కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం భూసర్వే నిర్వహించేందుకు రోటిబండతండాకు వచ్చిన రెవెన్యూ అధికారులను శుక్రవారం రైతులు అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూములిచ్చేది లేదని సర్వే వెంటనే నిలిపివేయాలని గిరిజన మహిళలు రోడ్డుపై ప్లకార్డులతో నిరసన తెలిపారు.
తమపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనుమతి లేనిదే సర్వే ఎలా చేస్తారని అధికారులను నిలదీశారు. గతంలో మాదిరిగా ఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీనివాస్ పోలీసులను భారీగా మోహరించారు. పోలీసుల పహరా మధ్య అధికారులు సర్వే కొనసాగించారు. దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్, పులిచర్లకుంట తండా, రోటిబండ తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 1177 ఎకరాల భూసేకరణకు టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో 534 ఏకరాలు ప్రభుత్వ భూమి కాగా 643 ఎకరాలు పట్టా భూమి ఉందని దుద్యాల తహసీల్దార్ కిషన్ తెలిపారు. నష్టపరిహారం కింద ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల ప్లాటు, ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇంటి మంజూరుకు వికారాబాద్ కలెక్టర్ రైతులకు హామీ ఇవ్వడంతో భూసేకరణకు అంగీకరించారు. పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల , పులిచర్లకుంట తండాలో ఇప్పటికే సర్వే పూర్తయింది. పోలేపల్లి రైతులకు నష్టపరిహారం అందించారు. రోటిబండ తండా పరిధిలో ఉన్న 17 ఏకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు అధికారులు వెళ్లడంతో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది.