టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడిపై భూ కబ్జా ఆరోపణలు

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రధాన అనుచరుడు, కోటపల్లి వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావు ఇసుక క్వారీ కోసం తమ పట్టా భూములు లీజుకు తీసుకొని పైసలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలుగుల గ్రామానికి చెందిన పుప్పాల పద్మ, వీరమల్ల వెంకటేశ్ తో పాటు మరికొందరి దగ్గర సర్వే నంబర్ 77, 79 లో 18.36 ఎకరాలను శ్రీనివాస్ రావు 2014 లో లీజుకు తీసుకున్నారు. ఆ భూములను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇసుక తీసుకున్న తర్వాత మళ్లీ పట్టాదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తానని ఒప్పందం చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి లీజు పైసలు ఇవ్వకుండా, గడువు దాటినప్పటికీ భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా తమను తిప్పించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే సుమన్ కు చెప్పాలని చెన్నూరుకు వస్తే... ఆయన కలవడం లేదని అంటున్నారు బాధితులు. పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. ఎవరేం అడిగినా చెప్పొద్దని పోలీసులు బెదిరించారని వాపోతున్నారు. తమ భూమి ఇప్పించాలని... లేదంటే చావే దిక్కని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.