ఏటా మునుగుతున్నా నివారణ చర్యల్లేవ్
- మునిగిన ప్రతిసారీ తీవ్రంగా నష్టపోతున్న ప్రజలు
- గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోని ఆఫీసర్లు
- ఈసారి రూ.వంద కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారుల అంచనా
రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్లలో భూకబ్జాలు వరదలకు కారణమవుతున్నాయి. కబ్జాలను కంట్రోల్ చేయడంలో జిల్లా యంత్రాంగం ఫెయిలవుతోంది. దీంతో ఏటా కబ్జాలు పెరిగిపోతుండగా టౌన్ ముంపు బారినపడుతోంది. రెండేండ్లుగా పట్టణం మునుగుతున్నా వరద నివారణ చర్యలు చేపట్టడంలో యంత్రాంగం, పాలకులు విఫలమవుతున్నారు. సిరిసిల్ల డెవలప్‌మెంట్ కోసం రూ.వేల కోట్లు వచ్చాయని చెబుతున్నా ముంపు నివారణ చర్యలు చేపట్టడం లేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. వరదలొచ్చిన ప్రతిసారీ ముంపు బారినపడి నష్టపోతున్నామని సామాన్యులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో సుమారు రూ.100 కోట్లపైనా నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
రెండేండ్లలో నాలుగుసార్లు
సిరిసిల్ల పట్టణం రెండేండ్లలో నాలుగు సార్లు ముంపునకు గురైంది. 2021 సెప్టెంబర్‌లో, 2022 జులైలో, అదే ఏడాది సెప్టెంబర్ 12న, తాజాగా కురిసిన వర్షాలతోనూ సిరిసిల్ల ముంపు బారిన పడింది. ఈసారి వానలకు సిరిసిల్ల పట్టణం పైనున్న చెరువులు మత్తళ్లు దూకాయి. కొన్ని చెరువులు తెగిపోయాయి. వరద నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో సిరిసిల్ల లోతట్టు ప్రాంతాలైన వెంకంపేట, సంజీవయ్యనగర్, పాతబస్టాండ్, శాంతినగర్, శ్రీనగర్ కాలనీ, అంబేద్కర్ నగర్, సిద్దార్థనగర్, గణేశ్‌నగర్ కాలనీలు జలమయమయ్యాయి.
కబ్జాలే కారణం
సిరిసిల్ల ముంపునకు కబ్జాలే కారణమని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. సిరిసిల్లలో కొత్త చెరువు, కార్గిల్ లేక్ మినహా మిగతా చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. ఆధునికీకరణ పేరుతో కొత్త చెరువును సగం పూడ్చారు. చెరువు మత్తడి కూడా కబ్జాకు గురైంది. దీంతో నిల్వ సామర్థ్యం తగ్గి లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి. మత్తడి ఇరుగ్గా మారి వేములవాడ, కోనరావుపేట, కరీంనగర్ వెళ్లే రోడ్లపైకి నీరు చేరుతోంది. మున్సిపల్ పరిధిలోని ముష్టిపల్లి శివారులోని ఈదుల చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. 2021లో కబ్జాలు, నాలాల ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించినా రాజకీయ నేతల జోక్యంతో అది పక్కకుపోయింది. సిరిసిల్ల పాత బస్టాండ్ చిన్నపాటి వానకు కూడా జలమయమవుతోంది. కల్వర్టు పనులు పూర్తిచేసినా నిర్మాణ లోపంతో మురుగునీరు రోడ్డపైనే ప్రవహిస్తోంది. శాంతినగర్‌లో రూ.18లక్షలతో కట్టిన డ్రైన్ వరద నీటిని తట్టుకోలేకపోతోంది. రూ.6.21 కోట్లతో రాజీవ్ నగర్, ముష్టిపల్లి నుంచి వచ్చే వరదను కొత్త చెరువులోకి మళ్లించే కాల్వ పనులు ఆగిపోయాయి. వరదలపై 2021లో రివ్యూ చేసిన మంత్రి కేటీఆర్బల్దియా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫండ్స్ మంజూరు చేస్తామని ఫ్లడ్స్ రాకుండా ప్లాన్‌రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. అయినా నేటికీ అది అమలుకాలేదు.
రూ.100 కోట్లపై నష్టం
ప్రస్తుత వర్షాలతో రోడ్లు, బ్రిడ్జిలు తెగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 1,900 ఎకరాల్లో పంటలు నీటమునగగా రూ.35 కోట్లమేర నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 26 చోట్ల ఆర్‌అండ్‌బీ, 45 పీఆర్రోడ్లు తెగిపోగా సుమారు రూ.55కోట్ల మేర నష్టం జరిగినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 575 ఇండ్లు కూలిపోయాయి. సెస్ పరిధిలో 100కుపైగా కరెంట్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు విరిగిపడగా రూ.70లక్షల నష్టం వాటిల్లింది. మొత్తంగా ఈసారి వానలతో రూ.వంద కోట్లపైనా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.