కంప్యూటర్ ఆపరేటర్ సహా ఏడుగురిపై క్రిమినల్ కేసు
మహబూబ్‌నగర్, వెలుగు: 23 సంవత్సరాల క్రితం ఆ భూమిని అమ్మేశారు. కానీ ఇటీవల కొత్తగా ప్రారంభించిన ధరణి పోర్టల్‌లో మాత్రం పాత ఓనర్పేరు రావడంతో ఇదే అవకాశంగా కొందరు అక్రమాలకు తెర లేపారు. అమ్మిన భూమినే మరోసారి అమ్మేశారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలుగు చూసింది. నారాయణపేట జిల్లా మక్తల్పట్టణంలోని సర్వే నం. 240ఎ లో 4–05 ఎకరాల స్థలాన్ని 1997 నవంబర్‌లో ఉమాబాయి అగర్వాల్భర్త రవీందర్కుమార్అప్పటి మార్కెట్‌వాల్యూ ప్రకారం ఉప్పరి వెంకన్న తండ్రి లింగన్న నుంచి కొనుగోలు చేశారు. 1998 ఫిబ్రవరిలో భూమి బదలాయింపులను ఆర్ఓఆర్లో ఎక్కించారు. అయితే పహాణిలో మాత్రం రెవెన్యూ అధికారులు ఎక్కించలేదు. భూమిని కొనుగోలు చేసిన ఉమాబాయి ఈ స్థలంలో సూర్యజ్యోతి కాటన్‌మిల్లు నిర్మించారు. నాలుగేళ్ల క్రితం దీన్ని మూసేశారు.
రికార్డుల్లో వెంకన్న పేరు
240ఎ సర్వే నంబర్లో కొంత భూమిని మక్తల్‌కు చెందిన ఆశిరెడ్డి అనే ఓ పార్టీ నేత తన భార్య పేరుపై కొనుగోలు చేశారు. ఆయన కొన్న భూమిలో భీమా కాలువ వెళ్లడంతో పరిహారం సైతం అందుకున్నారు. 2016లో ప్రభుత్వం భూ ప్రక్షాళన చేపట్టిన సమయంలో 97లో అమ్మిన భూమి ఇంకా ఆన్లైన్లో పాత ఓనర్పేరుతోనే ఉన్నట్లు తెలిసింది. ఉప్పరి వెంకన్నకు పాసుబుక్కులు సైతం వచ్చాయి. ఈ భూమి గురించి అన్ని తెలిసిన ఆశిరెడ్డితోపాటు మరికొందరు నేతలు లక్ష్మారెడ్డి, నీలప్ప కలిసి దేవరింటి నర్సింహారెడ్డి అనే మరో నాయకుడికి అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేయించారు. ధరణి పోర్టల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మక్తల్ తహసీల్దార్ ఆఫీస్‌లో భూముల వివరాలను నమోదు చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ నరేందర్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడు. దళారులు, నేతలతో కుమ్మక్కయిన ఆపరేటర్.. గత నెల 17న ధరణి పోర్టల్‌లో 5–17 ఎకరాలు అమ్మినట్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు.
బెడిసికొట్టిన ప్లాన్
భూమి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కాటన్‌మిల్లు యజమానులతో బేరమాడేందుకు సదరు నేతలు వేసిన ప్లాన్రివర్స్అయింది. భూమిలో తమకూ వాటా ఉందని.. రాజీ కుదుర్చుకునేలా అసలు యజమానులను ఒప్పించాలని అనుకున్నారు. అయితే భూ హక్కుదారు ఉమాదేవి అగర్వాల్అక్రమ రిజిస్ట్రేషన్‌పై నారాయణపేట జిల్లా కలెక్టర్హరిచందనకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. నారాయణపేట ఆర్డీవో శ్రీనివాస్ విచారణ జరిపి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలంటూ నవంబర్27న తహసీల్దార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారి కంప్యూటర్ఆపరేటర్ నరేందర్‌ను ఔట్సోర్సింగ్నుంచి డిస్మిస్చేయాలని కలెక్టర్ఆదేశాలిచ్చారు. తహసీల్దార్ఫిర్యాదు మేరకు మక్తల్ పీఎస్‌లో ఏడుగురిపై కేసు నమోదైంది. భూమిని అమ్మేందుకు ప్రోత్సహించి డాక్యుమెంట్లో సాక్షి సంతకాలు చేసిన రాజుల ఆశిరెడ్డి, సంగంబండ లక్ష్మారెడ్డి, నీలప్ప, భూమి కొనుగోలు చేసిన దేవరింటి నర్సింహారెడ్డి, అమ్మిన ఉప్పరి వెంకప్ప, అతని అల్లుడు కిష్టప్ప, కంప్యూటర్ ఆపరేటర్ నరేందర్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాములు చెప్పారు. వీరందరికి నోటీసులు జారీ చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నరేందర్పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.
For More News..