కొత్త రూల్స్ తో రిజిస్ట్రేషన్లు ఢమాల్

బోసిపోతున్న ఆఫీసులు

హైదరాబాద్, వెలుగు: అనధికార లేఔట్లు, కట్టడాల రిజిస్ట్రేషన్లను బ్యాన్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ జారీ చేసిన సర్య్కులర్ తో గురువారం జరగాల్సిన రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్త మారద్గర్శకాల నేపథ్యంలో డీటీసీపీ, హెచ్ఎండీఏ అప్రూవల్లేని లేఔట్లలోని ప్లాట్లతో పాటు మున్సిపాల్టీ, పంచాయతీల్లో ప్లాన్ కు విరుద్ధంగా నిర్మించిన బిల్డింగ్స్, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లు నిలిపివేశారు. గురువారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 2,427 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా 9.25 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణ రోజుల్లో ఐదు వేలకుపైగా డాక్యుమెంట్లు రిజిస్టర్ అయితే రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల ఆదాయం వచ్చేదని సబ్ రిజిస్ట్రార్లు వెల్లడించారు.

రీసేల్ ఎలా ?
హైదరాబాద్, వరంగల్ , ఖమ్మం, కరీంనగర్, నిజమాబాద్ సిటీలే కాక చిన్నచిన్న టౌన్ లు, హైవేల వెంట ఉన్న గ్రామాల వరకు అనధికార లేఔట్లు, నిర్మాణాలు వేలాదిగా ఉన్నాయి. ఉదాహరణకు అన్ని రకాల చార్జీలు చెల్లించి అనుమతులు తీసుకుని పక్కాగా రోడ్లు, డ్రైనేజీ, ఇతర సౌకర్యాలు కల్పించి డెవలప్ చేసిన అప్రూవల్ లేఔట్లలో గజం స్థలం రూ.15 వేలకు అమ్మితే.. దాని పక్కనే ఉన్న భూమిని మరికొందరు రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్ లుగా చేసి గజం రూ.7 వేలకే అమ్ముతున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు లేఔట్ప్ ప్లాట్లను కొనుగోలు చేయలేక.. దాని పక్కనే ఉన్న నాన్ లేఔట్ ప్లాట్ల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. తాజా నిబంధనలతో వీటిని రీసేల్ చేయడానికి వీల్లేకుండా పోయింది. దీంతో ప్లాట్ల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ నిబంధనలతో ఇక మీదట ప్రజలు లేఔట్ లేని వెంచర్లలో ప్లాట్ లు కొనుగోలు చేయరని, దీర్ఘకాలికంగా ఈ విధానం మేలు చేస్తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు.

కొత్త స్కీమ్ తో ఖజానా నింపే యోచన
అనధికార లేఅవుట్లు, కట్టడాల రిజిస్ట్రేషన్లను బ్యాన్ చేస్తూ గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం.. వీటి రెగ్యులరైజేషన్ కోసం మరోసారి లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్ఆర్ఎస్), బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (బీఆర్ఎస్) తరహాలో కొత్త స్కీమ్ను ప్రకటించాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇన్నాళ్లు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లేకున్నా ప్లాట్ లు, ఇళ్లను రిజిస్ట్రేషన్ చేస్తుండేవారు. దీంతో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ను చాలా మంది అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇలా అక్రమ లేఔట్లను, నిర్మాణాలను కట్టడి చేయడం కష్టమని భావించిన సర్కారు రిజిస్ట్రేషన్ల దగ్గరే చెక్ పెట్టి రెగ్యురైజేషన్ ను తప్పనిసరి అనే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇదే అదనుగా ప్రభుత్వం 2015లో ప్రకటించినట్లే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్
లా త్వరలో కొత్త స్కీమ్ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలోనే 5 లక్షల నుంచి 6 లక్షల అప్లికేషన్లు, వేరే నగరాల్లో మరో 2 లక్షల వరకు వస్తాయని అంచనావేస్తోంది. రూ.20 వేల అప్లికేషన్ ఫీజుతో పాటు 20% పెనాల్టీ వసూలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

For More News..

ఇక నుంచి మండలాల్లోనే రిజిస్ట్రేషన్లు

నోరు తెరవని కీసన ఎమ్మార్వో నాగరాజు

లంచం కేసు.. లైట్ బాస్!