హనుమకొండ, వెలుగు: భూ పట్టాదారుల పేరుతో ఫేక్ జీపీఏ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) సృష్టించి, భూఅక్రమాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 15 నకిలీ రబ్బర్ స్టాంప్స్, మూడు స్మార్ట్ ఫోన్లు, ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. శనివారం హనుమకొండ ఏసీపీ ఆఫీస్‌లో సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ వెల్లడించిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి శివారు సప్తగిరి కాలనీలోని సర్వే నెంబర్ 12లో నాన్ లే అవుట్ వెంచర్లో హనుమకొండ రాంనగర్‌కు చెందిన రాపర్తి సురేశ్ తన అన్న కూతురు నుంచి 200 గజాలు, గోపాలపూర్ సురేంద్రపురి కాలనీకి చెందిన కోమందల సునీల్ రెడ్డి తన అత్తగారి నుంచి 226 గజాలు కొనుగోలు చేశాడు. 2019 నుంచి ఆ ల్యాండ్ వారి అధీనంలోనే ఉంది. కొద్దిరోజుల కింద కొంతమంది దుండగులు ఆ భూమి మీదకొచ్చి తమదేనని దౌర్జన్యానికి దిగారు.
పట్టా దారు పేరుతో ఫేక్ జీపీఏ
హనుమకొండ విజయనగర కాలనీకి చెందిన వల కేదారేశ్వరరావు, వడ్డేపల్లికి చెందిన ఆడెపు సతీశ్ కుమార్, వరంగల్ డాక్టర్స్ కాలనీకి చెందిన సాజిద్ పాషా, ముజమ్మల్ అహ్మద్ అనే నలుగురు కలిసి సప్తగిరి కాలనీలోని సురేశ్, సునీల్ రెడ్డికి సంబంధించిన భూమిపై కన్నేశారు. ఆ భూమికి పింగలి జయరాంచంద్రారెడ్డి, అతడి కొడుకు కార్తీక్ రెడ్డి పట్టాదారులని గుర్తించారు. తమ ప్లాన్‌లో భాగంగా ముజమ్మల్ అహ్మద్ వరంగల్ కు చెందిన చీకటి శివ, సురేశ్ అనే వ్యక్తుల సాయంతో తానే కార్తీక్ రెడ్డిగా నకిలీ ఆధార్ కార్డులు తయారు చేయించుకున్నాడు. అనంతరం వల కేదారేశ్వర్రావుకు ఆ రెండు ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో జీపీఏ చేశాడు.
ఆ తర్వాత కేదారేశ్వర్రావు ఆ స్థలాన్ని హనుమకొండ విజయపాల్ కాలనీకి చెందిన సాజిద్ పాషాకు రిజిస్ట్రేషన్ చేశాడు. ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ కావడంతో అవే నకిలీ పత్రాలతో కరీంనగర్ బెజ్జంకి మండలానికి చెందిన ఐలోని శ్రీకాంత్ రెడ్డి సాయంతో లోన్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆ భూమి తమదేనని, తమకు పట్టాదారులు పింగలి జయరాంచంద్రారెడ్డి, అతడి కొడుకు కార్తీక్ రెడ్డి జీపీఏ చేశాడని, తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయని బాధితులు సురేశ్, సునీల్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో బాధితులు కేయూ పోలీస్ స్టేషన్ లో మూడుసార్లు ఫిర్యాదు చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితులైన వల కేదారేశ్వర్, ఆడెపు సతీశ్, ముజమ్మల్ అహ్మద్ ను అరెస్ట్ చేశారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారు.