- మంచిర్యాలతో పాటు చుట్టుపక్కల అదే తీరు
- ఇండ్లు అమ్ముదామన్నా కొనేవాళ్లు లేరు
- గోదావరి తీరంలోని సాగు భూముల పరిస్థితీ అంతే..
మంచిర్యాల : మంచిర్యాల జిల్లాను ముంచెత్తిన వరదలు రియల్ ఎస్టేట్ బిజినెస్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలిసిన వెంచర్లు ఇటీవలి వరదలకు మునిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్లాట్లు కొనాలంటే జంకుతున్నారు. ముంపు ప్రాంతాల్లోని ఇండ్లను సగం రేటుకు అమ్ముదామన్నా కొనేవారు లేరు. జన్నారం మండలం మొదలుకొని కోటపల్లి మండలం వరకు గోదావరి తీర ప్రాంతంలోని వ్యవసాయ భూముల రేట్లు కూడా పడిపోయాయి. దీంతో రియల్ ఎస్టేట్‌లో రూ. కోట్లు పెట్టిన వ్యాపారులు, ముంపు ప్రాంతాల్లోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
రియల్ బిజినెస్‌కు దెబ్బ...
సింగరేణి కోల్బెల్ట్ఏరియాకు సెంటర్ఆఫ్అట్రాక్షన్గా ఉన్న మంచిర్యాలలో రియల్ఎస్టేట్బిజినెస్ జోరుగా సాగుతోంది. సింగరేణి కార్మికులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు మంచిర్యాలలో భూములు, ఇండ్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. రియల్టర్లు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కోట్లలో పెట్టుబడులు పెట్టి వెంచర్లు చేశారు. గోదావరి తీర ప్రాంతంలో విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఫామ్ ల్యాండ్స్ డెవలప్ చేస్తున్నారు. కానీ మొన్నటి వరదలతో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మంచిర్యాల కాలేజ్ రోడ్డు, వేంపల్లి, ముల్కల్ల, సాయికుంట, సీతారాంపల్లి ఏరియాల్లోని వెంచర్లు నీటమునిగాయి. వరద మూడు కిలోమీటర్ల మేర చుట్టుముట్టింది. మంచిర్యాల, లక్సెట్టిపేట రోడ్ వరకు నీళ్లొచ్చాయి. మంచిర్యాల, అంతర్గాం గోదావరి బ్రిడ్జి శాంక్షన్కావడంతో కాలేజ్‌రోడ్డులోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎంసీహెచ్, మినీ పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు మునిగిపోవడంతో అటువైపు భూములు కొనాలకున్న వాళ్లు ఆలోచనలో పడ్డారు. మరోవైపు రాళ్లవాగు, తోళ్లవాగు, ర్యాలీవాగు బ్యాక్‌వాటర్‌తో వెంచర్లలో వరద నీరు చేరింది. వేంపల్లిలోని మంచిర్యాల ఫంక్షన్‌హాల్, పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు వరద రావడంతో అటువైపు కూడా రేట్లు డౌన్అయ్యే చాన్సుంది. వేంపల్లి నుంచి ముల్కల్ల వరకు, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గోదావరి తీర ప్రాంతాల్లో రియల్ బిజినెస్ దెబ్బతిన్నదని వ్యాపారులు చెప్తున్నారు. పద్మావతి ఫంక్షన్ హాల్వెనకాల గోదావరి ఒడ్డున హైదరాబాద్‌కు చెందిన ఒక బడా రియల్ఎస్టేట్కంపెనీ 200 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం చేపట్టింది. రైతుల నుంచి వంద ఎకరాలకు పైగా కొనుగోలు చేసింది. ప్రీలాంచ్ఆఫర్ కింద ప్లాట్లు బుక్ చేసింది. ఇప్పుడు దానిని రద్దు చేసుకొని మరో మంచి ప్లేస్ కోసం వెతుకుతోంది.
ఆ కాలనీల్లో రేట్లు డౌన్...
జులై 13 నుంచి 16 వరకు గోదావరి, రాళ్లవాగు, తోళ్లవాగు పరిసర ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డు, ఎన్టీఆర్నగర్, రాంనగర్, ఎల్ఐసీ కాలనీ, పద్మశాలీ కాలనీ, మేదరివాడ, గణేశ్ నగర్, ఆదిత్య ఎన్క్లేవ్, అంబేద్కర్‌నగర్, రెడ్డికాలనీ, గౌతమినగర్, రాళ్లపేట్, బృందావన కాలనీ, సాయికుంట, పాత మంచిర్యాల, నస్పూర్‌లోని వినూత్న కాలనీ తదితర ఏరియాలు మునిగాయి. వేంపల్లి, ముల్కల్ల గ్రామాల్లో సైతం వరద చేరింది. బోట్లతో తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. నాలుగు రోజులు నీట మునిగి ఉండడంతో వందల ఇండ్లు దెబ్బతిన్నాయి. ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. రాంనగర్, ఆదిత్య ఎన్క్లేవ్ కాలనీల్లోని అపార్ట్మెంట్లు, డూప్లెక్స్లకు రూ.లక్షల్లో నష్టం జరిగింది. ప్రజలు ఇప్పటికీ ముంపు ప్రభావం నుంచి తేరుకోలేదు. జులైలోనే ఈ పరిస్థితి ఉంటే ఆగస్టు, సెప్టెంబర్లను తల్చుకుంటూ వణికిపోతున్నారు. కిరాయిదారులు ఇండ్లను ఖాళీ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్‌తో ఏటా పెద్ద ఎత్తున వరదలు వచ్చే చాన్స్ ఉండడంతో చాలా మంది ఇతర ప్రాంతాల వైపు చూస్తున్నారు. వరదలకు ముందు ఈ ఏరియాల్లో గజం రూ.20 వేలు పలికింది. ఇండిపెండెంట్ఇండ్లకు రూ.50 నుంచి రూ.60 లక్షలు, డూప్లెక్స్లకు రూ.70 నుంచి రూ.80 లక్షలు ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. ఓపెన్‌ప్లాట్లు కొనేవారు ముంపు లేకుండా చూసుకుంటున్నారు. ఇండ్లను సగం రేటుకు అమ్ముదామన్నా కొనేవాళ్లు కరువయ్యారు. ఒక్కసారి వరదలో మునిగితే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల నష్టం జరగనుండడంతో ఆ ఏరియాల్లో భూములకు, ఇండ్లకు డిమాండ్పడిపోయింది.
వ్యవసాయ భూములు సైతం
గోదావరికి వరద పోటెత్తడంతో ఎటూ మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయ భూములు మునిగిపోయాయి. జన్నారం మొదలుకొని దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్, నస్పూర్, జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలం వరకు గోదావరి తీర ప్రాంతంలో వేలాది ఎకరాలు దెబ్బతిన్నాయి. వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేయడం, అండు పోయడంతో పాటు పెద్ద ఎత్తున భూములు కోతకు గురయ్యాయి. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కుప్పకూలగా, మోటార్లు కొట్టుకుపోయాయి. రైతులు కోలుకోలేనంతగా నష్టపోయారు. కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌తో జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని సుమారు 40 గ్రామాల్లో వ్యవసాయ భూములకు ఏటా వరద ముప్పు పొంచి ఉండడంతో రైతులు బోరుమంటున్నారు. ఎకరం రూ.10 నుంచి రూ.15 లక్షలు పలికే భూములకు ఇప్పుడు రేట్లు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.