తెలంగాణాలో సర్కారు భూమి ఎక్కువగానే ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా ప్రభుత్వ భూమి ఉంది. అయితే, మొత్తం 2.76 కోట్ల ఎకరాల తెలంగాణా భూభాగంలో ప్రభుత్వ భూమి ఎంత? అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. తెలంగాణలో 1.06 కోట్ల ఎకరాలు వ్యవసాయం కాగా, 61.77 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. ఇంకొక 34.59 లక్షల ఎకరాల పడావు భూమిగా, 22.23 లక్షల ఎకరాలు వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారు.
ఇందులో గుట్టలు, చెరువులు, వాగులు, నదుల భూభాగంపై కూడా అంచనా లేదు. కంప్యూటరీకరణ చేసిన భూమి విస్తీర్ణం మీద కూడా వివరాలు లేవు. గత 30 ఏండ్ల కాలంలో భూమి రికార్డుల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారు అయ్యింది. ఒకప్పుడు గ్రామాలవారీగా నమోదు చేసే రికార్డులు ఇప్పుడు కనిపిస్తలేవు. భూమి కోసం పోరాటాలు జరిగిన తెలంగాణా భూమిలో ఇంత అస్తవ్యస్తంగా భూమి యాజమాన్యం ఎట్లా తయారు అయ్యింది? తెలంగాణా గ్రామీణులు అమాయకులు కనుక వారి నుంచి క్రమంగా భూమి అనేక రూపాలలో బదిలీ అవుతున్నది. భూమి కొందరి చేతులలోకి చేరుతున్నది. రాజకీయ నాయకుల ఆర్జన, ఆస్తులు అన్నీ భూముల చుట్టే. భూమి ధరలుపెరిగిన కొలదీ సమస్య జటిలం అవుతున్నది.
రికార్డుల్లో భూములు మాయం
అభివృద్ధి పేరు మీద భూసేకరణ నిరంతరం ఒక వైపు జరుగుతుంటే, ఇంకొక వైపు రికార్డులలో భూములు మాయం అవుతున్నాయి. ప్రజలు గ్రామస్థాయిలో నిర్వహించుకునే వ్యవస్థ కంప్యూటర్లలోకి చేరింది. 2013 నాటికే 10,829 గ్రామాలలో 1,32,80,649 రికార్డులు కంప్యూటరీకరణ అయిపోయినట్టు ప్రభుత్వ నివేదిక చెబుతున్నది. తరువాత ధరణి వచ్చింది. దాని ద్వారా భూ రికార్డులు ప్రక్షాళన చేసి, కొత్త పాస్ బుక్లు కూడా ఇచ్చారు.
ఇవన్నింటి నడుమ గుట్టలు, చెరువులు, నాలాలు ప్రైవేటుపాలు అయినాయి. పెట్టుబడులకు అనుగుణంగా భూమిని, భూమి యాజమాన్య నియంత్రణ వ్యవస్థను మారుస్తున్న ప్రభుత్వం, ఇంకొకవైపు భూమి బదలాయింపు ప్రక్రియలు కూడా కొనసాగిస్తున్నది. తాము నిర్ణయించిన అభివృద్ధికి భూమి కావలసి వస్తుంది కనుక రకరకాల వాదనలతో, చట్టాలతో భూమి యాజమాన్యాలను మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా నడుం బిగించాయి.
మౌలిక సదుపాయాల కల్పన (infrastructure development), పరిశ్రమల అభివృద్ధి (industrial development), పట్టణాల అభివృద్ధి (urban development) కోసం భూమిని తీసుకుంటున్నారు. వ్యతిరేకిస్తే చట్టాలు తెస్తున్నారు. మౌలిక సదుపాయాలలో సాగునీటి ప్రాజెక్టులు, కొత్త రోడ్లు, ఉన్న రోడ్ల విస్తరణ, నీళ్ళు, గ్యాస్ ఇంకా ఇతర
పైప్‌లైన్‌లు, హైటెన్షన్ విద్యుత్ టవర్లు వంటివి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సౌర శక్తి కేంద్రాలు, పవన విద్యుత్ కేంద్రాలు కూడా ఇందులోకి వచ్చాయి.
