- పెద్దలైతే భూమికి భూమి
- అధికారుల తీరుపై రైతుల్లో ఆగ్రహం
- ప్రత్యేక జీవో విడుదల చేసిన ప్రభుత్వం
- మద్దులపల్లిలో అధికారుల తీరుపై పలు అనుమానాలు
- పెద్దలపై ప్రేమతోటేనంటున్న బాధితులు
ఖమ్మం/ ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం భూ సేకరణ, పరిహారం విషయంలో రెవెన్యూ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణంగా భూముల రేట్లు భారీగా పెరిగాయి. మార్కెట్లో ఎకరానికి కోటిన్నర వరకు రేటు పలికే భూములను కూడా సేకరించి, పాతిక లక్షల్లోపే పరిహారం చెల్లిస్తున్నారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్ల విస్తరణ, కాల్వల నిర్మాణం, సింగరేణి గనుల విస్తరణ కోసం ఖమ్మం జిల్లాలో 5 వేల ఎకరాలకు పైగా భూములు సేకరించారు. వీటికి ఎకరాకు అత్యధికంగా రూ.25 లక్షల వరకు రైతులకు పరిహారంగా ఇచ్చారు. ఖమ్మం కొత్త కలెక్టరేట్ నిర్మాణం కోసం సేకరించిన పాతిక ఎకరాల భూములకు మాత్రం రూ.కోటి చొప్పున రేటు కట్టి చెల్లించారు. అయితే ఇప్పుడు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కోసం సేకరించిన భూములకు బదులుగా భూమిని ఇస్తుండడంపై అక్కడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే హైవే కోసం భూమి ఇచ్చిన రైతులు మాత్రం తమకు కూడా భూమికి బదులుగా భూమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
హైవే బాధితులకు మాత్రం పరిహారమే..
మద్దులపల్లి రెవెన్యూ పరిధిలోనే ఖమ్మం– దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం 10 మంది రైతుల నుంచి దాదాపు 12 ఎకరాల భూమిని ప్రభుత్వం గతేడాది సేకరించింది. ప్రైవేట్ గా మార్కెట్ రేటు రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు ఉండగా, రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. కానీ ఇప్పుడు మాత్రం భూములకు బదులుగా భూమి ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏందన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ భూములిచ్చిన వారిలో కొంతమందికి రాజకీయ పలుకుబడి ఉండడం వల్ల భూములు ఇవ్వాలన్న జీవో రిలీజ్ అయినట్లు చెప్తున్నారు. భూమి కోల్పోయిన వారిలో కొందరికి రాజకీయంగా ఉన్న పలుకుబడితోనే ప్రత్యేక జీవో వచ్చిందన్న ప్రచారం ఉంది. పెద్దల భూములపై ప్రత్యేక ప్రేమ చూపించిన ఉన్నతాధికారులు, పేదల భూములను మాత్రం బలవంతంగా లాక్కుంటారా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ భూమి అప్పగిస్తూ జీవో..
మద్దులపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 86,87,88,89 లో కొత్తగా వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణం, అప్రోచ్ రోడ్డు కోసం రైతుల నుంచి 10.23½ ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. మద్దులపల్లికి చెందిన తేలపూడి సుశీల, ఖమ్మం నగరానికి చెందిన డాక్టర్ పెరుమాళ్ల శ్యాంసుందర్ రావు, గోలి విజయలక్ష్మి, అంగడాల రామయ్య, అంగడాల వెంకయ్య, అంగడాల పెద్దమల్లయ్య, చిన్నమల్లయ్య, అంగడాల కోటయ్య, మారుతి వీరస్వామి, బుద్ది సరస్వతి, కందుల చంద్రయ్య (లేట్)కు చెందిన 10.23 ½ ఎరకారాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. వీరికి ప్రభుత్వ అసైన్మెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ 90,96 లో భూమిని కేటాయించారు. దీని కోసం ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక జీవో(జీవో ఎంఎస్ నెంబర్ 136)ను ఈనెల 1న రిలీజ్ చేసింది. రెండ్రోజుల క్రితం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి, రైతులకు కేటాయించిన భూమికి హద్దులు ఫిక్స్ చేశారు. ఇక సంబంధిత రైతులకు రిజిస్ట్రేషన్ చేసి భూమి అప్పగించడమే మిగిలింది.
మాకు భూమి కింద భూమి కావాలి
మద్దులపల్లి మార్కెట్ కింద భూములు ఇస్తున్న రైతులకు భూమి కింద భూమి ఇస్తున్నారు. అక్కడి రైతులు ధనవంతులు కాబట్టే వారికి భూములు ఇస్తున్నారు. మేం దేవరపల్లి రహదారికి భూములు ఇచ్చి రోడ్డున పడ్డాం. మాకు కూడా భూమి కింద భూమి కావాలి. పేద రైతులం కాబట్టే భూములను తక్కువ ధరకు లాక్కున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో కొద్ది రోజులు గడువు ఇవ్వమన్నా కాంట్రాక్టర్ ఒప్పుకోవడం లేదు. ఇచ్చిన పరిహారం వెనక్కి ఇస్తాం. మాకు కూడా భూమి కింద భూమి ఇవ్వాలి.
- ఏటుకూరి సుధాకర్ రావు,
రైతు, మద్దులపల్లి