- భూ కబ్జాతో పాటు తమపై దాడి చేశాడని మహిళ ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన గ్రేటర్ వరంగల్ సుబేదారి పోలీసులు
వరంగల్, వెలుగు : బీఆర్‍ఎస్ లీడర్, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై గ్రేటర్ వరంగల్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. భూ కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో పాటు అనుచరులతో దాడి చేసేందుకు యత్నించాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...
రుద్రోజు పద్మావతి అనే మహిళ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు న్యూశాయంపేటలోని వినాయకనగర్ దుర్గాదేవి కాలనీలోని సర్వే నంబర్ 186లో 497 గజాల స్థలం ఉంది. ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకొని రెడీమేడ్ కంటెయినర్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 16న పద్మావతి తన భర్త, కుమారుడితో కలిసి ఆ స్థలం వద్దకు వెళ్లింది. అక్కడ వేరే వ్యక్తులు ఉండడంతో.. ఎవరని ప్రశ్నించింది. ఈ స్థలం, ఇల్లు మాజీ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ది అని, అతడి మాట ప్రకారం ఇక్కడ ఉంటున్నామని దబాయించారు.
అనంతరం పద్మావతి కుటుంబసభ్యులు వచ్చిన విషయాన్ని ఫోన్‌లో శంకర్‌నాయక్‌కు చెప్పారు. దీంతో అజ్మీర వెంకట్‌నాయక్, బానోతు ప్రేమ్‌నాయక్, బానోతు మోహన్‌నాయక్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి పద్మావతి కుటుంబసభ్యులపై దాడికి దిగారు. సెల్‍ఫోన్‌తో పాటు మొత్తం రూ.4.20 లక్షల విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో ప్రాణభయం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సుబేదారి పోలీసులు శంకర్‌నాయక్‌తో పాటు అతడి ముగ్గురు అనుచరులపై కేసు నమోదు చేశారు.