- జూన్ 11 నుంచే ప్రారంభిస్తామని ప్రకటించిన సీఎం
- రెండు నెలలైనా పూర్తి కాని సర్వే ఏజెన్సీల ఎంపిక
- పైలట్ గ్రామాల సెలక్షన్‌లోనూ సందిగ్ధం
- 2014 ఎన్నికల హామీకి కలగని మోక్షం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సమగ్ర భూసర్వే ప్రోగ్రామ్ అటకెక్కింది. సీఎం ప్రకటన చేసి రెండు నెలలైనా సర్వే చేయాల్సిన ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. పైలట్ గ్రామాల గుర్తింపులోనూ సందిగ్ధత తొలగలేదు. దీంతో అసలు సర్వే చేస్తారా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ప్రతి ఉమ్మడి జిల్లాకు మూడు గ్రామాల చొప్పున 27 గ్రామాల్లో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 11 నుంచే సర్వే ప్రారంభవుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ గ్రామాల ఎంపిక పూర్తి కాకపోవడం, సర్వే ఏజెన్సీల దరఖాస్తుకు గడువు పెంచడంతో సర్వే వాయిదా పడింది. ఆ తర్వాత ఇటు ప్రభుత్వం గానీ, అటు సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు గానీ భూముల సర్వే ఊసే ఎత్తడం లేదు.
2014 ఎన్నికల్లో హామీ..
భూవివాదాల శాశ్వత పరిష్కారానికి సమగ్ర భూసర్వే చేపడతామని 2014 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోనే కేసీఆర్ ప్రకటించారు. మొదటిసారి అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పట్టించుకోలేదు. 2018 ఎన్నికల ప్రచారంలోనూ రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని, భూముల సర్వే చేపడతామన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అయినా సర్వే ప్రారంభించలేదు. పెండింగ్‌లోని భూవివాదాల పరిష్కారానికి సమగ్ర భూసర్వే ఒక్కటే మార్గమని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే భూముల సర్వేకు ఈ ఏడాది బడ్జెట్‌లో సర్కారు రూ.400 కోట్లు కేటాయించగా, సర్వే ప్రారంభంపై సీఎం కేసీఆర్ జూన్ 2న ప్రకటన చేశారు. ఏజెన్సీల నుంచి దరఖాస్తులూ స్వీకరించారు. అయితే ఈటల రాజీనామా తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేడెక్కడంతో సర్వేను ప్రభుత్వం పక్కన పెట్టింది.