భూ నిర్వాసితుల సరసన కూర్చుని మద్దతు ప్రకటించిన కోదండరామ్
నల్లగొండ జిల్లా: భూ నిర్వాసితుల ఆమరణ దీక్ష 3వ రోజు కొనసాగుతోంది. మర్రిగూడలో చేస్తున్న నిర్వాసితుల దీక్షకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదంరామ్ హాజరై మద్దతు తెలియజేశారు. నిర్వాసితులతో కలసి దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం తమ విలువైన భూముల్ని గుంజుకుని రోడ్డున పడేసిందని చర్లగూడెం, కిష్టరాయనిపల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సరైన నష్టపరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు.
భూ నిర్వాసితులకు మద్దతు తెలిపిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు శంకుస్థాపన రోజున సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదన్నారు. ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని కోదండరామ్ కోరారు. మల్లన్న సాగర్ తరహాలో ఆర్&ఆర్ ప్యాకేజీ ఇంటికి 20 లక్షలు ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు.