- రెవెన్యూ ఆఫీసర్లు, పొలిటికల్ లీడర్ల కుమ్మక్కు
- 244 ఎకరాల పరిహారం కోసం ఫేక్ పట్టాలు
- 312 ఎకరాలు భూమి ఉంటే.. రికార్డుల్లో 450 ఎకరాలు ఎక్కించిన్రు
గద్వాల, వెలుగు: రెవెన్యూ ఆఫీసర్లు, పొలిటికల్ లీడర్లు కుమ్మక్కై గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్ లో భూ దందాకు తెరలేపారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ లో ముంపునకు గురవుతున్న పొలాల్లోని అసైన్డ్ భూములపై కన్నేసి పరిహారాన్ని కాజేసేందుకు ఫేక్ పట్టాలను సృష్టించారనే ఆరోపణలున్నాయి. 312 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉండగా, ఫేక్ పట్టాలతో ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో 450 ఎకరాలుగా ఎక్కించుకున్నారంటే భూ దందా ఏమేరకు నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అసైన్డ్ ల్యాండ్ పరిహారం కొట్టేసేందుకే చిన్నోనిపల్లి రిజర్వాయర్ మిగిలిన పనులు చేపడుతున్నారనే విమర్శలున్నాయి. 244 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ కి పరిహారం కింద రూ. 20 కోట్ల వరకు కొట్టేసేందుకు ఆల్ పార్టీస్ లీడర్లు ఏకమై పైరవీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
17 ఏళ్ల తర్వాత..
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 11వ ప్యాకేజీలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ ని 1.7 టీఎంసీల కెపాసిటీతో నిర్మిస్తున్నారు. 2005లో నోటిఫికేషన్ ఇచ్చి 2006లో భూసేకరణ చేశారు. అందులో భాగంగా గట్టు మండలంలోని చిన్నోనిపల్లి, ఇందువాసి, లింగాపురం, చాగదోన, బోయిలగూడెం గ్రామాల్లోని రైతుల నుంచి 2 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించారు. పట్టా భూములకు అప్పట్లోనే పరిహారం ఇచ్చారు. అసైన్డ్ భూములు 312.95 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. అందులో ఫస్ట్ అవార్డులో 68.40 ఎకరాలకు పరిహారం ఇచ్చారు. ఇంకా 244.5 ఎకరాలకు పరిహారం పెండింగ్ లో ఉంది. వాటికి సంబంధించిన పరిహారం కాజేసేందుకు స్కెచ్ వేస్తున్నారు.
రికార్డుల్లో 450 ఎకరాలు..
సర్వే నెంబర్ 247, 268, 283, 307, 410, 412, 421, 423, 429, 437, 442 సర్వే నంబర్లలో అసైన్డ్ ల్యాండ్ 312.95 ఎకరాలు ఉంది. ఇవే సర్వే నంబర్లపై 450 ఎకరాలకు పైగా భూములు ఉన్నట్లు ఫేక్ పట్టాలతో రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించుకున్నారు. వీరికి రెవెన్యూ ఆఫీసర్లు, పొలిటికల్ లీడర్ల సపోర్ట్ ఉండడంతో ఇప్పుడు పరిహారం కాజేసేందుకు గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. సర్వేనెంబర్ 421లో 90 ఎకరాలు ఉండగా, ఇంకా 68 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. 437 సర్వే నెంబర్లో 170 ఎకరాలు ఉండగా, మరో138 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఈ సర్వే నంబర్ లోనే ఎక్కువగా గూడుపుఠాణి జరుగుతుందని అంటున్నారు.
రూ.20 కోట్ల పరిహారానికి టెండర్..
312 ఎకరాలకు గాను 68 ఎకరాలకు గతంలోనే పరిహారం చెల్లించారు. మిగిలిన 254.55 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. 2006లో ఫస్ట్ అవార్డులో అసైన్డ్ ల్యాండ్ కు రూ.40 వేల పరిహారం అందించారు. ప్రస్తుతం ఎకరాకు రూ.7.80 లక్షల పరిహారం ఇస్తున్నారు. దీంతో లీడర్లు, పైరవీ కారులు, ఆఫీసర్లు కుమ్మక్కై దాదాపు రూ. 20 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. అందులో భాగంగా 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు చిన్నోనిపల్లి రిజర్వాయర్ లో తమ భూములు ఉన్నాయని ఫేక్ పట్టాలు తీసుకొని పరిహారం కోసం దరఖాస్తు పెట్టుకుంటున్నారు. వీరి వెనక ఉండి అధికార పార్టీ లీడర్లతో పాటు ఇతర పార్టీ లీడర్లు వత్తాసు పలుకుతున్నారు. అందరికీ వాటాలు ఉండడంతో ఈ విషయం బయటకు రాకుండా తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.
అసలు పట్టాదారులు ఎవరు?
2006లో భూములు కోల్పోయిన రైతులు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అసైన్డ్ ల్యాండ్ లో కేవలం 68 ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించారు. మిగిలిన వారికి చెల్లించకపోవడంతో బోగస్ పట్టాదారులతో పాటు రైతులు ఎంట్రీ అయ్యారు. రికార్డులను తారుమారు చేసేసి అసలైన రైతులను తప్పించినట్లు ఆరోపణలున్నాయి. వాస్తవంగా సాగులో ఉన్న రైతులకు పరిహారమందని పరిస్థితి ఏర్పడింది. గట్టు మండలం మొదటి నుంచి భూ అక్రమాలకు పెట్టింది పేరుగా ఉంది. అసలైన యజమానులకు తెలియకుండానే రికార్డుల్లో పేర్లు మాయమైపోతున్నాయి. ప్రస్తుతం అసైన్డ్ భూముల పరిస్థితి కూడా అలాగే ఉంది.
పరిహారం ఇవ్వడం లేదు..
చిన్నోనిపల్లి రిజర్వాయర్ లో ప్రస్తుతం ఎవరికీ పరిహారం ఇవ్వడం లేదు. ప్రస్తుతం సిఫ్టింగ్ చార్జీలు మాత్రమే ఇస్తున్నాం. ఫేక్ పట్టాలతో అసైన్ ల్యాండ్ కబ్జాలపై కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకుంటాం.
– రాములు, ఆర్డీవో, గద్వాల