- తిప్పలు పడుతున్న రెండు గ్రామాల ప్రజలు
సూర్యాపేట, వెలుగు: ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య భూ పంచాయితీ రైతులకు శాపంగా మారుతోంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నెమలిపురి, వజినేపల్లి గ్రామాల పరిధిలోని భూములపై రెండు శాఖల మధ్య ఏర్పడ్డ భూ వివాదం ఎంతకూ కొలిక్కిరావడం లేదు. తమకే చెందుతాయని ఇరు శాఖలు వాదిస్తుండడంతో ఏండ్లుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
120 ఎకరాలకు పట్టాలు
చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామంలోని 52 సర్వే నెంబర్‌లో 636 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నెంబర్‌లో 1988లో కుటుంబ నియంత్రణ చేయించుకున్న 40 కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున 120 ఎకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ మేరకు పట్టాలు కూడా ఇచ్చింది. ఇదే మండలం నెమలిపురిలో 316 సర్వే నెంబర్‌లో ఉన్న 1,360 ఎకరాల అగ్రహారం భూములను 1962లో అప్పటి సర్కారు ఫారెస్ట్ శాఖకు కేటాయించింది. సర్వేనెంబర్‌ను కూడా 316 నుంచి 318గా మార్చింది. అయితే రెండు గ్రామాల్లోన్ని సర్వే నెంబర్లు పక్కపక్కనే ఉండటంతో సరిహద్దు వివాదం మొదలైంది.
ఇదీ వివాదం..
నెమలిపురిలోని 318 సర్వేనెంబర్‌లో రికార్డుల్లో చూపిన 1,360 ఎకరాల భూమి క్షేత్రస్థాయిలో లేదు. దీంతో ఫారెస్ట్ అధికారులు వజినేపల్లిలో సర్వే నెంబర్ 52లోని రెవెన్యూ భూములను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో సమస్య మొదలైంది. అప్పటి నుంచి ఈ సర్వే నెంబర్‌లో పట్టాలు పొందిన రైతులను ఈ భూమిలోకి రానివ్వడం లేదు. నెమలిపురిలోని సర్వే నెంబర్ 316లో ఎంత భూమి ఉన్నదో క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండానే అటవీ శాఖకు కేటాయించడంతో ఈ వివాదం వచ్చిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రికార్డుల్లో ఉన్నంత భూమి ఫీల్ట్ లెవల్‌లో లేదని, అటవీ శాఖ అధికారులు రెండు గ్రామాల సరిహద్దులను ఓవర్ లాప్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
2014 తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ల ఎంట్రీ
వజినేపల్లి గ్రామంలోని సర్వే నెంబర్‌లో పట్టాలు పొందిన రైతులు ముందు బాగానే సాగు చేసుకున్నారు. 2014 తర్వాత ఫారెస్ట్ అధికారులు రైతులను అడ్డుకుంటుండడంతో 2018లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 1962లో రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య కుదిరిన ఒప్పదం ప్రకారం సరిహద్దు రాజీనామా చేసుకోవాలని హైకోర్టు సూచించింది.
ALSO READ : ఎన్‌హెచ్‌లపై కనిపించని ట్రామా కేర్ సెంటర్లు
కోర్టు ఆదేశాల ప్రకారం 2020లో రెండుశాఖలు సరిహద్దు రాజీనామా చేసి లాండ్‌సర్వే శాఖ కమిషనర్‌కు రిపోర్టు అందించారు. 2023 జనవరిలో రైతుల భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేసి కొత్త పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలని లాండ్‌సర్వే శాఖ కమిషనర్ ఆదేశించారు. కానీ, ఫారెస్ట్ అధికారులు ముందు తమ భూమి చూపించి ఆన్‌లైన్ చేసుకోవాలని కండిషన్ పెట్టడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
వజినేపల్లిలోని సర్వే నెంబర్ 52లో 1988లో అప్పటి ప్రభుత్వం మా కుటుంబానికి 3 ఎకరాల భూమిని ఇచ్చింది. అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటున్నం. 2014 తర్వాత ఈ భూములు తమవని ఫారెస్ట్ ఆఫీసర్లు అంటున్నరు. మేము హైకోర్టు పోవడంతో సర్వే చేసి రెవెన్యూ భూములుగా గుర్తించారు. కానీ, ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తలేరు. –రాములు నాయక్, వజినేపల్లి
అటవీ భూముల లెక్క తేల్చాలి
మా రికార్డు ప్రకారం 318 సర్వే నెంబర్‌లో 1360 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. దాన్ని చూపించాలని రెవెన్యూ అధికారులను కోరుతున్నం. కానీ, వాళ్లు వాటి లెక్క చూపకుండా వజినేపల్లి సర్వే 52లోకి వచ్చామని, సరిహద్దు ఓవర్ లాప్ అయిందని వాదిస్తున్నారు. ఫారెస్ట్ భూములు లెక్క తేల్చి.. మిగిలిన భూమి తీసుకోవచ్చు.
- సతీశ్, డీఎఫ్‌వో, సూర్యాపేట