నంలో ఉన్న 917 ఎకరాల రాములోరి భూమి ఏపీలో కలిసింది. 27.50 ఎకరాలు దేవస్థానం అమ్మేయగా, 889.50 ఎకరాలు మిగిలింది. 360 మందికి పైగా రైతులు దేవుడి భూములను సాగు చేసుకుంటున్నారు. వీరంతా ప్రస్తుతం కౌలు డబ్బులు కట్టడం లేదు. 647 ఎకరాలకు కౌలు కింద ఏడాదికి ఎకరానికి రూ.4 వేల చొప్పున దేవస్థానం వసూలు చేస్తోంది. మిగిలిన భూమి సాగులో లేదు. ఇదిలాఉంటే భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న 23 ఎకరాల భూమిలో స్థానికులు ముందుగా గుడిసెలు వేస్తున్నారు. ఆ తర్వాత బిల్డింగ్‍లు లేపుతున్నారు. ఎండోమెంట్ ఆఫీసర్లు వెళ్లి అడ్డుకుంటే ఎదురు తిరుగుతున్నారు. తోపులాటలో రామిరెడ్డి అనే ఉద్యోగి చేతికి గాయం కాగా, ఎటపాక పోలీస్‍స్టేషన్‍లో ఫిర్యాదు చేశారు. ఇలా రెండేళ్లలో గొడవలు, ఆక్రమణలపై దేవస్థానం 30కి పైగా కేసులు పెట్టింది. కానీ ఈ కేసులపై ఎలాంటి స్పందనా లేదు. ఆక్రమణదారులు ఏపీ నేతలను ఆశ్రయించడంతో వారు పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో ఏపీలోని దేవస్థానం భూములకు రక్షణ లేకుండా పోతుంది.

పట్టించుకోని సర్కార్

భద్రాద్రి రాముడి భూములను కాపాడే విషయాన్ని తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్న కొద్ది మంది దేవస్థానం ఉద్యోగులు ఆక్రమణదారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవుడి భూముల్లోకి మాకుమ్మడిగా వస్తున్న ఆక్రమణదారులను నిలువరించలేక పోతున్నారు. దేవస్థానం నుంచి ఎండోమెంట్​ డిపార్ట్​మెంట్​కు పంపిస్తున్న లెటర్లపై ఎలాంటి స్పందనా ఉండడం లేదనే విమర్శలున్నాయి. గోశాల పనులను అడ్డుకుంటున్న ఆక్రమణదారులు 23 ఎకరాల్లో పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. మరో 25 ఎకరాల రామాయణం థీమ్​ పార్కుపై కన్నేశారు. మూకుమ్మడిగా వచ్చి భూములను ఆక్రమించుకొనే ప్రయత్నం చేయడంతో ఐదు రోజులుగా ఉద్రిక్తత నెలకొంది.  

కమిషనర్​కు నివేదించాం

ఆక్రమణలపై రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్​కు నివేదించాం. ఏపీ ఎండోమెంట్​ కమిషనర్, అల్లూరి జిల్లా కలెక్టర్​తో పాటు భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​కు పరిస్థితిని వివరించాం. ఆక్రమణలను అడ్డుకుంటున్నాం. 

- శివాజీ, ఈవో