భూ రికార్డుల ప్రక్షాళన అవసరం
భూసేకరణలో ప్రభుత్వ అధికారుల మొదటి లక్ష్యం అసైన్డ్ భూములు. దీనికి కారణం పరిహారం ఖర్చులను తగ్గించడం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా ఇదే పరిస్థితి. హైదరాబాద్ రాజధాని ప్రాంతంలో 1990 దశకంలో మూడు ప్రాంతాలలో అటవీ సంరక్షణ కేంద్రాలను గుర్తించింది అప్పటి ప్రభుత్వం – జూబ్లీహిల్స్లో కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు, వనస్థలిపురంలో హరిణ వనస్థలి పార్క్, చిల్కూర్ దగ్గర మృగవని పార్కు.
ఈ మూడు అటవీ సంరక్షణ కేంద్రాలు. కేంద్ర వన్యప్రాణి చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడడానికి ఇది గట్టి చట్టం. అయినా కూడా ఆ భూముల మీద సర్కారుకు పూర్తి ఆధిపత్యం లేదు. మృగవని పార్కు లోపల నుంచి, దానిని విభజిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు వచ్చింది. అంతే, ఆ రోడ్డుకి ఇటుపక్క, అటుపక్క కబ్జాలు, నిర్మాణాలు వచ్చినాయి. అసలు అటవీ శాఖ ఈ మూడు పార్కుల భూమి మీద సర్వే చేయలేదు. ఎంత భూమి ఎవరు తీసుకున్నారు అని లెక్క లేదు. వాటి సంరక్షణ కూడా పట్టడం లేదు. అటవీ భూముల మీద ఆ శాఖ దగ్గర సమాచారం లేదు.
వీటికి సంబంధించిన రికార్డులు ధరణిలో కంప్యూటరీకరణ అయినట్లు లేదు. ఉంటే అటవీ శాఖ సమాచారం ఇచ్చి ఉండేది. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య 5 లక్షల ఎకరాల వివాదం ఉందని వార్తలు వచ్చాయి. అటవీ శాఖ తన భూమిగా పేర్కొంటున్న 3.6 లక్షల ఎకరాల భూమి, రెవెన్యూ రికార్డులకు భిన్నంగా ఉందని వార్త వచ్చింది. ఇందులో 3.43 లక్షల ఎకరాలు అటవీ భూమి చూపెట్టడం లేదు. ఈ వివాదం పరిష్కారానికి భూ రికార్డుల ప్రక్షాళన అవసరం. 4,567 గ్రామాలతో ముడిపడిన మొత్తం అటవీ భూమి విస్తీర్ణం 67 లక్షల ఎకరాలు. ఇందులో 50 శాతం భూముల విషయంలో స్పష్టత వచ్చినా, సర్వే చేసిన భూమిలో 15 శాతం (4.95 లక్షల ఎకరాలు) వివాదంలో ఉంది. అందులో 70 శాతం వివాదం రెవెన్యూ శాఖతోనే ఉన్నది.
కాగా, క్షేత్ర స్థాయిలో భూములు, వాటి వినియోగం గురించిన సమాచారం లేదు. ప్రభుత్వ భూమి అమ్మకాలు, కొనుగోలు వీలుకాకుండా సెక్షన్ 22 A కింద చేర్చారు. పరిస్థితి చక్కదిద్దాలంటే ప్రభుత్వ భూముల సర్వే జరగాలి. ప్రభుత్వ భూముల రికార్డుల ప్రక్షాళన జరగాలి. ప్రభుత్వ భూమి లీజుల చిట్టా బయటపెట్టాలి. ప్రభుత్వం ఎవరికి ఎంత భూమి కేటాయించిందో ఒక నివేదిక తయారుచేయాలి. శాసనసభలో ఈ నివేదిక మీద చర్చ చెయ్యాలి. గుట్టలకు సర్వే నంబర్లు వచ్చిన వైనం మీద విచారణ జరపాలి.
