సైనిక్ స్కూల్ జాగలో..మట్టి దందా

  • గతంలో స్కూల్ ఏర్పాటు కోసం ఎలుకుర్తి వద్ద 50 ఎకరాల పరిశీలన
  • తాజాగా మరోసారి సీఎం ముందుకు ఫైల్​
  • ఖాళీగా ఉన్న స్థలంపై మట్టి మాఫియా కన్ను
  • రాత్రికి రాత్రే డంపులు.., రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు
  • పట్టించుకోని అధికారులు

హనుమకొండ, వెలుగు : వరంగల్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం గతంలో ప్రతిపాదించిన స్థలంపై మట్టిమాఫియా కన్ను పడింది. ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి శివారులో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేసినా, స్థలం కేటాయింపులో గత సర్కారు నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ స్కూల్ ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. కానీ, ఈలోగా స్థలం ఖాళీగా ఉండటంతో అక్రమార్కులు ఆ జాగపై కన్నేశారు. మట్టిని కొల్లగొట్టి బొందల గడ్డగా మారుస్తున్నారు. రాత్రైతే చాలు జోరుగా దందా నడిపిస్తున్నారు. ఇదంతా తెలిసినా కూడా అధికారులు కూడా లైట్ తీసుకుంటుండడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

స్కూల్ ఏర్పాటుకు మళ్లీ ప్రయత్నాలు..

2016లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సైనిక్ స్కూల్ మంజూరు చేసింది. ఈ మేరకు స్కూల్ ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణ, బిల్డింగ్ నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి సైనిక్ స్కూల్ ను స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలానికి మంజూరు చేయించారు.

ఈ మేరకు మండలంలోని ఎలుకుర్తి శివారు సర్వే నెంబర్ 160 లోని అసైన్డ్ భూములను పరిశీలించారు. ఆ సర్వే నెంబర్ లో మొత్తం 229 ఎకరాల వరకు ఉండగా, అందులో సైనిక్ స్కూల్ కోసం 50 ఎకరాల సేకరణకు కసరత్తు చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో సైనిక్ స్కూల్ అంశం తెరమరుగైంది. స్థలం కేటాయించి, బిల్డింగ్ నిర్మాణం చేపట్టకపోవడంతో వరంగల్ కు మంజూరు చేసిన సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిసి పోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విన్నవించారు.

ఈ ఏడాది జనవరి, జూన్ నెలల్లో కేంద్ర మంత్రిని కలిసి వరంగల్ కు మంజూరైన సైనిక్ స్కూల్ అనుమతులను పునరుద్ధరించాలని కోరారు. లేదా కొత్తగానైనా మళ్లీ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడం, స్టేషన్ ఘన్​ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య కూడా సీఎంకు విన్నవిస్తుండటంతో తొందర్లోనే వరంగల్ కు సైనిక్ స్కూల్ వచ్చే అవకాశం ఉందనే విషయం స్పష్టమవుతోంది.

ఆఫీసర్ల ముందు నుంచే అక్రమ రవాణా..

సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం 50 ఎకరాలు పరిశీలించి పెట్టగా, అందులో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో ఖాళీగానే ఉంటోంది. దీంతో ఆ స్థలంపై మట్టి మాఫియా కన్ను పడింది. కొద్దిరోజులుగా హిటాచీలు, జేసీబీలతో మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. రాత్రయ్యిందంటే చాలు టిప్పర్లతో ఎలుకుర్తి, రింగ్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు.

దీంతోపాటు ధర్మసాగర్ చుట్టుపక్కలా 13 చోట్ల ఇల్లీగల్ మైనింగ్ చేస్తుండగా, ప్రతిరోజు రూ.లక్షల విలువైన మట్టి చుట్టుపక్కల ప్రాంతాలకు తరలుతోంది. ఈ విషయాలన్నీ ఆఫీసర్ల దృష్టిలో ఉన్నా చూసీచూడనట్లు ఉండటం, మైనింగ్ అధికారులు కూడా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సైనిక్ స్కూల్ స్థలాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.