
గన్నేరువరం, వెలుగు: భూ సమస్యల పూర్తి పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ భారతితో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరమవుతాయన్నారు. జిల్లాలో ఏప్రిల్ 17 నుంచి 30 వరకు భూ భారతిపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ధరణి ఉన్నప్పుడు తప్పులు దొర్లిన అంశాలపై భూభారతి ద్వారా అప్పీల్ చేసుకోవచ్చాన్నారు.
ఈ సందర్భంగా తనకు మూడెకరాలు ఉండగా గతంలో వరద సబ్ కెనాల్‌లో 25 గుంటలు పోయిందని, అయితే మిగతా భూములో మరో 25గుంటలు కట్ చేశారని చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన రైతు సుంకరి నరసయ్య కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాడు. తహసీల్దార్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పని కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన కలెక్టర్ సమస్య త్వరలో పరిష్కారమవుతుందన్నారు. సదస్సులో తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏవో కిరణ్మయి, రైతులు పాల్గొన్నారు.
డిజిటల్ తరగతి గదులు ప్రారంభం
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలోని కాశ్మీర్ గడ్డ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌లో గురువారం స్మార్ట్ డిజిటల్ క్లాస్ రూమ్‌లను కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిజిటల్ పాఠాల ద్వారా విద్యార్థులకు త్వరగా అర్థమవుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో స్కూల్ కు కావల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
అనంతరం స్టూడెంట్ల డ్యాన్సులు, జిమ్నాస్టిక్స్, కరాటే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చదువు, ఆటల్లో సత్తాచాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్ రావు, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, హెచ్ఎం హసీనా ఫాతిమా తదితరులుపాల్గొన్నారు.