ఆదాయానికి, అప్పులు తీర్చడానికి భూముల అమ్మకం
పరిశ్రమల కోసం పారిశ్రామికవాడలకు (రకరకాల పేర్లు పెట్టి), పారిశ్రామిక కారిడార్లు వగైరా ప్రాజెక్టులతో పాటు అదనంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, ఒక్కొక్క పరిశ్రమకు వందల ఎకరాలు భూమి సేకరణ జరుగుతున్నది. పట్టణాలను విస్తరిస్తూ మాస్టర్ ప్లాన్లు, ల్యాండ్ పూలింగ్, అనేక ఇతర ‘రియల్’ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం భూసేకరణ కూడా ఆనవాయితీలో ఉంది. తెలంగాణా ప్రభుత్వం ఆదాయం కోసం, అప్పులు తీర్చడానికి భూములు అమ్ముకుంటున్నది.
ప్రభుత్వమే అమ్మడం వల్ల వేల ఎకరాల భూములు ప్రైవేటు అయినాయి. అదనంగా, తెలంగాణాలో, ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టుపక్కల వందల ఎకరాలు కబ్జా ద్వారా ప్రైవేటుపరం అయిపోయినాయి. రికార్డుల నిర్వహణలో మాయాజాలం వల్లనే ఇది సాధ్యం అయ్యింది. ఇంకా ఎన్ని ఎకరాలు పోతాయో తెలవదు. అమ్ముకుంటే కనీసం బడ్జెట్ కు నిధులు సమకూరుతాయి. కబ్జాల వల్ల భూమి అన్యాక్రాంతం తప్పితే ఏమీ రాదు, భూమి రికార్డుల ప్రక్షాళన ద్వారా టైటిల్ గ్యారెంటీ అని వాగ్దానం చేస్తున్న ప్రభుత్వం తన భూమి ఎక్కడుందో, దాని పరిస్థితి ఏందో తెలుసుకుంటలేదు. ఈ నిర్వహణ బాగు చేసుకోకుండా కొత్తగా భూసేకరణ నిరంతరం చేస్తున్నది. కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టడం లాంటి పని ప్రజాస్వామ్య ప్రభుత్వం చేయడం తగదు.
లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణా పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థకు (TGIIC) వేల ఎకరాల భూములు ఉన్నాయి. కానీ, ఎక్కడ ఎంత మేరకు ఉన్నాయి అని ఇప్పటివరకు వాటిమీద ఆడిట్ చేయలేదు. కాకపోతే, ఒక పెట్టుబడిదారుడు వచ్చి పరిశ్రమ పెడతా అనగానే భూమి సేకరించి ఇచ్చే అలవాటు ఈ సంస్థకు ఉన్నది. ఇదివరకు, ఒక సంస్థ అడిగితే దానికి కావాల్సిన భూమి ఇచ్చేవారు. ఇప్పుడు ఒక సంస్థ అడిగితే ఏకంగా ఒక పారిశ్రామిక ప్రాంతం పేరుబెట్టి ఇస్తున్నారు.
అట్లా అడిగింది ఒక సంస్థ అయితే హార్డ్వేర్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, ఆటోమేటివ్ సిటీ అంటూ వేల ఎకరాలు సేకరించడం ఈ సంస్థకు అలవాటు. ఇప్పటికే ఈ సంస్థకు 2.5 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఉందని ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం ఇదివరకే జిల్లాల వారీగా భూములు బలవంతంగా, భయపెట్టి, మభ్యపెట్టి సేకరణ అయ్యింది.
ఈ సంస్థ పనితీరు మీద ఇప్పటివరకు శాసనసభలో చర్చ కూడా జరగలేదు. ఈ సంస్థ చేపట్టిన చాలా సులభమయిన కొత్త భూసేకరణ పద్ధతి.. కావాల్సిన భూములను గుర్తించడం, వాటిని తన పేరు మీద ధరణి పోర్టల్ బదలాయింపు చేసుకోవడం. ఇక భూసేకరణకు వచ్చిన 2013 కేంద్ర చట్టం, 2017 రాష్ట్ర చట్టం, అందులో విశదీకరించిన పద్ధతులు ఏవీ ఈ సంస్థకు పట్టవు.
- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్