భూ సమస్యలు పరిష్కరించాలి

ఇ టీవల రాష్ట్ర ప్రభుత్వం భూమి విలువలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.  ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఆదాయమూ పెరిగింది.  ఒకే ఏడాదిలో రెండు సార్లు భూముల విలువను ప్రభుత్వం పెంచడంతో, సామాన్యులు ప్రస్తుతం వంద గజాల స్థలాన్ని కూడా కొనలేనంతగా పెరిగిపోయాయి.  తెలంగాణలో అసైన్డ్, లావాణి భూములు ఉన్న వారు ఎక్కువగా  బలహీన వర్గాలే. ఇంకా చెప్పాలంటే దళితులకు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ మెంటు భూములు ఉన్నాయి.  వాటిని అమ్మడానికి, కొనడానికి వీలు లేకపోవడం వల్ల అనేక మంది అసైన్డ్ రైతులు  నష్టపోతున్నారు. 

‘ధరణి’తో బాధలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ భూ ప్రక్షాళన వల్ల రైతులకు మేలు జరగడంతో పాటు.. మరి కొందరు రైతులకు తిప్పలు తప్పడమూ లేదు. ప్రభుత్వం ధరణి సేవలను ఏర్పాటు చేసి మండల స్థాయిలోనే  పూర్తి భూ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పింది. కానీ అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. దీంతో అనేక మంది రైతులు పట్టాదారు ఖాతాలో సవరణలు, పేర్ల మార్పుతో పాటు భూ విస్తీర్ణంకు సంబంధించి తప్పులు సవరణ చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. మండల తహసీల్ కార్యాలయాల చుట్టూ ఏండ్లుగా తిరుగుతున్నా, ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రస్తుతం భూమి కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల సేవలు మాత్రమే జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గతంలో సాదాబైనామాల కింద భూమి కొనుగోలు చేసిన వారున్నారు. అటువంటి వారు ఇప్పటికే  వేలల్లో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అవి పరిష్కారం కాకపోవడంతో ఆ విక్రయదారుని పేరిటనే కొత్త పాస్ పుస్తకాలు, రైతు పెట్టుబడి డబ్బులు జమ అవుతున్నాయి. కొందరు అధికారుల తప్పిదం వల్ల వ్యవసాయ సాగు  భూములు అబాది కింద నమోదయ్యాయి.  అలాగే అసైన్డ్ మెంట్ భూములు ఉన్న వారు ఏదైనా తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల విక్రయాలు చేద్దామంటే కొనేందుకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ నూతన చట్టానికి అనుగుణంగా అసైన్డ్, సీలింగ్, తదితర భూ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

సబ్ ​కమిటీ న్యాయం చేసేనా?

అసైన్డ్ భూ సమస్యల పరిష్కారం కోసం మంత్రి కేటీఆర్ నేతృత్వంలో సబ్ కమిటీ వేసి.. పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు  ప్రక్రియ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆ పని త్వరగా జరిపితే రాష్ట్రంలో ఉన్న అసైన్డ్​దారుల బాధలు తీరుతాయి.  అయితే గ్రామాల్లో అసైన్డ్ భూములు ఉన్న వారు దళితులే ఎక్కువగా ఉంటారు.  వారి నుంచి భూమిని తీసుకోకుండా,  అసైన్డ్ భూమిని పట్టాదారుగా మార్చడానికి  ప్రభుత్వం కొంత నిర్ణీతమైన ఛార్జీలు తీసుకొని అసైన్డ్ ను పట్టాగా మార్చి.. నిరుపేద దళిత రైతులకు, ఇతర అసైన్డ్ భూమి కలిగిన వారిని ఆదుకుంటే బాగుంటుంది. అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించే బిల్లు తెచ్చి, అసైన్డ్​ దారుల భూములకు విలువ పెంచాల్సిన అవసరం ఉంది.  అయితే అసైన్డ్​ భూములను ప్రభుత్వం లాగేసుకుంటున్న సందర్భాలు కూడా కొన్నిచోట్ల ఉండటం బాధాకరం. అలా అసైన్డ్​ భూములను లాగేసుకోవడమంటే దళితుల బతుకులను ఆగం చేస్తున్నట్లే.  దళితుల భూములపై పక్కా హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

సీఎం హామీ అమలు కాలేదు

అసైన్డ్ భూముల చుట్టూ ఉన్న కొన్ని పట్టా భూముల్లో  వెంచర్లను ఏర్పాటు చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఇంట్లో ఏదైనా ఆపద వచ్చి అసైన్డ్ దారులకు భూమి అమ్ముకుందాం అనుకుంటే.. వీలు లేకుండా పోయింది. ఇలాంటి సమస్యలతో అనేక మంది దళితులు ఇబ్బంది పడుతున్నారు.  అసైన్డ్ దారులను కూడా భూ హక్కుదారులను చేస్తామని,  అందరికీ ఒకే రకమైన పట్టాదారులుగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు.

- సంపత్ గడ్డం