ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం టౌన్, వెలుగు: గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్  వీపీ గౌతమ్  ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో భూ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బల్క్  ఇష్యూస్​కు సంబంధించిన భూమి ధరణి పోర్టల్ లో ఏ స్టేటస్ లో ఉందో తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ధరణిలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉందని తెలిపారు. రికార్డుల నిర్వహణ ప్రాధాన్యతను గుర్తించాలని సూచించారు. తాళ్లపెంట, మందాలపాడు, లంకపల్లి, బేతుపల్లి, జమలాపురం గ్రామాల్లో బల్క్  ఇష్యూస్​ ఉండగా, వాటిని పరిష్కరించినట్లు తెలిపారు. మండలాల వారీగా గ్రామాల్లో గుర్తించిన సమస్యల స్టేటస్, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై తహసీల్దార్లకు సూచనలు చేశారు. రెవెన్యూ, అటవీ భూముల సమస్యలు పరిష్కారానికి రెండు శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. సమస్యలు ఉన్న భూముల్లో జాయింట్ సర్వే చేపట్టాలన్నారు. అడిషనల్​ కలెక్టర్​ ఎన్. మధుసూదన్, ట్రైనీ అసిస్టెంట్  కలెక్టర్  రాధిక గుప్తా, డీఎఫ్​వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్, డీసీవో విజయ కుమారి, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ,  సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్  ఏడీ శ్రీనివాసులు, కలెక్టరేట్  ఏవో మదన్ గోపాల్, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్  పాల్గొన్నారు.

భద్రాద్రి రామయ్యకు అభిషేకం

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి బుధవారం బేడా మండపంలో అభిషేకం జరిగింది. ముందుగా అర్చకులు మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య గోదావరికి వెళ్లి తీర్థబిందెను తెచ్చారు. గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. తర్వాత ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి పంచామృతాలతో అభిషేకం చేసి, సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రాకార మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరిపించారు. గన్నవరం భువనేశ్వరీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీ కమలానంద భారతి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఈవో శివాజీ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆయనకు ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. కొత్తగూడేనికి చెందిన మర్రి కావ్య స్వామి నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. 

చెత్త సేకరించిన కలెక్టర్, ఎమ్మెల్యే

ఇల్లందు, వెలుగు: పారిశుధ్య కార్మికుల మాదిరిగా డ్రెస్​ వేసుకొని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రోడ్ల మీద పడ్డ ప్లాస్టిక్ పేపర్లు, టీ కప్పులను సేకరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నెల రోజులుగా మున్సిపాలిటీ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టింది. ఇందులోభాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇప్పటికే మున్సిపల్​ చైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు చెత్త సేకరించే ఆటోకు డ్రైవర్​గా మారి వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్​ ప్రారంభోత్సవానికి వచ్చిన కలెక్టర్, ఎమ్మెల్యేలు పారిశుధ్య కార్మికుల డ్రెస్​లు వేసుకొని పట్టణంలోని రోడ్లపై పడిన చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే ఇల్లందు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచగలుగుతామని తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్​ను వాడవద్దని కోరారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా అందించాలని సూచించారు. మున్సిపల్  కమిషనర్ అంకుషా వలి, తహసీల్దార్​ కృష్ణవేణి, సీఐ రాజు, మున్సిపల్​ కౌన్సిలర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు.

మున్నూరు కాపు చైతన్య యాత్రను సక్సెస్​ చేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్రంలోని మున్నూరుకాపులను చైతన్య పర్చేందుకు ఈ నెల 19న వేములవాడలో నిర్వహించనున్న చైతన్య యాత్రను సక్సెస్​ చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరావు పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ 54 శాతం కలిగిన బీసీ కులాల్లో 23 శాతం ఉన్న మున్నూరుకాపులను రాజకీయంగా, ఉద్యోగ పరంగా చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లలో తమ వాటా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. వేములవాడ నుంచి ప్రారంభమయ్యే చైతన్యయాత్ర 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో కొనసాగుతుందని చెప్పారు. 5 లక్షల మందితో రాజకీయాలకతీతంగా హైదరాబాద్​లో గర్జన సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లవుతున్నా మున్నూరు కాపులకు ఒరిగిందేమీ లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో మున్నూరుకాపు కులస్థులు ఉన్నారని గుర్తు చేశారు. ఒకే కులం, ఒకే సంఘం పేరుతో  గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీలను పూర్తి చేసి మున్నూరుకాపు చైతన్య యాత్రను విజయవంతం చేయాలని సూచించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి దేవేందర్, కేదాస్ నరసయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాపట్ల మురళి, కొత్తా లక్ష్మణ్, మేకల బిక్షమయ్య, మరిశెట్టి వెంకటేశ్వరావు, ఉపాధ్యాయుల సూర్యప్రకాష్ రావు, టౌన్ అధ్యక్షుడు మాడూరి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

జీసీసీ హమాలీల నిరవధిక సమ్మె

భద్రాచలం, వెలుగు: వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ బుధవారం జీసీసీ హమాలీలు నిరవధిక సమ్మెకు దిగారు. ఎగుమతి, దిగుమతి చార్జీలు పెంచుతూ ఆగస్టు నెలలో సివిల్​ సప్లై మంత్రి సమక్షంలో జరిగిన వేతన ఒప్పందాన్ని అమలు చేయకపోవడంతో సమ్మెకు దిగినట్లు చెప్పారు. రూ.10 లక్షల ఇన్సూరెన్స్  సౌకర్యం కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఎంఎల్ఎస్  పాయింట్​ వద్ద మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, టాయిలెట్స్ నిర్మించాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని కోరారు. నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్​ చేశారు. జీసీసీ హమాలీ యూనియన్​ జిల్లా వర్కింగ్​ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, నాగరాజు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ బహిరంగ సభను విజయవంతం​ చేయాలి

వైరా, వెలుగు: ఈ నెల 21న ఖమ్మంలో జరిగే టీడీపీ బహిరంగ సభను సక్సెస్​ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామనాథం, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం ఆపార్టీ ఆఫీసులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  అంతకుముందు పట్టణంలో బైక్​ ర్యాలీ నిర్వహించారు. చెరుకూరి చలపతి, కిలారు సురేందర్, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.     

ఆదివాసీలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

చండ్రుగొండ,వెలుగు: మండలకేంద్రంలోని ప్రభుత్వ భూమిలో అర్హులైన పేద ఆదివాసీలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకా మహేశ్ దొర డిమాండ్ చేశారు. బుధవారం చండ్రుగొండలోని ప్రభుత్వ భూమిలో సంఘం జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని పలువురు గిరిజనేతరులు ఆక్రమించుకొని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని విమర్శించారు. చండ్రుగొండ రికార్డుల్లో 1800 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా క్రీడాస్థలానికి ఎకరం భూమి కేటాయించలేని దుస్థితి నెలకొందని తెలిపారు. అన్యాక్రాంతమైన  ప్రభుత్వ భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్​ కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. తుడుందెబ్బ లీడర్లు కుంజా వెంకటేశ్, కనితి రామారావు, గుర్రం  రవి, పద్దం యశోద పాల్గొన్నారు.