ఇక నుంచి మండలాల్లోనే రిజిస్ట్రేషన్లు

ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా తహసీల్దార్లు
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అధికారాలూ వీళ్లకే
రెడీ అవుతున్నకొత్త రెవెన్యూ కోడ్‌
నేడు రెవెన్యూ సంఘాలతో సీఎం సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త రెవెన్యూ కోడ్‌తో భూ లావాదేవీల స్వరూపమే మారబోతున్నది. డివిజన్ స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరిగే రిజిస్ట్రేషన్లు ఇక మండల స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అధికారాలను తహసీల్దార్లకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. తహసీల్దార్లను మండల్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (ఎంఎల్‌ఏఓ)గా వ్యవహరించేలా చట్టంలో మార్పులు చేయబోతున్నట్లు సమాచారం.

కొత్త యాక్ట్‌కు ఫినిషింగ్‌ టచ్‌
రాష్ట్రంలో రెండేళ్లుగా చర్చనీయాంశంగా మారిన కొత్త రెవెన్యూ కోడ్‌కు నల్సార్ న్యాయ నిపుణులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల బృందం తుది మెరుగులు దిద్దుతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ కోడ్‌బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నందున కసరత్తును వేగవంతం చేసింది. భూముల మ్యుటేషన్, పాస్‌బుక్‌ల జారీని సులభతరం చేయడం, ఆర్డీవోలు, తహసీల్దార్ల అధికార పరిధిని నిర్ణయించడం, ఇతర శాఖల్లోకి వీఆర్వోలు, వీఆర్‌ఏల సర్దుబాటుపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిసింది. బ్రిటిష్ కాలంనాటి రెవెన్యూ శాఖకు కొత్త నిర్వచనం ఇవ్వాలని, పాత అవలక్షణాలు కనిపించకుండా కొత్త రెవెన్యూ కోడ్‌ రూపొందించాలని సీఎంకేసీఆర్ సూచించినట్లు తెలిసింది.

100 చట్టాలకు స్వస్తి
ఇప్పటివరకు 122 రెవెన్యూ చట్టాలు అమలులో ఉన్నాయి. ఇందులో కాలం చెల్లిన సుమారు 100 చట్టాలను రద్దుచేయడంతో పాటు అవసర 22 చట్టాలతో కొత్త రెవెన్యూ కోడ్ ను సిద్ధం చేస్తున్నారు. పాత చట్టాల్లోని అవసరమైన కొన్ని రూల్స్‌ను ఇందులో చేర్చొచ్చని ఓ రెవెన్యూ అధికారి వెల్లడించారు.

మ్యుటేషన్‌ రోజేపాస్‌ బుక్
ఆర్వోఆర్ యాక్ట్ ప్రకారం భూముల మ్యుటేషన్ గడువు 90 రోజులుండేది. భూ రికార్డుల ప్రక్షాళన టైమ్‌లో నోటీసు పీరియడ్‌ను 15 రోజులకు తగ్గిస్తూ ప్రభుత్వం చట్టసవరణ చేసింది. అయితే రికార్డుల అప్‌డేషన్‌, కంప్యూటరీకరణతో రూపొందించిన డేటాబేస్‌ ఆధారంగా మ్యుటేషన్ ప్రాసెస్‌ ఇక నిమిషాల్లో పూర్తయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మ్యుటేషన్ జరిగిన రోజే పాస్‌ బుక్ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా రెవెన్యూ చట్టంలోనూ మార్పులు చేస్తున్నారు. ఇతరశాఖల్లో వీఆర్వోలు, వీఆర్‌ఏల సర్దుబాటు భూరికార్డుల్లో కాస్తుదారు కాలమ్ను ఇప్పటికే తీసేశారు. వీఆర్వోలు ఈ బాధ్యతలు చూసేవారు. భూ రికార్డుల నిర్వహణ నుంచి వీరిని తప్పించాలనుకుంటున్న ప్రభుత్వం వీరితోపాటు వీఆర్‌ఏలను పంచాయతీరాజ్, మున్సిపల్, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లలో సర్దుబాటు చేయనున్నట్లు తెలిసింది.

నేడు రెవెన్యూ సంఘాలతో సీఎం భేటీ
కొత్త రెవెన్యూ కోడ్‌తో ఆ శాఖలో రానున్న మార్పులు, ఉద్యోగుల సర్దుబాటుపై చర్చించేందుకు రెవెన్యూ సంఘాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ శుక్రవారం సాయంత్రం భేటీ కానున్నట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన, అవినీతి నిర్మూలన, ఉద్యోగుల జాబ్ చార్ట్ తదితరాలపై చర్చించనున్నట్లు సమాచారం.

For More News..

నోరు తెరవని కీసన ఎమ్మార్వో నాగరాజు

లంచం కేసు.. లైట్ బాస్!

కాళేశ్వరం నీళ్లెక్కడ?