నల్గొండ జిల్లాలో అడ్డగోలుగా ల్యాండ్​ ఇష్యూస్

నల్గొండ, వెలుగు :  నకిరేకల్​ మండలం తాటికల్​ గ్రామానికి చెందిన మిర్యాల పద్మకు పసుపుకుంకుమల కింద ఎకరంన్నర భూమి ఇచ్చారు.  ఆ భూమి హైవే కు దగ్గరగా ఉండడంతో పక్కనఉన్న  రైతులు  నాలుగేళ్ల కింద దాన్ని  ఆక్రమించుకున్నరు. దాంతో పద్మ  కోర్టును  ఆశ్రయించింది. కోర్టు నుంచి తహసీల్దార్​కు నోటీసులు అందడంతో   రీ సర్వే చేశారు. అర ఎకరం తక్కువ ఉన్నట్టు సర్వేలో తేలింది. అక్రమణదారులకు అధికార పార్టీ నేతల అండ ఉండటంతో ఆమె ఆవేదనను రెవెన్యూ అధికారులు  పట్టించుకోవడంలేదు.  తన భర్త కిడ్నీ సమస్యతో మంచానపడ్డాడని,  భూమి మాత్రమే  తనకు దిక్కని పద్మ  గ్రీవెన్స్​లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. రెవెన్యూ అధికారులు భూసమస్యలను పరిష్కరించకపోవడంతో  పద్మ లాగానే  చాలా మంది ఈ మధ్యకాలంలో జిల్లా ఎస్పీని ఆశ్రయిస్తున్నారు.  జిల్లా పోలీసులకు ఇటీవల  భూసమస్యలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జిల్లా ఎస్పీగా  అపూర్వరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత  75 రోజుల్లో  గ్రీవెన్స్​లో 182 ఫిర్యాదులు రాగా అందులో 127 అప్లికేషన్లు భూముల తగాదాలకు సంబంధించినవే.  గ్రీవెన్స్​నాడే కాకుండా రోజూ భూతగాదాలకు సంబంధించిన  ఫిర్యాదులతో ఎస్పీ ఆఫీసుకు వస్తున్నారు.ఆర్జీలను పరిశీలించి ఎస్పీ సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు. సివిల్ మ్యాటర్​ కావడంతో ఇరువర్గాలకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.   కోర్టు నుంచి ఇంజక్షన్​ ఆర్డర్​ తెచ్చుకున్న వాళ్లకు పోలీసులు  భద్రత కల్పిస్తున్నారు. కానీ,  కోర్టుకు  వెళ్లలేని వారి తగాదాలను తీర్చడం  పోలీస్ ​డిపార్ట్​మెంట్​కు సవాలుగా మారింది.  

ధరణితోనే  చిక్కులు  

ధరణి వచ్చాక భూములకు సంబంధించిన గొడవలు బాగా పెరిగాయని  పోలీసు అధికారులు కూడా భావిస్తున్నారు. గతంలో కుటుంబసభ్యులందరికీ నోటీసులు ఇచ్చిన  తర్వాత భూముల రిజిస్ట్రేషన్లు  జరిగేవి. కానీ ధరణి వచ్చాక ఈ పద్దతిని నిలిపివేశారు.  దీంతో  కుటుంబ సభ్యులు  ఒకరికి తెల్వకుండా  ఇంకొకరు ధరణిలో స్లాట్​ బుక్​ చేసుకుని భూములు రిజిస్ట్రేషన్​ చేసుకోవడంతో  గొడవలు పెరుగుతున్నాయి. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో  బాధితులు పోలీసులను  ఆశ్రయిస్తున్నారు. 

సొంతవాళ్ల మీదే దాడులు

భూ తగాదాలతో వృద్ధుల మీద కూడా కుటుంబసభ్యులే దాడులకు దిగుతున్నట్టు పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల ద్వారా తెలుస్తోంది. సొంత కుటుంబసభ్యులే ఆస్తి కోసం దాడులు చేస్తున్నారంటూ బాధితులు ఎస్పీ ఎదుట గోడు వెళ్లబోసుకుంటున్నారు. వివిధ కారణాలతో పట్టణాల్లో ఉంటున్న అన్నదమ్ముల భూములను వారికి చెప్పకుండానే పట్టాలు మార్చుకుంటున్నట్టు ఫిర్యాదు చేస్తున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్లు సామాన్యుల భూములను   ఆక్రమించుకుంటున్నారని, స్థానిక రెవెన్యూ, పోలీస్​ అధికారులకు ఫి ర్యాదు చేసినా లాభం లేకపోవడంతో చివరికి ఎస్పీ దగ్గరకు  రావాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. 

“ నా పేరు నంద్యాల నరసింహారెడ్డి. నా వయస్సు  80 ఏళ్లు. మాది కేతేపల్లి మండలం కొప్పోలు.  మేం ముగ్గురం అన్నదమ్ములం. మాకు 13 ఎకరాల భూమి ఉంది. నేను రిటైర్డ్​ ప్రభుత్వ ఉద్యోగిని. ప్రస్తుతం నల్గొండలోనే నివసిస్తున్న. ఇటీవల నా భూమి పంచుకునేందుకు ఊరు వెళ్లిన. కానీ నా అన్నదమ్ములు నాకు చెప్పకుండానే వాళ్ల పేరు మీద మొత్తం భూమిని పట్టా చేయించుకున్నరు. ఇదేంటని అడిగితే నా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో కేతేపల్లి పోలీస్​ స్టేషన్ లో​, రెవిన్యూ అధికారులకు కంప్లైంట్​చేసిన.. డీఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసినా  న్యాయం జరగకపోవడంతో  జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన”   
‘‘నా పేరు కొట్టగొల్ల కొండలు. నాంపల్లి మండలం బండ తిమ్మాపురం. ఇదే మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో రెండేళ్ల కింద ఎకరం 39 గుంటలు భూమి కొన్నా. కొన్న భూమిలోకి వెళ్లి పనులు చేస్తుంటే పక్క నే ఉన్న కొందరు రైతులు నా పై దాడి చేస్తున్నరు. తిమ్మాపురానికి చెందిన నువ్వు ఇక్కడ ఎట్ల భూమి కొంటవ్​. పది లక్షలు గుడ్​ విల్​ ఇవ్వు. లేదంటే భూమి వదిలిపెట్టు పొమ్మని బెదిరిస్తున్నరు. రెవెన్యూ ఆఫీసర్లకు,డీఎస్పీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలే. దీంతో ఎస్పీకి మొరపెట్టుకునేందుకు వచ్చిన” 

కౌన్సిలింగ్ ఇస్తున్నం 

భూ తగాదాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను లోతుగా  పరిశీలిస్తున్నం. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నం. అవసర మైతే ఇరువర్గాలను పిలిపించి కౌన్సిలింగ్​ ఇస్తున్నం. లా అండ్ ఆర్డర్​ ప్రాబ్లం రాకుండా సమస్యను  పరిష్కరించేందుకు కృషి చేస్తున్నం. గ్రీవెన్స్​ డే నాడే  కాకుండా అన్ని రోజుల్లో  బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నయ్​.
- అపూర్వరావు, జిల్లా ఎస్పీ, నల్గొండ