- 80 ఎకరాలకు పైగా నాన్ లోకల్స్ కు కేటాయింపు
- పాస్ బుక్స్ పొందినోళ్లలో లీడర్లు, వ్యాపారుల బినామీలు
- ప్రభుత్వ భూమిని ధరణి లో పట్టాగా మార్చిన ఆఫీసర్లు
- అనర్హుల అకౌంట్లలో రూ. 65.60 లక్షల రైతు బంధు
- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదుతో ఎంక్వైరీ చేయగా వెలుగులోకి వచ్చిన వైనం
“ జగిత్యాలకు చెందిన బడా వ్యాపారి కుటుంబానికి చెందిన ఆర్థికంగా స్థితిమంతులైన నలుగురు వ్యక్తుల పేరిట సర్వే నం. 437లో 17 ఎకరాలు, ఆ వ్యాపారికి చెందిన మరో బినామీ పేరిట మరో 5 ఎకరాలను అక్రమంగా పట్టా చేయించుకున్నారు. మొత్తం 22 ఎకరాల భూమి ఎక్కడ ఉందో సదరు పట్టాదారులకు కూడా తెలియదు. ఆ భూమిపై మాత్రం రైతుబంధు దర్జాగా తీసుకుంటున్నట్లు రెవెన్యూ ఆఫీసర్ల విచారణలో తేలింది.’’
జగిత్యాల ప్రాంతానికి చెందిన ఓ మహిళ పొరుగు జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా పని చేస్తున్నారు. ఉన్నత ఉద్యోగంలో ఉన్న ఆమె కుటుంబం అసైన్డ్ ల్యాండ్ పొందేందుకు అర్హత లేదు. కానీ ఆమె భర్త పేరిట సర్వే నం. 437లో 30 గుంటల భూమిని అక్రమంగా పట్టా చేసుకోవడం వివాదాస్పదంగా మారింది.“ జగిత్యాల కు చెందిన నియోజకవర్గస్థాయి నేత తన ఫ్యామిలీ మెంబర్స్, బినామీల పేరిట సర్వే నం. 437లో సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమిపై లావుణి పట్టాలు పొందారు. ఆ భూములన్నీ 2014కు ముందు వరకు సర్కార్ భూములుగానే నమోదై ఉన్నాయి. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి అసైన్ మెంట్ చేయకపోయినా పహాణిలో పేర్లు నమోదు చేయించుకున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో పట్టాదారు పాస్ బుక్స్ పొందారు. వ్యవసాయ అవసరాలకు వినియోగించాల్సిన సదరు భూమిని.. ఇటుక బట్టీలకు లీజ్ కు ఇచ్చారు. మరోవైపు రైతు బంధు పొందుతున్నారు.’’
జగిత్యాల, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో సర్కార్ భూములను అక్రమంగా పట్టాలు చేయించుకున్న మరో వ్యవహారం జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ లో కొందరు లీడర్లు, వ్యాపారులు రెవెన్యూ ఆఫీసర్లతో కుమ్మక్కై చట్ట విరుద్ధంగా పట్టాలు పొందారు. తమ పేరుతో పాసు బుక్స్ తీసుకుంటే స్థానికులు గుర్తిస్తారని తెలిసి బినామీల పేరిట రాయించుకున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయం లో చేసిన ఈ దందా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదు, రెవెన్యూ ఆఫీసర్ల ఎంక్వైరీతో తాజాగా వెలుగులోకి వచ్చింది. నర్సింగాపూర్ శివారు లోని సర్వే నం. 437లో సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో ప్రధానంగా నాన్ లోకల్స్ కు, అనర్హులకు అసైన్డ్ చేయడం వివాదాస్పదంగా మారింది.
రికార్డుల్లోని 80 ఎకరాలు మాయం
నర్సింగాపూర్ శివారు లోని సర్వే నం. 437 లో మొత్తం 384.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 77 ఎకరాల దాకా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేసింది. 2014 ముందు వరకు 300 ఎకరాలకుపైగా సర్కార్ భూమిగానే రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. కానీ, ప్రస్తుతం ధరణిలో సర్వే నం. 437లో 221 ఎకరాలు మాత్రమే సర్కార్ భూమిగా.. మిగతాది అసైన్డ్ భూమిగా చూపుతోంది. దీన్ని బట్టి చూస్తే గత పదేండ్లలో సుమారు 80 ఎకరాలకుపైగా భూములకు పలువురి పేరిట లావుణి పట్టాలు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ లెక్కన గత సర్కార్ అందజేసిన రైతు బంధు దాదాపు రూ. 65. 60 లక్షలుకు పైగా అనర్హులు పొందినట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ మంది అనర్హులు, నాన్ లోకల్స్ ఉండడంపై స్థానికులు మండిపడుతున్నారు. గ్రామంలో చాలా మంది భూమి లేని నిరుపేదలు ఉంటే.. ఊరు కానోళ్లకు ఎలా భూములు కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల మెడకు అక్రమ పట్టాల ఉచ్చు..
సుమారు 80 ఎకరాల సర్కార్ భూములను అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు ఇతరుల పేరిట పాస్ బుక్స్ జారీ చేయడమేగాక.. నేచర్ ఆఫ్ ల్యాండ్ కాలమ్ లో అసైన్డ్ ల్యాండ్ కు బదులు పట్టా ల్యాండ్ అని నమోదు చేశారు. పట్టాదారు పాస్ బుక్స్ కూడా ఇదే పద్ధతిలో జారీ చేశారు. అప్పటి అధికార పార్టీకి చెందిన కొందరు లీడర్లు, రెవెన్యూ ఆఫీసర్లు కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా పట్టాలు పొందిన వారిలో 50 మంది జగిత్యాలకు చెందినవారిగా గుర్తించినట్లు తెలిసింది. అక్రమంగా పట్టాలు పొందిన వారి నుంచి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని, అలాగే సర్కార్ భూమి ఉన్న మరో సర్వే నం. 251లో జారీ చేసిన పట్టాలపై కూడా ఎంక్వైయిరీ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
నిరుపేదలకు ఇవ్వాలి
నర్సింగాపూర్ లోని అసైన్డ్ భూములను కొందరు అక్రమంగా పట్టాలు చేసుకున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు అనర్హులైనప్పటికీ చట్ట విరుద్ధంగా పట్టాలు చేసుకోవడంతో గ్రామస్తులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆఫీసర్లు స్పందించి పట్టాలు రద్దు చేసి, భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలి.
– గంట వేణు, నర్సింగాపూర్
అక్రమ పట్టాలు రద్దు చేస్తాం
నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ స్థలం సర్వే నం. 437లో దాదాపు 90 మందికి పైగా అక్రమంగా పట్టాలు చేసుకున్నట్లు గుర్తించాం. వాటి రద్దుకు తగు చర్యలు తీసుకుంటా
-శ్రీనివాస్, తహసీల్దార్,
జగిత్యాల రూరల్