తప్పుడు డాక్యుమెంట్స్​తో లావాదేవీలు

  • ఒకే ల్యాండ్ ఇద్దరు, ముగ్గురికి అమ్మకాలు

  • కమీషన్లకు అలవాటు పడి అక్రమార్కులకు సహకరిస్తున్న కొందరు అధికారులు

  • కోర్టులు, స్టేషన్ల  చుట్టూ తిరుగుతున్న బాధితులు

హనుమకొండ, వెలుగు: వరంగల్​నగరంలో భూమోసాలు ఎక్కువైపోయాయి. భూముల రేట్లు పెరిగిపోవడం, ధరణిలో లోపాలను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు అడ్డగోలు దందాలకు తెరలేపుతున్నారు. ఖాళీ జాగాలు, ప్రభుత్వ స్థలాలకు నకిలీ సేల్​ డీడ్​ సృష్టించి అమ్మకాలు జరుపుతుండగా.. ఇంకొంతమంది ఒకే ల్యాండ్​ను పార్ట్ రిజిస్ట్రేషన్ల పేరుతో వేరేవారికి అంటగడుతున్నారు. అయితే ఇలాంటి భూ మోసాలకు రిజిస్ట్రేషన్​ ఆఫీసులే అడ్డాగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పర్సంటేజీలకు ఆశపడి కొంతమంది సిబ్బంది భూ అక్రమార్కులకు సహకరిస్తుండటంతో  డబుల్​రిజిస్ట్రేషన్​ దందా జోరుగా సాగుతోంది. బాధితులు ఫీల్డ్​ మీదకు వెళ్లేసరికి గొడవలు జరుగుతుండగా.. వారు పోలీసులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో బల్దియాలో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. 

ధరణిలో లోపాలతో మోసాలు

ధరణిలో లోపాలను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు డబుల్​దందా చేస్తున్నారు. పహాణీల్లో పాత యజమానుల పేర్లే వస్తుండటంతో కొంతమంది మళ్లీ ఇతరులకు అమ్మేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరోవైపు భూములు రేట్లు పెరుగుతుండటంతో కొందరు ముఠాలుగా ఏర్పడి భూదందాలు మొదలుపెట్టారు. ఒకే భూమిని రెండు, మూడు భాగాలుగా చూపించి పార్ట్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మీడియేటర్ల సాయంతో భూములు అమ్మి, తర్వాత తప్పుకోవడంతో వాటిని కొన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. 
రింగ్ రోడ్డు చుట్టూ దందా గ్రేటర్​లో డెవలప్ మెంట్​కు మంచి స్కోప్​ ఉండటంతో ఇండస్ట్రీలు, కంపెనీలు, ఎడ్యుకేషన్​ ఇన్​ స్టిట్యూషన్స్, హాస్పిటల్స్​ క్యూ కడుతున్నాయి. నేషనల్​ హైవే-163కి బైపాస్​ గా వరంగల్ శివారు నుంచి రింగ్​ రోడ్డు కూడా వెళ్లడంతో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. దీంతో రింగ్​ రోడ్డు చుట్టూ డబుల్​ రిజిస్ట్రేషన్​ దందా ఎక్కువైంది. భూవివాదాలు పెరగడంతో అధికార పార్టీకి చెందిన ఓ నేత ఇక్కడి భూములపై కన్నేశాడు. వివాదంలో ఉన్న భూములను సెటిల్​ మెంట్ చేస్తూ ఆయనే కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. 

ఆఫీసర్ల సహకారంతోనే..

ఈ దందాలో రిజిస్ట్రేషన్​ ఆఫీసుల్లో ఉండే  సిబ్బందితో పాటు కొందరు మీడియేటర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఖాళీగా ఉన్న ప్లాట్లను చూసి ఫేక్​ డాక్యుమెంట్స్​ సృష్టించేందుకు వీరే సహకరిస్తున్నరు. విదేశాల్లో ఉన్న వ్యక్తుల పేరున నకిలీ  జీపీఏలు, నకిలీ సేల్​ డీడ్స్​ సృష్టించి అమ్మకాలు జరుపుతున్నారు. ఇదివరకు కాజీపేట పీఎస్​ పరిధిలో ఓ ఇద్దరు సీఐలు దేవన్నపేట పరిధి సుబ్బయ్యపల్లిలో  రూ.కోట్లు విలువ చేసే 20 గుంటల భూమిని బంధువులను బినామీలుగా పెట్టి డబుల్​ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్​ ఆఫీస్​లో ఓ అధికారి కీలకంగా వ్యవహరించారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఆ సీఐలపై ఉన్నతాధికారులు వేటు వేశారు. కొందరు అక్రమార్కులు ఖాళీగా ఉండే ప్లాట్లను గుర్తించి, సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీస్​ సిబ్బంది సహకారంతో నకిలీ సేల్​డీడ్స్ సృష్టిస్తున్నారు. అనంతరం నకిలీ పేపర్లు తయారుచేసుకుని అమ్మకానికి పెడుతున్నారు. రిజిస్ట్రేషన్​ సమయంలో డాక్యుమెంట్స్​వెరిఫై చేయడంతో పాటు ఫీల్డ్​ విజిట్​ చేయకపోవడం వల్లే ఇలాంటి అక్రమాలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. 

ఈసీ వెరిఫై చేసుకుని తీసుకోవాలి

రియల్​ ఎస్టేట్​ పుంజుకున్న తరువాత డబుల్​ రిజిస్ట్రేషన్లు ఎక్కువైన విషయం వాస్తవమే. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు  భూ కొనుగోలుదారులు ముందుగా రిజిస్ట్రేషన్​ ఆఫీస్​లో ఈసీ తీసుకోవాలి. దానిని వెరిఫై చేసుకుని ముందుకుపోవాలి. ఇలాంటి అక్రమాలకు సహాయపడుతున్నట్లు తేలితే సిబ్బందిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. డబుల్​ రిజిస్ట్రేషన్ల విషయంలో కొనుగోలుదారులే  జాగ్రత్త వహించాలి. - టి.సంపత్​, సబ్​ రిజిస్ట్రార్​, హనుమకొండ